Pakistan: మత మార్పిడికి ‘నో’.. పాకిస్థాన్‌లో హిందూ మహిళపై ఘోరం

మత మార్పిడికి అంగీకరించని హిందూ మహిళపై దారుణం జరిగింది. కిడ్నాప్‌ చేసిన కిరాతకులు ఆమెపై మూడు రోజుల పాటు అత్యాచారం చేశారు.

Published : 23 Jan 2023 01:32 IST

కరాచీ‌: పాకిస్థాన్‌(Pakistan)లో హిందువులపై దారుణాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. సింధ్‌ ప్రావిన్స్‌లో ఓ వివాహిత మహిళపై కొందరు వ్యక్తులు కిరాతకానికి ఒడిగట్టారు. మతం మారాలని బలవంతం చేయగా అందుకు ఆమె నిరాకరించడంతో కిడ్నాప్‌(Kidnapping) చేసి అత్యాచారానికి ఒడిగట్టారు. ఉమర్‌కోట్‌ జిల్లాలోని సమరో పట్టణంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసినా ఇప్పటివరకు కేసు నమోదు చేయకపోవడం గమనార్హం. మహిళ తనపై కొందరు వ్యక్తులు కిరాతకానికి ఒడిగట్టారని చెప్పినా ఆదివారం వరకు మిర్‌పుర్‌ఖాస్‌ పోలీసులు కేసు నమోదు చేయడంలో విఫలమయ్యారని  స్థానిక హిందూ నేత ఒకరు విమర్శించారు. బాధితురాలితో పాటు ఆమె కుటుంబ సభ్యులు పోలీస్‌స్టేషన్‌ బయటే కూర్చొన్నా కేసు నమోదు చేయడంలేదన్నారు. 

మరోవైపు, తనను ఇస్లాంలోకి మారాలంటూ ఇబ్రహీం మాంగ్రియో, పున్హో మాంగ్రియో, వారి సహచరులు బెదిరించారని.. ఒప్పుకోకపోయే సరికి కిడ్నాప్‌ చేసి మూడు రోజుల పాటు అత్యాచారం చేసినట్టు బాధితురాలు వాపోయిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. కిడ్నాపర్ల నుంచి తప్పించుకొని ఇంటికి చేరుకోగలిగానని పేర్కొన్నారు.

సింధ్‌ ప్రావిన్స్‌లోని శివారు ప్రాంతాల్లో హిందూ యువతులు, మహిళల్ని కిడ్నాప్‌లు చేయడం, బలవంతంగా మతమార్పిడలకు పాల్పడటం పెద్ద సమస్యగా మారింది. హిందువులు అత్యధికంగా ఉండే ప్రాంతాలైన థార్‌, ఉమర్‌కోట్‌, మిర్‌పుర్‌ఖాస్‌, ఘోట్కి, ఖైరాపూర్‌ వంటి చోట్ల ఈ పరిస్థితి మరీ దారుణంగా ఉంది. గతేడాది జూన్‌లో తనను బలవంతంగా ఇస్లాం మతానికి మార్చి ఓ ముస్లిం పెళ్లి చేసుకున్నాడంటూ కరీనా కుమారి అనే బాలిక కోర్టుకు చెప్పింది. అలాగే, గతేడాది మార్చిలో ముగ్గురు హిందూ బాలికలు సత్రన్‌ ఓద్‌, కవితా భీల్‌, అనిత భీల్‌లను కిడ్నాప్‌ చేసి బలవంతంగా మతమార్పిడి చేయించారు. ఆ తర్వాత ఎనిమిది రోజుల్లోనే ముస్లిం పురుషులతో వారికి పెళ్లి చేయించిన ఉదంతం చోటుచేసుకుంది. అదే నెలలో పూజా కుమారి అనే యువతి ఓ పాకిస్థానీని పెళ్లి చేసుకొనేందుకు నిరాకరించడంతో సుక్కుర్‌లోని రోహ్రీలో ఆమె ఇంటి వద్దే తుపాకీతో దారుణంగా కాల్చి చంపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని