Pakistan: పాకిస్థాన్‌పై మరో పిడుగు.. త్వరలో ఇంధన సంక్షోభం..!

ఇప్పటికే తీవ్ర విద్యుత్‌ సంక్షోభంతో కొట్టుమిట్టాడుతోన్న పాకిస్థాన్‌.. త్వరలోనే ఇంధన సంక్షోభాన్ని ఎదుర్కొనుందనే వార్తలు వినిపిస్తున్నాయి. కనిష్ఠ  స్థాయికి పాకిస్థానీ రూపాయి విలువ పడిపోవడంతో దిగుమతుల కోసం భారీగా చెల్లించాల్సి వస్తున్నట్లు అంతర్జాతీయ నివేదికలు వెల్లడిస్తున్నాయి.

Published : 01 Feb 2023 01:47 IST

ఇస్లామాబాద్‌: తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని (Economic Crisis) ఎదుర్కొంటున్న పాకిస్థాన్‌లో పరిస్థితులు మున్ముందు మరింత దిగజారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా విదేశాల నుంచి ఇంధనం దిగుమతి చేసుకునేందుకు విదేశీ మారక నిల్వలు సరిపడా లేకపోవడంతో పాక్‌ (Pakistan) ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ఇందుకోసం రుణ సాయం, చెల్లింపులు చేయడాన్ని బ్యాంకులు నిలిపివేయడంతో ఇంధన సంక్షోభానికి (Fuel Crisis) దారితీయనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే తీవ్ర విద్యుత్‌ సంక్షోభంతో కొట్టుమిట్టాడుతోన్న పాకిస్థాన్‌.. ఈ క్రమంలో మరో శ్రీలంక మాదిరిగా తయారవుతుందా అనే ఆందోళనలు కూడా అక్కడ నెలకొన్నాయి.

పాకిస్థాన్‌ దిగుమతుల్లో అత్యధిక భాగం ఇంధనానిదే. దేశంలో విద్యుత్‌ వార్షిక వినియోగంలో మూడో వంతు దిగుమతి చేసుకున్న సహజ వాయువుతోనే తయారవుతోంది. పాకిస్థానీ రూపాయి విలువ రికార్డు స్థాయిలో కనిష్ఠానికి పడిపోతుండటంతో దిగుమతుల కోసం భారీగా చెల్లించాల్సి వస్తోంది. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం మొదలుపెట్టినప్పటి నుంచి ధరలు పెరగడం పాకిస్థాన్‌కు గుదిబండగా మారింది. విదేశీ మారక నిల్వలు క్షీణిస్తున్న కారణంగా ఆయిల్‌ వ్యాపారులు కూడా పాకిస్థాన్, శ్రీలంక వంటి దేశాలకు దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది.

మరోవైపు పాకిస్థాన్‌ ప్రభుత్వ రంగ ఆయిల్‌ సంస్థలైన పీఎస్‌ఓతోపాటు పాకిస్థాన్‌ ఎల్ఎన్‌జీ లిమిటెడ్‌లు గత రెండు నెలలుగా టెండర్లే పిలవలేదట. బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి లెటర్‌ ఆఫ్‌ క్రెడిట్‌ల్లో ఆలస్యం కారణంగా పెట్రోల్‌ కార్గోలు రద్దైనట్లు ప్రభుత్వ రంగ ఆయిల్‌ సంస్థలకు చెందిన సీనియర్‌ అధికారులు వెల్లడించారు. దీంతో రానున్న రోజుల్లో ఇంధన సంక్షోభం తప్పదనే ఆందోళన అక్కడి అధికారుల్లో మొదలైనట్లు తెలుస్తోంది. ‘పక్షం రోజుల వరకు ఇంధన కొరత ఏమీ ఉండదు. లెటర్‌ ఆఫ్‌ క్రెడిట్‌(LCs) ఇప్పుడు రాకుంటే.. రెండు వారాల తర్వాత ఈ కొరత కనిపించవచ్చు’ అని ఓ ఆయిల్‌ సంస్థకు చెందిన సీనియర్‌ అధికారి మీడియాకు వెల్లడించారు.

అధికారుల లెక్కల ప్రకారం, పాకిస్థాన్‌కు ప్రతినెల 4.3 లక్షల టన్నుల పెట్రోల్‌, 2 లక్షల టన్నుల డీజిల్‌, ఆరున్నర లక్షల టన్నుల క్రూడ్‌ ఆయిల్‌ అవసరం. వీటి విలువ 1.3 బిలియన్‌ డాలర్లుగా అంచనా. 2021 డిసెంబర్‌లో 6 లక్షల టన్నుల పెట్రోల్‌ను దిగుమతి చేసుకోగా.. గతేడాది డిసెంబరులో కేవలం 2.2 లక్షల టన్నుల పెట్రోల్‌ మాత్రమే కొనుగోలు చేసినట్లు ఓసీఏసీ వెల్లడించింది. మరోవైపు అంతర్జాతీయ ద్రవ్యనిధి (IMF) నుంచి ఆర్థిక ప్యాకేజీని ఆశిస్తోన్న పాకిస్థాన్‌.. ఆ సంస్థ పెట్టే షరతులకు కట్టుబడి ఉంటామని తెలిపింది. దీంతో ఐఎంఎఫ్‌కు అనుగుణంగా పెట్రోల్‌, డీజిల్‌ ధరలను భారీగా పెంచింది. ఆదివారం ఒక్కరోజే 16శాతం పెంచగా.. పెట్రోల్‌ ధర లీటరుకు 249 పాకిస్థానీ రూపాయలకు చేరింది.
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని