Published : 01 Jul 2022 02:00 IST

Pak Economic Crisis: దాయాది దేశం.. మరో శ్రీలంక కానుందా..?

ఇస్లామాబాద్‌: టీ వినియోగాన్ని తగ్గించండని మంత్రి వ్యాఖ్యలు.. రాత్రి పది దాటిన తర్వాత వివాహ వేడుకలపై నిషేధం.. కాగితం కొరత.. విద్యుత్ టారిఫ్‌లను పెంచడం.. పెట్రోలియం ఉత్పత్తులపై పన్ను విధింపు.. ఇవన్నీ ప్రస్తుతం పాకిస్థాన్‌లో నెలకొన్న పరిస్థితులు. నిధుల కొరతతో సతమతమవుతోన్న దాయాది దేశం ప్రస్తుతం ఖర్చులను తగ్గించుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది. పన్నుల ద్వారా రాబడులు పెంచుకోవాలని చూస్తోంది. ఈ పరిణామాలు చూస్తుంటే.. ఇది మరొక శ్రీలంక కానుందా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. 

టీ తగ్గించండి.. ‘టీ తాగడం 1-2 కప్పులు తగ్గించండి. విదేశీ మారక నిధులు తగ్గిపోతున్న సమయంలో ఈ చర్య వల్ల దిగుమతి భారం కాస్త తగ్గుతుంది’ అంటూ పాకిస్థాన్‌కు ఆ దేశ ప్రణాళిక శాఖ మంత్రి పిలుపునిచ్చారు. దీనిపై తీవ్రస్థాయి విమర్శలు వచ్చాయి. ‘మాపై పన్నులు విధిస్తారు. మా టీ కప్పు లాక్కుంటారు. వారు మాత్రం విలాసవంతమైన జీవితాన్ని విడిచిపెట్టరు’ అంటూ పాక్ ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 

కాగితం సంక్షోభం: ప్రస్తుతం పాక్ కాగితం కొరతతో ఉక్కిరిబిక్కిరి అవుతోంది. దీనివల్ల ఈ ఏడాది ఆగస్టులో ప్రారంభమయ్యే విద్యా సంవత్సరానికి పుస్తకాలు అందుబాటులో ఉండవని ఆ దేశ పేపర్ అసోసియేషన్ ఆందోళన వ్యక్తం చేసింది. దిగుమతి చేసుకుంటోన్న కాగితంపై భారీగా పన్నులు విధించడం, స్థానిక కాగితపు పరిశ్రమల గుత్తాధిపత్యం ఈ పరిస్థితికి దారితీస్తోంది. ఇది పేద, మధ్య తరగతి విద్యార్థుల కుటుంబాలకు భారం కానుంది. పుస్తకాల కొనుగోలు కోసం విద్యాసంస్థలు వారి నుంచి ఎక్కువ మొత్తం గుంజే అవకాశం ఉంది. 

రాత్రుళ్లు వివాహ వేడుకలు బంద్‌: విద్యుత్ ఖర్చును తగ్గించుకునే లక్ష్యంతో ఈ నెల షరీఫ్‌ ప్రభుత్వం కీలక ఆదేశాలు ఇచ్చినట్లు వార్తలు వచ్చాయి. రాత్రి పది దాటిన తర్వాత రాజధాని ఇస్లామాబాద్‌లో వివాహ వేడుకలు నిర్వహించడంపై ప్రభుత్వం నిషేధం విధించింది. శనివారం ప్రభుత్వ కార్యాలయాలకు సెలవులు ఇచ్చేందుకు సిద్ధమైంది. 

ముందుచూపు లేని నిర్ణయాలే కారణమా..?

అంతర్జాతీయ వ్యవహారాలను చూసే ICWA నివేదిక ప్రకారం.. పాక్‌ ప్రభుత్వాధినేతలు ముందుచూపు లేకుండా తీసుకున్న నిర్ణయాలే ఈ పరిస్థితులకు కారణమయ్యాయి. అభివృద్ధికి దూరంగా, లాభదాయకంగా లేని ప్రాజెక్టులపై చేసిన ఖర్చు ప్రస్తుత పరిస్థితికి దోహదం చేశాయంది. యూఎస్‌ డాలర్‌తో పోలిస్తే పాకిస్థానీ రూపాయి స్థిరంగా పతనం కావడం, అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీలు ఇచ్చే రేటింగ్ పరంగా అధమ స్థానంలో నిలవడం, మరీ ముఖ్యంగా  ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ (FATF) లో గ్రే లిస్టింగ్‌..ఇవన్నీ విదేశీ పెట్టుబడిదారులను దూరం చేశాయి. చైనా-పాకిస్థాన్‌ ఎకనామిక్ కారిడార్ (CPEC)ని ప్రారంభించడం వల్ల బాహ్య రుణాలు భారీగా పెరిగాయని తెలిపింది. ఈ చెల్లింపుల సమస్యను ఎదుర్కొనేందుకు పాక్‌.. ఐఎంఎఫ్‌ను సంప్రదించింది. 

ఈ క్రమంలో 6 బిలియన్ డాలర్ల రెస్క్యూ ప్యాకేజీని తిరిగి ప్రారంభించడానికి ఐఎంఎఫ్‌(IMF) పాకిస్థాన్‌కు కొన్ని ముందస్తు షరతులు విధించినట్లు తెలుస్తోంది. ఈ ఒప్పందంలో భాగంగా విద్యుత్ టారిఫ్‌లను పెంచడం, పెట్రోలియం ఉత్పత్తులపై పన్నులు విధించడం, ప్రభుత్వ శాఖల్లో అక్రమార్జనను అరికట్టేందుకు కట్టుదిట్ట చర్యలను చేపట్టాలని సూచించినట్లు కథనాలు వెలువడ్డాయి. దీనిపై పాక్‌ ప్రభుత్వం సానుకూలంగా స్పందించడంతో జూన్ 22న ఐఎంఎఫ్‌తో ఒప్పందం కుదిరినట్లు తెలుస్తోంది. 

Read latest World News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని

సుఖీభవ

మరిన్ని