Israel: హమాస్‌ చెరలో బందీలు.. ఇజ్రాయెల్‌ ప్రధాని కార్యాలయం వద్ద కుటుంబసభ్యుల ఆందోళన

హమాస్‌ చెరలో బందీలుగా ఉన్న వాళ్లను వెంటనే విడిపించి తీసుకురావాలని వారి కుటుంబసభ్యులు ఇజ్రాయెల్‌ ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఈ క్రమంలోనే వారంతా భారీ ర్యాలీ నిర్వహించారు. 

Updated : 19 Nov 2023 00:59 IST

జెరూసలెం: హమాస్‌(Hamad) అంతం.. వారి వద్ద బందీలుగా(Hostages) ఉన్న వారిని క్షేమంగా తీసుకురావడమే లక్ష్యంగా ఇజ్రాయెల్‌ సైన్యం(ఐడీఎఫ్‌) గాజా (Gaza)పై భీకర దాడులకు పాల్పడుతోంది. ఆ ప్రాంతాన్ని నలువైపులా చుట్టుముట్టినా.. బందీలను కనుగొనడంలో మాత్రం విఫలమవుతోంది. ఆరు వారాలు గడిచినా హమాస్‌ చెరలోని బందీల ఆచూకీ ఇంకా తెలియకపోవడంతో వారి కుటుంబసభ్యులు, సన్నిహితులు ఆందోళన చెందుతున్నారు. తమవారిని సురక్షితంగా విడిపించి తీసుకురావాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు మద్దతుదారులతో కలిసి నాలుగు రోజుల భారీ ర్యాలీ చేపట్టారు. దాదాపు 30 వేల మంది 60కి.మీ మేర పాదయాత్ర చేసుకుంటూ శనివారం దేశ రాజధానికి చేరుకొని, ప్రధానమంత్రి బెంజమిన్‌ నెతన్యాహు కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేశారు. హమాస్‌ ఉగ్రమూకలు అపహరించిన వారి ఫొటోలను ప్రదర్శిస్తూ ‘‘మావాళ్లను వెంటనే తీసుకురండి’’ అంటూ నినాదాలు చేశారు. వారిని తిరిగి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం ఏమేం చర్యలు తీసుకుందో చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఈ క్రమంలో ప్రధాని కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. ప్రభుత్వం తమను పట్టించుకోవట్లేదని, అవసరమైతే తామంతా పాదయాత్రగా గాజాకి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నట్లు బందీల కుటుంబసభ్యులు తెలిపారు. అక్టోబర్‌ 7న ఇజ్రాయెల్‌పై దాడి చేసిన హమాస్‌ మిలిటెంట్లు 240 మందిని బందీలుగా చేసుకున్నారు. 

ఇజ్రాయెల్‌ సైన్యం గాజాలోని అతిపెద్ద ఆస్పత్రి అల్‌-షిఫా సమీపంలో గురువారం ఓ మహిళ మృతదేహాన్ని గుర్తించింది. మృతురాలు హమాస్‌ వద్ద బందీలుగా ఉన్న వారిలో ఒకరని ప్రకటించిన ఐడీఎఫ్‌ మృతదేహాన్ని మరణానంతర పరీక్షలకు పంపించింది. అనంతరం ఆస్పత్రిలో నిర్వహించిన తనిఖీల్లో ఒక ల్యాప్‌టాప్‌ లభించిందని, అందులో బందీలుగా ఉన్న వారి ఫొటోలు, వీడియోలు ఉన్నాయని సైన్యం పేర్కొంది. అంతకుముందు ఆస్పత్రి ఐసీయూ విభాగంలో హమాస్‌కు చెందిన ఆయుధాలను ఐడీఎఫ్ గుర్తించిన విషయం తెలిసిందే. 

ఖాళీ అవుతోన్న ‘అల్‌-షిఫా’.. వందలాది పౌరులు బయటకు

తాజాగా ఇజ్రాయెల్‌ సైన్యం దక్షిణ గాజాపై కూడా దాడి చేస్తోంది. శనివారం జరిపిన దాడుల్లో దాదాపు 32 మందికి పైగా పాలస్తీనియన్లు ప్రాణాలు కోల్పోయినట్లు గాజా ఆరోగ్య విభాగం వెల్లడించింది. దక్షిణ ప్రాంతంలో దాడులను మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించిన ఇజ్రాయెల్‌ సైన్యం.. ఆ ప్రాంతంలోని పాలస్తీనీయులు వెంటనే పశ్చిమ ప్రాంతం వైపు వెళ్లిపోవాలని హెచ్చరికలు జారీ చేసింది. దీంతో ఖాన్‌ యూనిస్‌ పట్టణంలో నివసిస్తున్న దాదాపు 4 లక్షల మంది ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని