G20 Summit: ప్రపంచం మమ్మల్ని పక్కనపెట్టింది : భారత్‌పై ‘పాకిస్థానీల’ ప్రశంసలు!

అగ్రదేశాధినేతలు వచ్చిన సదస్సును (G20 Summit) విజయవంతంగా నిర్వహించడంపై పాక్‌ పౌరులు భారత్‌పై ప్రశంసలు గుప్పిస్తున్నారు.

Published : 14 Sep 2023 16:35 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: జీ20 శిఖరాగ్ర సదస్సులో చేసిన తీర్మానాలకు (Delhi Declaration) సభ్యదేశాల్లో ఏకాభిప్రాయం తెచ్చేందుకు భారత్‌ చేసిన కృషిపై ప్రపంచ దేశాలు ప్రశంసలు కురిపించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో దాయాది దేశం (Pakistan) మాత్రం అధికారికంగా ఎటువంటి ప్రకటన చేయలేదు. కానీ, అగ్రదేశాధినేతలు వచ్చిన సదస్సును (G20 Summit) విజయవంతంగా నిర్వహించడంపై పాక్‌ పౌరులు మాత్రం భారత్‌పై ప్రశంసలు గుప్పిస్తున్నారు. విదేశాంగ విధానంలో తమ దేశం విఫలమైందని.. ప్రపంచ దేశాలు తమను పక్కనపెట్టాయని వాపోయారు. అగ్రదేశాధినేతలు పర్యటించడం భారతీయులకు ఎంతో గర్వకారణమని, ప్రపంచానికి భారత్‌ ఎంతో ముఖ్యమైన దేశంగా నిలిచిందనే విషయం నిరూపితమవుతోందని అన్నారు.

దిల్లీలో ఇటీవల నిర్వహించిన జీ20 సదస్సుకు 20 సభ్యదేశాల అధినేతలతో సహా 30దేశాధినేతలు హాజరయ్యారు. దీనిపై పాకిస్థానీ పౌరులు స్పందిస్తూ.. ‘జీ20 సదస్సు నిర్వహించడం యావత్‌ దేశానికి (భారత్‌కు) ఎంతో గర్వకారణమే కాకుండా వారి ఆర్థికవ్యవస్థకు ఎంతో ఊతమిస్తుంది’ అని కరాచీకి చెందిన ఓ వ్యక్తి మీడియాతో పేర్కొన్నాడు. ‘సౌదీ అరేబియా యువరాజు కూడా భారత్‌కు వచ్చారు. పాకిస్థాన్‌కు వస్తాడని భావించినప్పటికీ రాలేదు. దీన్ని బట్టి చూస్తేనే ప్రపంచానికి భారత్‌ ఎంత ముఖ్యమైందో అర్థమవుతోంది. జీ20 వంటి అతిపెద్ద సదస్సులు నిర్వహించినప్పుడు.. ఆ దేశం (భారత్‌) ఎలా ముందుకు వెళ్తుందో ప్రత్యక్షంగా గమనించే వీలుంటుంది’ అని మరో స్థానికుడు పేర్కొన్నాడు.

జీ20 సదస్సు నిర్వహణ భేష్‌..భారత్‌కు అమెరికా ప్రశంస

ఈ సదస్సుకు బంగ్లాదేశ్‌కు ఆహ్వానం పంపినప్పటికీ.. పాకిస్థాన్‌కు మాత్రం ఎటువంటి పిలుపు లేకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోందని కరాచీకి చెందిన ఓ వ్యక్తి పేర్కొన్నాడు. పాకిస్థాన్‌ విదేశీ విధానం ఎంత బలహీనంగా ఉందో అర్థమవుతోందన్నాడు. జీ20 నిర్వహణతో భారత్‌ మాత్రం మరో ముందగుడు వేసిందన్నారు. ‘ఇలా తమ దేశం ఒంటరి అయ్యిందని భావిస్తోన్న వేళ.. దేశ భౌగోళిక రాజకీయ పరిస్థితులు దారుణంగా క్షీణించాయి. గడిచిన 5-6 ఏళ్లలో మా ఆర్థికవ్యవస్థ, భద్రతా పరిస్థితులు మరింత దిగజారాయని.. అందుకే ప్రపంచం తమను (Pakistan) పక్కన పెట్టేసింది’ అని మరో వ్యక్తి వాపోయాడు. తమ ఆర్థిక వ్యవస్థను రక్షించుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న వేళ.. భారత్‌ మాత్రం టాప్‌20 దేశాలకు ఆతిథ్యమివ్వడం ఆ దేశ (భారత్‌) పౌరులకు ఎంతో గర్వకారణమని కరాచీకి చెందిన మరో స్థానికుడు పేర్కొన్నాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని