Pakistan: దురుద్దేశంతోనే ముశాల్‌కు కేబినెట్‌లో చోటు.. పాక్‌ నిర్ణయంపై మాజీ డీజీపీ వ్యాఖ్య

పాక్‌ (Pakistan) కేబినెట్‌లో వేర్పాటువాద నేత యాసీన్‌ మాలిక్‌ (Yasin Malik) భార్య ముశాల్‌కు (Mushaal) చోటు దక్కింది. ఈ నిర్ణయాన్ని ఆక్షేపిస్తూ జమ్మూకశ్మీర్‌ మాజీ డీజీపీ ఒకరు ట్వీట్ చేశారు. 

Published : 18 Aug 2023 17:35 IST

ఇంటర్నెట్‌ డెస్క్: దురుద్దేశంతోనే యాసీన్‌ మాలిక్‌ (Yasin Malik) భార్య ముశాల్‌ హుస్సేన్‌ మాలిక్‌కు (Mushaal) పాక్‌ (Pakistan) కేబినెట్‌లో చోటు కల్పించారని జమ్మూకశ్మీర్ మాజీ డీజీపీ శేష్‌పాల్‌ వైద్‌ అన్నారు. పాకిస్థాన్‌ ఆపద్ధర్మ ప్రధాని అన్వరుల్‌ హక్‌ కాకర్‌ కేబినెట్‌లో కశ్మీర్‌ వేర్పాటువాద నేత యాసీన్‌ మాలిక్‌ భార్య ముశాల్‌ హుస్సేన్‌ మాలిక్‌ను సలహాదారుగా నియమించడంపై మాజీ డీజీపీ స్పందిస్తూ ట్విటర్‌లో పోస్టు పెట్టారు. పాక్‌ కేబినెట్‌లో ఆమెకు చోటు కల్పించడం ద్వారా వేర్పాటువాదులకు తమ దేశం మద్దతు పలుకుతుందనే సందేశాన్ని భారత్‌కు పంపించిందని శేష్‌పాల్‌ పేర్కొన్నారు. మానవ హక్కులపై ప్రధానికి ప్రత్యేక సలహాదారుగా ముశాల్‌ వ్యవహరించనున్నట్లు వార్తలు వెలువడిన నేపథ్యంలో మాజీ డీజీపీ ఇలా వ్యాఖ్యానించారు. ఈ విమర్శపై యాసిన్‌ మాలిక్‌కు చెందిన జమ్మూ కశ్మీర్‌ లిబరేషన్‌ ఫ్రంట్‌ (జేకేఎల్ఎఫ్‌) స్పందించింది. ‘మేము ఆమెను గౌరవిస్తాం. కానీ, ఆమెకు జేకేఎల్‌ఎఫ్‌లో సభ్యత్వం లేదు. జేకేఎల్‌ఎఫ్‌, యాసిన్‌ భావజాలంతో ఆమెకు ఎలాంటి సంబంధం లేదని’ ట్వీట్ చేసింది.

వేదికను పంచుకోనున్న మోదీ-జిన్‌పింగ్‌..!

కశ్మీర్‌ వేర్పాటువాదిగా ముద్రపడిన యాసిన్‌ మాలిక్‌ ప్రస్తుతం తిహాడ్‌ జైలులో జీవిత ఖైదు అనుభవిస్తున్నాడు. ఉగ్రవాద కార్యకలాపాలకు నిధులు సమకూర్చాడనే ఆరోపణలు నిరూపితం కావడంతో అతడికి శిక్ష పడింది. అప్పట్లో ముఫ్తీ మహమ్మద్‌ సయీద్‌ కుమార్తె రబియా సయీద్‌ను అపహరించి యాసిన్‌ మాలిక్‌ సంచలనం సృష్టించాడు. 1989లో రబియాను అపహరించి.. ప్రతిగా ఆమెను విడుదల చేయడానికి ఐదుగురు ఉగ్రవాదులను విడిపించుకున్నారు. రబియా మొహబూబా ముఫ్తీ సోదరి. తాజాగా యాసీన్‌ భార్యకు పాక్‌ కేబినెట్‌లో చోటు దక్కడంపై మొహబూబా ముఫ్తీని ఓ మీడియా సంస్థ స్పందన కోరింది. ‘భారత్‌లో ఏం జరుగుతుందో మాట్లాడండి.. పాకిస్థాన్‌లో కాదు. భారత్‌లో ఎన్నికల సంఘం సహా అన్ని వ్యవస్థలను నాశనం చేస్తున్నారని’ ఆమె మండిపడ్డారు. 

ఎవరీ ముశాల్?

ముశాల్‌ హుస్సేన్ మాలిక్‌ పాకిస్థాన్‌ దేశస్థురాలు. లండన్‌ స్కూల్‌ ఆఫ్‌ ఎకనామిక్స్‌లో చదివి ఆమె పట్టభద్రురాలైంది. 2009లో యాసిన్‌ను వివాహమాడింది. అప్పటికి ముశాల్‌ వయసు 23 ఏళ్లు కాగా.. యాసీన్‌కు 42 సంవత్సరాలు. ముషాల్‌కు చిత్రకారిణిగానూ పేరుంది. ఆమె గీసిన కొన్ని చిత్రాలు ఎంతో ప్రాచుర్యం పొందాయి. ప్రభుత్వ లెక్కల ప్రకారం ముషాల్‌ 2014లో రెండుసార్లు భారత్‌కు వచ్చింది. ఆ తర్వాత తన వీసా రెన్యువల్ చేసుకోలేదు. 2019లో యాసిన్‌ అరెస్టు నేపథ్యంలో మళ్లీ వీసా కోసం దరఖాస్తు చేసుకుంది. వీరి 11 ఏళ్ల కుమార్తె రజియా సుల్తాన్.. జైల్లో ఉన్న తన తండ్రిని చూడటానికి ఇటీవల అనుమతి కోరినట్లు సమాచారం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని