UN report: అఫ్గాన్‌లో పాక్‌ ఉగ్రవాద సంస్థలు.. భారత్‌కు ఐరాస హెచ్చరిక

పాకిస్థాన్‌కు చెందిన ఉగ్రవాద సంస్థలు అఫ్గానిస్థాన్‌లో శిక్షణ శిబిరాలను నిర్వహిస్తున్నట్లు ఐక్యరాజ్య సమితి (UN) నివేదిక వెల్లడించింది.......

Published : 31 May 2022 00:17 IST

దిల్లీ: 26/11 ముంబై ఉగ్రదాడుల సూత్రధారి హఫీజ్ సయీద్ నేతృత్వంలోని జైషే మహ్మద్ (JeM), లష్కరే తొయిబా (LeT) లాంటి పాకిస్థాన్‌కు చెందిన ఉగ్రవాద సంస్థలు అఫ్గానిస్థాన్‌లో శిక్షణ శిబిరాలను నిర్వహిస్తున్నట్లు ఐక్యరాజ్య సమితి (UN) నివేదిక వెల్లడించింది. అఫ్గాన్‌లోని పలు ప్రావిన్సుల్లో పాక్‌కు ఉగ్రవాద సంస్థల శిక్షణ శిబిరాలు సాగుతున్నట్లు తాజా నివేదిక తెలిపింది. ఈ నేపథ్యంలోనే భారత్‌ సహా పలు దేశాలను హెచ్చరించింది. ఉగ్ర‌వాద చ‌ర్య‌ల ప‌రిశోధ‌న‌, ఆంక్ష‌ల ప‌ర్య‌వేక్ష‌ణ బృందం సమర్పించిన 13వ నివేదిక‌లో ఆయా విష‌యాలు ఉన్నాయ‌ని ఐక్యరాజ్య సమితి పేర్కొంది. ఐక్య‌రాజ్య స‌మితిలోని భార‌త శాశ్వ‌త ప్ర‌తినిధి టీఎస్ తిరుమూర్తి కూడా ఈ బృందంలో ఉన్నారు. తాలిబన్ల‌పై ఆంక్ష‌ల క‌మిటీ ఛైర్మ‌న్‌గానూ ఆయ‌న కొన‌సాగుతున్నారు.

అఫ్గానిస్థాన్‌లో కొంత కాలంగా బలహీనపడుతూ వస్తున్న అల్‌-ఖైదా ఉగ్రవాద సంస్థ ఏక్యూఐఎస్‌.. మళ్లీ తన ఉనికిని చాటుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు ఐక్యరాజ్య సమితి తన నివేదికలో తెలిపింది. ప్రస్తుతం అఫ్గాన్‌లో తక్కువ ప్రభావాన్నే కలిగి ఉన్నా.. ఆ సంస్థలో ఉగ్రవాదుల సంఖ్య మాత్రం ఎక్కువగానే ఉందని పేర్కొంది. 180 నుంచి 400 మంది వరకు ముష్కరులు ఉన్నట్లు అంచనా వేసింది. వీరిలో బంగ్లాదేశ్, భారత్‌, మయన్మార్, పాకిస్థాన్ దేశాలకు చెందిన వారు ఉన్నట్లుగా తెలిపింది. ‘ఉగ్రవాద సంస్థలు జైషే మహమ్మద్​, లష్కరే తోయిబా.. అఫ్గానిస్థాన్​లోని పలు రాష్ట్రాల్లో శిక్షణ శిబిరాలు ఏర్పాటు చేసుకున్నాయి. నంగర్​హార్​ ప్రాంతంలో జైషే ఉగ్రసంస్థ 8 క్యాంపులు నిర్వహిస్తుండగా.. అందులో మూడు తాలిబన్ల నియంత్రణలో ఉన్నాయి’ అని నివేదిక పేర్కొంది.

అల్ ఖైదా తన ప్రాబల్యాన్ని పెంచుకోవడానికి ప్రయత్నిస్తోందని, ఫలితంగా రానున్న రోజుల్లో ఉగ్ర ముప్పు ఉండొచ్చని నివేదిక అంచనా వేసింది. అల్ ఖైదాకు నాయకత్వం వహిస్తున్న ఐమన్ ముహమ్మద్ రబీ అల్ జవహిరి అఫ్గానిస్థాన్‌లోనే ఉన్నట్లు తెలిపింది. సంస్థ కార్యకలాపాలు సైతం ఆ దేశంతో పాటు పాకిస్థాన్‌లోనూ విస్తరిస్తున్నట్లు తన నివేదికలో ఐరాస వెల్లడించింది. ప్రస్తుతం ఈ ఉగ్రవాద సంస్థ తన మ్యాగజైన్‌ పేరును మార్చుకుందని, ఈ మార్పుతో భారత్​తో సహా ఆయా దేశాలు అప్రమత్తంగా ఉండాలని ఐరాస హెచ్చరించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని