Imran Khan: భారత్‌ను ఏ ‘సూపర్‌ పవర్‌’ శాసించలేదు’ : ఇమ్రాన్‌ ఖాన్‌

సుప్రీంకోర్టు నిన్న ఇచ్చిన తీర్పు తనను తీవ్ర నిరాశకు గురిచేసిందని పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ అన్నారు....

Updated : 09 Apr 2022 04:10 IST

ఇస్లామాబాద్‌: పాక్‌ సార్వభౌమత్వాన్ని కాపాడుకోవాలని అక్కడి ప్రజలకు ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ పిలుపునిచ్చారు. ప్రజలు ఆదివారం శాంతియుతంగా వీధుల్లోకి వచ్చి ‘దిగుమతి చేసుకున్న ప్రభుత్వానికి’ వ్యతిరేకంగా నిరసన చేపట్టాలని కోరారు. విదేశీ శక్తులు పాకిస్థాన్‌లో తమ ప్రభుత్వాన్ని పడగొట్టి వారికి అనుకూలమైన వ్యక్తిని అధికారంలోకి కూర్చోబెట్టాలని చూస్తున్నాయని విమర్శించారు. అవినీతి కేసుల నుంచి బయటపడేందుకు, డబ్బులు సంపాదించేందుకు ప్రతిపక్షాలు వారితో చేతులు కలిపాయన్నారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు తనను తీవ్ర నిరాశకు గురిచేసిందని పేర్కొన్నారు. తనపై ప్రతిపక్షాలు ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానాన్ని రద్దు చేస్తూ జాతీయ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌ ఖాసిం సూరి తీసుకున్న వివాదాస్పద నిర్ణయాన్ని కొట్టివేస్తూ సుప్రీంకోర్టు నిన్న రాత్రి ఇచ్చిన ఇచ్చిన తీర్పు తనను బాధించిందనీ.. కానీ ఆ తీర్పును గౌరవిస్తున్నట్టు తెలిపారు. సుప్రీం తీర్పు నేపథ్యంలో శనివారం ఉదయం 10గంటలకు జాతీయ అసెంబ్లీని సమావేశపరిచి, ప్రతిపక్షాల అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్‌ ఎదుర్కోవాల్సి ఉంది. ఈ తరుణంలో శుక్రవారం రాత్రి ఆయన జాతినుద్దేశించి కీలక ప్రసంగం చేశారు. ఈ సందర్భంగా భారత్‌పై మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. ఏ అగ్రారాజ్యం భారత విదేశాంగ విధానాన్ని శాసించలేదని పేర్కొన్నారు. ‘ఇతరుల కంటే భారత్‌ గురించి నాకే ఎక్కువగా తెలుసు. ఏ ‘సూపర్‌ పవర్‌’ భారత విదేశాంగ విధానాన్ని శాసించలేదు. దానికి కారణం ఆర్‌ఎస్‌ఎస్‌ భావజాలమే. అదే భారత్‌ను పాకిస్థాన్‌ను వేరుచేసింది’’ అని అన్నారు. పాకిస్థాన్‌కు స్వతంత్ర విదేశాంగ విధానం ఉండాలని ఇమ్రాన్‌ఖాన్‌ పేర్కొన్నారు.  

ఈ సందర్భంగా ఇమ్రాన్‌ ఖాన్‌ ప్రతిపక్షాలతో పాటు ఆ దేశ మీడియాపైనా తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ప్రతిపక్షాలు బేరసారాలకు పాల్పడుతున్నాయని ఆరోపించారు. సభ్యులను గొర్రెల్లాగా కొనుగోలు చేస్తున్నాయని, ప్రమాదకరమైన గుర్రపుస్వారీ చేస్తున్నాయని ఆరోపించారు. తన ప్రభుత్వాన్ని కూల్చేందుకు అంతర్జాతీయ కుట్ర ఉందంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. విదేశీ శక్తులు పాకిస్థాన్‌లో నామమాత్రపు వ్యక్తిని అధికారంలో కూర్చోబెట్టేందుకు ప్రయత్నిస్తున్నాయని మండిపడ్డారు. పాకిస్థాన్‌లో  ప్రపంచంలో ఎక్కడా లేనివిధంగా, బనానా రిపబ్లిక్‌ (రాజకీయంగా అస్తవ్యస్థంగా ఉండటంతో పాటు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న దేశాలను బనానా రిపబ్లిక్‌ అని వ్యవహరిస్తారు) ఉన్నచోటా ఇలా బహిరంగంగా జరగదని వ్యాఖ్యానించారు. 22 కోట్ల మన ప్రజలకు ఎవరో బయటి నుంచి ఆర్డర్లు ఇవ్వడం తీవ్ర అవమానకరమని వ్యాఖ్యానించారు. ప్రభుత్వ పతనాన్ని సంబరాలు చేసుకుంటోందంటూ పాక్‌ మీడియాపైనా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని