India: యూకే హోం సెక్రటరీ ‘వీసా’ వ్యాఖ్య.. భారత్‌ కౌంటర్‌..!

వీసా పరిమితి దాటాక కూడా బ్రిటన్‌లో ఉంటోన్న భారతీయులను ఉద్దేశించి యూకే హోం సెక్రటరీ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. దీనికి గట్టిగానే భారత్ కౌంటర్ ఇచ్చింది.

Updated : 07 Oct 2022 20:44 IST

లండన్‌: వీసా పరిమితి దాటాక కూడా బ్రిటన్‌లో ఉంటోన్న భారతీయులను ఉద్దేశించి యూకే హోం సెక్రటరీ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. దీనికి గట్టిగానే భారత్ కౌంటర్ ఇచ్చింది. గత ఏడాది రెండు దేశాల మధ్య జరిగిన మైగ్రేషన్ అండ్ మొబిలిటీ పార్టనర్‌షిప్‌(ఎంఎంపీ) ఆశించిన రీతిలో పనిచేయడం లేదని యూకే హోం సెక్రటరీ బ్రేవర్మన్‌ వ్యాఖ్యానించారు. దీంతో ఈ ఒప్పందం కింద లేవనెత్తిన అన్ని అంశాలపై చర్యలు ప్రారంభించామని ఇండియన్‌ హై కమిషన్ బదులిచ్చింది. అలాగే ఈ ఒప్పంద ప్రణాళికల్లో భాగంగా యూకే వైపు నుంచి స్పందన కోసం ఎదురుచూస్తున్నామని తెలిపింది. 

‘వీసా గడువు దాటిన తర్వాత అక్కడ నివసించే భారతీయులను వెనక్కి రప్పించే విషయంలో ఎంఎంపీ ఒప్పందంలో భాగంగా యూకేతో పనిచేసేందుకు భారత్ కట్టుబడి ఉంది. హైకమిషన్ వద్ద లేవనెత్తిన అంశాల్లో చర్యలు ప్రారంభమయ్యాయి. ఒప్పందం ప్రకారం.. యూకే కూడా మైగ్రేషన్‌ అండ్‌ మొబిలిటీ ప్రోటోకాల్‌లో భాగంగా ఇచ్చిన వాగ్దానాల అమల్లో పురోగతి కోసమే భారత్‌  ఎదురుచూస్తోంది’ అని హై కమిషన్ వెల్లడించింది.

ఇరు దేశాల మధ్య చర్చల్లో ఉన్న ప్రతిపాదిత స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం(ఎఫ్‌టీఏ)పై వీసా సంబంధిత రిజర్వేషన్ల గురించి నిన్న సుయెల్లా వివాదాస్పదంగా స్పందించారు. భారత్‌తో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై ఆందోళనలు ఉన్నాయన్నారు. దీనికి భారత్‌ హైకమిషన్‌ స్పందిస్తూ.. ‘మొబిలిటీ, మైగ్రేషన్‌కు సంబంధించిన విషయాలపై ప్రస్తుతం చర్చలు నడుస్తున్నాయి. ఈ సమయంలో వాటి గురించి వ్యాఖ్యలు సమంజసంగా ఉండకపోవచ్చు. భవిష్యత్తులో జరిగే ఏ ఒప్పందమైనా ఇరు దేశాలకు ప్రయోజనకరంగా ఉంటుంది’ అని  వెల్లడించింది.

ఎంఎంపీ సరిగా పనిచేయడంలో లేదని ఆమె చేసిన వ్యాఖ్యలను చూస్తుంటే.. ఎఫ్‌టీఏలో భారతీయులకు వీసా రాయితీలకు యూకే మంత్రివర్గం మద్దతును నిలిపివేసే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. మరోవైపు, ఈ దీపావళి నాటికి భారత్‌తో ఎఫ్‌టీఏను పూర్తిచేయాలని భావిస్తోన్న బ్రిటన్ ప్రధాని లిజ్‌ట్రస్‌కు ఇది ఇబ్బందికర పరిణామమే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని