Hurricane Ian: హరికేన్ బీభత్సం.. తేలియాడిన ఇళ్లు, వీధుల్లోకి షార్క్‌లు..!

అమెరికాలో హరికేన్ ఇయన్ బీభత్సం సృష్టించింది.

Updated : 22 Nov 2022 16:38 IST

ఫ్లోరిడా: అమెరికాలో హరికేన్ ‘ఇయన్’ బీభత్సం సృష్టించింది. బుధవారం సాయంత్రం ఇది ఫ్లోరిడా తీరాన్ని బలంగా తాకింది. దీంతో కుండపోత వర్షాలు, 200 కిలోమీటర్లకుపైగా వేగంతో వీచిన భీకర గాలులతో తీర ప్రాంత ప్రజలు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. యూఎస్‌లో రికార్డైన అత్యంత శక్తిమంతమైన తుపానుల్లో ఇదొకటని అధికారులు వెల్లడించారు. ఈ భయానక గాలుల వేగానికి లైవ్‌లో పరిస్థితి వివరిస్తున్న రిపోర్టర్లు కొట్టుకొని పోయినంతపనైంది. ఇళ్లు తేలియాడుతున్న దృశ్యాలు, నగర వీధుల్లోకి షార్క్‌లు కొట్టుకొని వచ్చిన వీడియోలు వెలుగులోకి వచ్చాయి. ఈ హరికేన్ ధాటికి తీర ప్రాంతంలో చీకట్లు కమ్ముకున్నాయి. 20 మందితో కూడిన వలసదారుల పడవ మునిగిపోయిందని యూఎస్‌ బోర్డర్ పెట్రోలింగ్ అధికారులు వెల్లడించారు. అయితే, వారిలో కొందరిని రక్షించినట్లు చెప్పారు. 

అత్యంత ప్రమాదకరమైన హారికేన్ బుధవారం సాయంత్రం తీరాన్ని తాకిందని నేషనల్ హరికేన్‌ సెంటర్‌(ఎన్‌హెచ్‌సీ) వెల్లడించింది. నేపుల్స్‌(Naples)లో వరదనీరు ఇళ్లలోకి ఉప్పొగిందని, రోడ్లు మునిగిపోయి, వాహనాలు కొట్టుకుపోయినట్లు టీవీ దృశ్యాలు బట్టి తెలుస్తోంది. మరోపక్క, ఈ హరికేన్‌ను కవర్‌ చేస్తోన్న రిపోర్టర్ గాలి వేగానికి నిల్చులేకపోయాడు. ‘నేను నిల్చులేకపోతున్నాను. గాలికి ఎగిరిపోతున్నాను’ అంటూ అతడు అరవడం వినిపిస్తోంది. తరానికి ఒకసారి వచ్చే విపత్తు వంటిదని అధికారులు హెచ్చరించారు. తీరం నుంచి లోపలికి వెళ్లే క్రమంలో దీని తీవ్రత తగ్గుతుందని హరికేన్ కేంద్రం అంచనా వేసింది. 





Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని