Economic Crisis: ‘భారత్‌ మమ్మల్ని రక్షించింది.. రక్తపాతాన్ని నివారించింది..!’

తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన సమయంలో భారత్‌ తమను రక్షించిందని శ్రీలంక పార్లమెంటు స్పీకర్‌ అబేయవర్ధేన గుర్తుచేసుకున్నారు. లేనిపక్షంలో దేశంలో మరో రక్తపాతం జరిగి ఉండేదన్నారు.

Published : 08 Jul 2023 17:41 IST

కొలంబో: తీవ్ర ఆర్థిక సంక్షోభం (Economic Crisis)తో గతేడాది శ్రీలంక (Sri Lanka) అతలాకుతలమైన విషయం తెలిసిందే. నిత్యవసర వస్తువులతోపాటు గ్యాస్‌, డీజిల్‌, పెట్రోల్‌, ఔషధాల ధరలు విపరీతంగా పెరగడంతో ప్రజల జీవనం కష్టతరమైంది. దీంతో విసుగెత్తిపోయిన జనాలు పెద్దఎత్తున నిరసనలకు దిగారు. ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో శ్రీలంకకు భారత్‌ ఆపన్నహస్తం అందించింది. దాదాపు 4 బిలియన్‌ డాలర్ల మేర ఆర్థిక తోడ్పాటుతోపాటు ఔషధ సామగ్రి తదితర రూపాల్లో సాయం అందించింది. ఇదే విషయాన్ని శ్రీలంక పార్లమెంటు స్పీకర్‌ మహింద యాప అబేయవర్ధేన (Abeywardena) తాజాగా గుర్తుచేసుకున్నారు. కష్టకాలంలో భారత్‌ తమకు అండగా నిలిచిందని.. లేనిపక్షంలో దేశంలో మరో రక్తపాతం జరిగి ఉండేదన్నారు. భారత్‌ను విశ్వసనీయ మిత్రదేశంగా అభివర్ణించారు.

భారతీయ ట్రావెల్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో కొలంబోలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో అబేయవర్ధేన మాట్లాడుతూ.. ‘ఆర్థిక కష్టాల్లో ఉన్నప్పుడు భారత్‌ దన్నుగా నిలిచింది. సంక్షోభం మధ్యలో ఆరు నెలలపాటు మనుగడ సాగించడానికి ఇది తోడ్పడింది. ఇప్పుడు కూడా.. రుణాల పునర్వ్యవస్థీకరణను 12 ఏళ్లపాటు పొడిగించేందుకు సిద్ధంగా ఉందని విన్నాను. ఇది ఊహించలేదు. భారత్‌ చేసిన విధంగా శ్రీలంకకు ఏ దేశం కూడా సాయం చేయలేదు. ఈ రెండు దేశాల మధ్య నాగరికత, సంస్కృతుల మధ్య అనేక సారూప్యతలు ఉన్నాయి. మేం ఇబ్బందుల్లో ఉన్న ప్రతిసారి ఆదుకుంది. ఈ విషయంలో భారత్‌కు, ప్రధాని మోదీకి కృతజ్ఞతలు’ అని అన్నారు. శ్రీలంకకు భారత హైకమిషనర్ గోపాల్ బాగ్లే, శ్రీలంక పర్యాటక శాఖ మంత్రి హరీన్ ఫెర్నాండో తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఇదిలా ఉండగా.. విదేశీ మారక నిల్వల కొరత కారణంగా 2022లో శ్రీలంక తీవ్ర ఆర్థిక సంక్షోభానికి గురైంది. దేశవ్యాప్తంగా ప్రజలు ఆందోళనలకు దిగారు. ఈ పరిస్థితులకు అప్పటి అధ్యక్షుడు గొటబాయ రాజపక్స కారణమంటూ నిరసనలు చేపట్టారు.  ఈ పరిణామాల నడుమ గత మే నెలలో మహింద రాజపక్స ప్రధాని పదవికి బలవంతంగా రాజీనామా చేయాల్సి వచ్చింది. మరోవైపు అధ్యక్షుడిగా ఉన్న ఆయన సోదరుడు గొటబాయ దేశం విడిచి పారిపోయారు. గత రెండు దశాబ్దాలుగా శ్రీలంక రాజకీయాల్లో ఆధిపత్యం చెలాయించిన రాజపక్స కుటుంబాన్ని అధికారం నుంచి తొలగించడానికి ఈ సంక్షోభం కారణమైంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని