Munitions: ఉత్తర కొరియా నుంచి రష్యాకు.. ఏడు వేల కంటెయినర్ల ఆయుధాలు!

రష్యాకు ఉత్తర కొరియా గతేడాది నుంచి దాదాపు ఏడు వేల కంటెయినర్ల ఆయుధ సామగ్రి, ఇతర సైనిక పరికరాలను చేరవేసినట్లు దక్షిణ కొరియా ఆరోపించింది. 

Published : 19 Mar 2024 00:57 IST

సియోల్‌: ఉక్రెయిన్‌పై దాడులకుగానూ రష్యా (Russia)కు ఉత్తర కొరియా (North Korea) ఆయుధ సాయం చేస్తోందనే ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలోనే గతేడాది నుంచి దాదాపు ఏడు వేల కంటెయినర్ల ఆయుధ సామగ్రి, ఇతర సైనిక పరికరాలను మాస్కోకు చేరవేసినట్లు దక్షిణ కొరియా (South Korea) ఆరోపించింది. కిమ్‌ ప్రభుత్వం మరోసారి పలు స్వల్పశ్రేణి బాలిస్టిక్‌ క్షిపణులను ప్రయోగించినట్లు వార్తలు వచ్చిన వేళ.. దక్షిణ కొరియా రక్షణశాఖ మంత్రి షిన్‌ వాన్‌-సిక్‌ ఈమేరకు మాట్లాడారు.

‘‘ఆయుధాల తరలింపునకు ప్యాంగ్‌యాంగ్‌ మొదట్లో నౌకలను, ప్రస్తుతం రైలుమార్గాలను వినియోగిస్తోంది. లక్షలాది శతఘ్ని గుండ్లు, ఇతర సామగ్రి సరఫరాకు ప్రతిఫలంగా రష్యా నుంచి 9 వేల కంటెయినర్ల సాయం పొందింది. చమురు, పెట్రోలియం ఉత్పత్తుల దిగుమతులపై ఐరాస ఆంక్షలు కొనసాగుతోన్న నేపథ్యంలో.. బహుశా ఇంధనాన్నే దిగుమతి చేసుకుని ఉండొచ్చు. ఇంధన కొరతతో కొన్నేళ్లుగా ఆ దేశం తన శీతాకాల సైనిక శిక్షణ కార్యకలాపాలను తగ్గించింది. ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరిలో మాత్రం విస్తృతం చేసింది. ఏప్రిల్‌ 10న దక్షిణ కొరియా పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో.. తన క్షిపణి పరీక్షలను మరింత ముమ్మరం చేసే అవకాశం ఉంది’’ అని షిన్‌ చెప్పారు.

కిమ్‌కు పుతిన్‌ బహుమతి.. ఏంటో తెలుసా?

దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్‌.. కిమ్‌ అణు కార్యకలాపాలు, కవ్వింపులపై కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఇదిలా ఉండగా.. అమెరికాపై కాలుదువ్వే పుతిన్‌, కిమ్‌ జోంగ్‌ ఉన్‌లు గతేడాది సెప్టెంబర్‌లో భేటీ అయ్యారు. ప్యాంగ్‌యాంగ్‌ అణ్వాయుధ సామర్థ్యాన్ని బలోపేతం చేసేందుకు అవసరమైన సాంకేతికతను రష్యా అందించడం, బదులుగా మాస్కోకు కావాల్సిన మందుగుండు సామగ్రిని అందించేందుకు కిమ్‌ అంగీకరించినట్లు ఆరోపణలు ఉన్నాయి. అయితే, వీటిని ఇరు దేశాలు ఖండించాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని