Pakistan: సంక్షోభంలో పాకిస్థాన్‌.. నాలుగేళ్లలో ఐదో ఆర్థికమంత్రి రాజీనామా

పాకిస్థాన్‌ ఆర్థిక మంత్రి మిఫ్తా ఇస్మాయిల్‌ తన పదవికి రాజీనామా చేయనున్నట్లు ప్రకటించారు.

Published : 27 Sep 2022 01:38 IST

లండన్‌: గత కొన్నేళ్లుగా పాకిస్థాన్‌ (Pakistan) ఆర్థికంగా గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. ద్రవ్యోల్బణం మొదలు ఇటీవల భారీ వరదల వంటి వరస సవాళ్లతో (Economic Crisis) ఉక్కిరిబిక్కిరవుతోంది. దీంతో ఆ దేశ ఆర్థికశాఖ మంత్రులు ఎక్కువ కాలం ఆ పదవిలో కొనసాగలేకపోతున్నారు. తాజాగా ఆ దేశ ఆర్థిక మంత్రి (Finance Minister) ఇస్మాయిల్‌ కూడా రాజీనామా చేయనున్నట్లు ప్రకటించారు. ఇలా గడిచిన నాలుగేళ్లలోపే ఐదో ఆర్థిక మంత్రి ఆ పదవిని వీడనున్నారు. మరోవైపు విదేశీ పర్యటనలో ఉండగానే పాకిస్థాన్‌ ఆర్థికమంత్రి ఇస్మాయిల్‌ రాజీనామా ప్రకటించడం గమనార్హం.

‘ఆర్థిక మంత్రిగా మౌఖికంగా ఇప్పటికే రాజీనామా చేశాను. ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌, మాజీ పీఎం నవాజ్‌ షరీఫ్‌లతో జరిగిన సమావేశంలో నా నిర్ణయాన్ని వెల్లడించాను. పాకిస్థాన్‌కు చేరుకున్న వెంటనే లిఖితపూర్వకంగా రాజీనామా చేస్తాను’ అని పాకిస్థాన్‌ ఆర్థిక మంత్రి మిఫ్తా ఇస్మాయిల్‌ (Miftah Ismail) ప్రకటించారు. అయితే, ఇటీవల ఇంధన ధరల పెంపుతో పాటు పలు కీలక అంశాలపై ఇస్మాయిల్‌ తీసుకున్న నిర్ణయాలపై మాజీ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌ అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే ఇస్మాయిల్‌ రాజీనామా ప్రకటించినట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం లండన్‌లో ఉన్న ప్రధాని షరీఫ్‌, ఆర్థికమంత్రి ఇస్మాయిల్‌లు వచ్చేవారం పాకిస్థాన్‌కు చేరుకోనున్నారు.

గత కొంతకాలంగా పెరుగుతోన్న ద్రవ్యోల్బణం, తరిగిపోతోన్న విదేశీ మారక నిల్వలతో పాకిస్థాన్‌ తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. వీటికితోడు ఇటీవల అక్కడ సంభవించిన భారీ వరదల్లో 1500 మంది ప్రాణాలు కోల్పోవడమే కాకుండా సుమారు రూ.2లక్షల కోట్ల మేర ఆస్తి నష్టం వాటిల్లినట్లు అంచనా. ఇలా తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిన పాకిస్థాన్‌ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు ఆర్థిక మంత్రులు ప్రయత్నిస్తున్నప్పటికీ సఫలం కావడం లేదు. దీంతో ఏడాది కాకుండానే దేశ ఆర్థికమంత్రులు తమ పదవులను వీడుతున్నారు. ఇలా గడిచిన నాలుగేళ్లలోపే నలుగురు ఆర్థికమంత్రులు మారిపోయారు. ప్రస్తుతం ఇస్మాయిల్‌ కూడా రాజీనామాను ప్రకటించడంలో ఐదో వ్యక్తిగా నిలిచారు. ఈయన స్థానంలో పీఎంఎల్‌-ఎన్‌ నేత ఇషాక్‌ దార్‌ను నూతన ఆర్థిక మంత్రిగా నియమించనున్నట్లు సమాచారం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని