North Korea: మరోసారి కవ్వించిన ఉత్తరకొరియా..!

ఉత్తరకొరియా మరోసారి ఉద్రిక్తతలను రాజేసింది. స్థానిక కాలమానం ప్రకారం ఆదివారం ఉదయం 7గంటలకు స్వల్పశ్రేణి క్షిపణిని ప్రయోగించింది. ఈ విషయాన్ని

Updated : 25 Sep 2022 15:59 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఉత్తరకొరియా మరోసారి ఉద్రిక్తతలను రాజేసింది. స్థానిక కాలమానం ప్రకారం ఆదివారం ఉదయం 7గంటలకు స్వల్పశ్రేణి క్షిపణిని ప్రయోగించింది. ఈ విషయాన్ని దక్షిణ కొరియా సైన్యం వెల్లడించింది. టైకాన్‌ అనే ప్రదేశం నుంచి ప్రయోగించిన ఈ క్షిపణి 60 కిలోమీటర్ల ఎత్తులో ప్రయాణించి దాదాపు 600 కిలోమీటర్ల దూరంలో పడింది. దక్షిణ కొరియాతో సంయుక్తంగా నిర్వహించనున్న సైనిక విన్యాసాల కోసం అమెరికా అణుశక్తి ఎయిర్‌ క్రాఫ్ట్‌ క్యారియర్‌ రోనాల్డ్‌ రీగన్‌ కొరియా ద్వీపకల్పంలోని బుసాన్‌ పోర్టుకు చేరుకొంది. అదే సమయంలో ఈ క్షిపణి పరీక్ష జరగడం గమనార్హం. మరికొన్ని రోజుల్లో అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్‌ కూడా ద.కొరియాను సందర్శించనున్నారు.

ఉత్తరకొరియా క్షిపణి పరీక్ష తీవ్రమైన కవ్వింపు చర్య అని సియోల్‌ వర్గాలు ఆరోపించాయి. తమ సైన్యం సర్వసన్నద్ధంగా ఉందని ద.కొరియా  పేర్కొంది. అమెరికాతో కలిసి రక్షణ సహకారాన్ని మరింత బలోపేతం చేసుకొంటామని పేర్కొంది. మరోవైపు జపాన్‌ కోస్టు గార్డులు కూడా ఈ క్షిపణి పరీక్షను ధ్రువీకరించారు.

సెప్టెంబర్‌ మొదట్లో ఉత్తరకొరియా ఓ చట్టాన్ని ఆమోదించింది. దీని ప్రకారం ఆ దేశాన్ని అణుశక్తిగా ప్రకటించుకొంది. ఈ నేపథ్యంలో ఉ.కొరియాను అణ్వస్త్ర రహిత దేశంగా మార్చడంపై చర్చలకు ద్వారాలు మూసివేసినట్లైంది. అమెరికా, ఐరాస నుంచి తీవ్రమైన ఆంక్షలను ఎదుర్కొంటున్నప్పటి నుంచి 2006 నుంచి 2017 వరకు మొత్తం ఆరుసార్లు అణ్వాయుధాలను పరీక్షించింది. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని