Kim - Putin: కిమ్‌కు పుతిన్‌ బహుమతి.. ఏంటో తెలుసా?

Kim - Putin: సెప్టెంబరులో కిమ్‌ జోంగ్‌ ఉన్‌, పుతిన్‌ ప్రత్యేకంగా సమావేశమైన విషయం తెలిసిందే. ఇరు దేశాల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవాలని నిర్ణయించారు.

Published : 20 Feb 2024 07:53 IST

సియోల్‌: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ (Vladimir Putin) నుంచి ఉత్తర కొరియా అధినేత కిమ్‌ జోంగ్‌ ఉన్‌ (Kim Jong Un) ఓ కారును బహుమతిగా పొందారు. వ్యక్తిగత అవసరాలకు వాడుకునేందుకే దాన్ని ఇచ్చినట్లు కొరియన్‌ సెంట్రల్‌ న్యూస్‌ ఏజెన్సీ తెలిపింది. ఫిబ్రవరి 18న కిమ్‌ తరఫున ఆయన సోదరి కిమ్‌ యో జోంగ్‌, వర్కర్స్‌ పార్టీ ఆఫ్‌ కొరియా ప్రతినిధి పాక్‌ జోంగ్‌ ఛోన్‌ దాన్ని అందుకున్నట్లు వెల్లడించింది. ఈ సందర్భంగా కిమ్‌ యో జోంగ్‌ రష్యాకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఇరువురు నేతల మధ్య ఉన్న ప్రత్యేకమైన బంధానికి ఇది నిదర్శనమని వ్యాఖ్యానించారు.

రష్యా (Russia), ఉత్తరకొరియాపై అంతర్జాతీయంగా కఠిన ఆంక్షలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. సెప్టెంబర్‌లో పుతిన్‌, కిమ్‌ మాస్కోలో సమావేశమయ్యారు. ఇరు దేశాల మధ్య బంధాన్ని మరింత బలోపేతం చేయాలని నిర్ణయించారు. ఉక్రెయిన్‌పై యుద్ధం విషయంలో రష్యాకు ఉత్తర కొరియా సహకరిస్తున్నట్లు సమాచారం. రాకెట్లు, క్షిపణులు సహా పలురకాల ఆయుధాలను సరఫరా చేస్తున్నట్లు అనుమానాలు ఉన్నాయి. ఉత్తర కొరియా మాత్రం ఈ ఆరోపణలను ఖండించింది.

వ్యక్తిగతంగా కిమ్‌ (Kim Jong Un)కు వాహనాలంటే చాలా ఇష్టమనే ప్రచారం ఉంది. ఆయన వద్ద అత్యంత విలాసవంతమైన కార్లు చాలా ఉన్నట్లు సమాచారం. దాదాపు అవన్నీ అక్రమంగా రవాణా చేసినవేనని అంటుంటారు. సెప్టెంబర్‌లో రష్యా పర్యటనకు వెళ్లినప్పుడు పుతిన్‌ కారు ఆరస్ సెనేట్ లిమోసిన్‌ను కిమ్‌ ఆసక్తిగా పరిశీలించినట్లు వార్తలు వచ్చాయి. దీన్ని గమనించి ఆయన్ని కారులో ఎక్కించుకుకొని స్వయంగా పుతిన్‌ డ్రైవ్‌ చేసినట్లు  కథనాలు వెలువడ్డాయి. కిమ్‌ దగ్గర మెర్సిడెస్‌, రోల్స్‌ రాయిస్‌, మేబ్యాక్, లెక్సస్‌కు చెందిన పలు లగ్జరీ కార్లు ఉన్నట్లు సమాచారం. వాస్తవానికి వీటిని ఉత్తర కొరియాకు ఎగుమతి చేయడంపై ఐరాస నిషేధం విధించింది. తాజాగా పుతిన్‌ కారు పంపడం సైతం ఆంక్షల ఉల్లంఘన కిందకే వస్తుందని నిపుణులు అంటున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు