North Korea: అంతర్జాతీయ ఆంక్షలున్నా.. ఆగని ఉత్తర కొరియా!

అంతర్జాతీయ ఆంక్షలు ఉన్నప్పటికీ.. ఉత్తర కొరియా ఇటీవల ఒక్క జనవరిలోనే ఏడు క్షిపణి ప్రయోగాలు చేపట్టడం చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. అమెరికాకు చెందిన గ్వామ్‌ దీవిని కూడా తాకగల మధ్యశ్రేణి క్షిపణిని విజయవంతంగా పరీక్షించినట్లు ప్రకటించడం గమనార్హం...

Published : 07 Feb 2022 01:47 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: అంతర్జాతీయ ఆంక్షలు ఉన్నప్పటికీ.. ఉత్తర కొరియా ఇటీవల ఒక్క జనవరిలోనే ఏడు క్షిపణి ప్రయోగాలు చేపట్టడం చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. అమెరికాకు చెందిన గ్వామ్‌ దీవిని కూడా తాకగల మధ్యశ్రేణి క్షిపణిని విజయవంతంగా పరీక్షించినట్లు ప్రకటించడం గమనార్హం. అయితే, ఈ దేశం గతేడాది ఎటువంటి అణు పరీక్షలు, ఖండాంతర బాలిస్టిక్ క్షిపణుల ప్రయోగాలు చేపట్టలేదు. కానీ.. చాపకింద నీరులా అణు, క్షిపణుల అభివృద్ధి కార్యక్రమాలను మాత్రం యథావిధిగా కొనసాగించినట్లు తెలుస్తోంది. ఆంక్షల పర్యవేక్షణ సంస్థలు(శాంక్షన్‌ మానిటర్స్‌) ఈ వ్యవహారంపై ఓ నివేదికను రూపొందించి తాజాగా ఐరాస భద్రతా మండలికి అందజేసినట్లు ఓ వార్తాసంస్థ పేర్కొంది.

క్రిప్టో కరెన్సీ కోసం సైబర్‌ దాడులు!

‘ఉత్తర కొరియా తనపై అంతర్జాతీయ ఆంక్షలు ఉన్నప్పటికీ గతేడాది అణు, బాలిస్టిక్ క్షిపణి కార్యక్రమాల నిర్వహణ, అభివృద్ధి ప్రక్రియను నిరంతరం కొనసాగించింది. వీటికి సంబంధించిన  మెటీరియల్ సేకరణ, శాస్త్ర, సాంకేతిక పరిశోధనలు చేపట్టింది’ అని నివేదిక పేర్కొంది. క్రిప్టో కరెన్సీ కోసం సైబర్‌ దాడులకూ పాల్పడినట్లు తెలిపింది. ప్రస్తుతం క్రిప్టో కరెన్సీనే ఈ దేశానికి ముఖ్య ఆదాయ వనరుగా ఉందని వెల్లడించింది. ఇదిలా ఉండగా.. ఉత్తర కొరియా ఆయుధ కార్యక్రమాలపై ఆంక్షలు కొనసాగుతోన్న విషయం తెలిసిందే. దీంతోపాటు బొగ్గు, ఇనుము, సీసం, వస్త్రాలు, మత్స్య, ఇతర ఉత్పత్తుల ఎగుమతులపై నిషేధం ఉంది. ఒకవైపు పశ్చిమ దేశాలు ప్యోంగ్యాంగ్‌పై మరింత ఒత్తిడి పెంచుతుండగా.. మరోవైపు చైనా, రష్యాలు మాత్రం మానవతా దృక్పథంతో ఆంక్షలను సడలించాలని కోరుతున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని