SCO Summit: ప్రపంచ తయారీ కేంద్రంగా భారత్‌ : ఎస్‌సీవో సదస్సులో ప్రధాని మోదీ

ప్రపంచ వ్యాప్తంగా సరఫరా గొలుసుకు తీవ్ర ఆటంకాలు ఏర్పడుతోన్న తరుణంలో మెరుగైన రవాణా వ్యవస్థలను కొనసాగించడానికి ప్రాంతీయ కూటమి దేశాలు పరస్పరం సహకరించుకోవాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు.

Published : 16 Sep 2022 17:40 IST

వచ్చేఏడాది భారత్‌లో సదస్సుకు చైనా మద్దతు

సమర్‌ఖండ్‌: ఓవైపు కరోనా వైరస్‌ మహమ్మారి (Coronavirus), మరోవైపు ఉక్రెయిన్‌లో యుద్ధం (Ukraine Crisis) కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఆహార, ఇంధన సంక్షోభాలు నెలకొన్నాయి. వీటివల్ల సరఫరా గొలుసుకు తీవ్ర ఆటంకాలు ఏర్పడుతోన్న తరుణంలో మెరుగైన రవాణా వ్యవస్థలను కొనసాగించడానికి ప్రాంతీయ కూటమి దేశాలు పరస్పరం సహకరించుకోవాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. ఉజ్బెకిస్థాన్‌లో జరుగుతోన్న షాంఘై సహకార సంస్థ (SCO Summit) సదస్సులో సభ్య దేశాలనుద్దేశించి ప్రసంగించిన మోదీ.. భారత్‌ను ప్రపంచంలోనే తయారీ హబ్‌గా తీర్చిదిద్దడంలో పురోగతి సాధిస్తున్నామని అన్నారు.

‘కొవిడ్‌-19 మహమ్మారిని ప్రపంచం దీటుగా ఎదుర్కొంటోంది. దీంతో పాటు ఉక్రెయిన్‌లో నెలకొన్న సంక్షోభం కారణంగా ప్రపంచ సరఫరా వ్యవస్థలకు ఎన్నో ఆటంకాలు ఏర్పడుతున్నాయి. ఈ నేపథ్యంలో మెరుగైన కనెక్టివిటీ, ఆటంకం లేని రవాణా వ్యవస్థలపై ఎస్‌సీవో దృష్టి సారించాలి. ఈ విషయంలో కూటమి దేశాల మధ్య పరస్పర విశ్వాసం, సహకారానికి భారత్‌ పూర్తి మద్దతు ఇస్తుంది’ అని ప్రధాని మోదీ పేర్కొన్నారు. యుద్ధం కారణంగా దెబ్బతిన్న అఫ్గానిస్థాన్‌కు వస్తువులు సరఫరా చేసేందుకు భారత్‌ చేస్తోన్న ప్రయత్నాలకు పాకిస్థాన్‌ అడ్డుతగులుతున్న విషయాన్నిపరోక్షంగా తెలుపుతూ ప్రధాని ఈ వ్యాఖ్యలు చేశారు. ఇక ప్రతి రంగంలోనూ ఆవిష్కరణలను ప్రోత్సహిస్తోన్న భారత్‌... ఎస్‌సీవో దేశాలతోనూ కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉందన్నారు.

ఆవిష్కరణల కేంద్రంగా భారత్‌..

‘ప్రజా కేంద్రక అభివృద్ధి మోడల్‌పై మేం దృష్టి పెడుతున్నాం. ప్రతి రంగంలోనూ ఆవిష్కరణలకు మద్దతు ఇస్తున్నాం. ప్రస్తుతం దేశంలో 70 వేల స్టార్టప్‌లతోపాటు వందకుపైగా యూనికార్న్‌ సంస్థలు ఉన్నాయి. ఈ ఏడాది భారత్‌ వృద్ధిరేటు 7.5 శాతంగా అంచనా వేస్తున్నాం. ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతోన్నదాంట్లో భారత్‌ కూడా ఒకటని చెప్పడం సంతోషంగా ఉంది. సంప్రదాయ వైద్య చికిత్సలో ఎంతో పురోగతి సాధిస్తున్నాం’ అని ప్రధాని మోదీ వివరించారు. ఈ క్రమంలో అంతర్జాతీయ సంప్రదాయ ఔషధ కేంద్రాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇటీవలే గుజరాత్‌లో ప్రారంభించిన విషయాన్ని గుర్తుచేశారు.

భారత్‌లో సదస్సుకు చైనా మద్దతు

మరోవైపు, ఎస్‌సీవో సదస్సు సందర్భంగా ప్రాంతీయ భద్రతా పరిస్థితులు, వాణిజ్యాన్ని మరింత మెరుగుపరచుకునే మార్గాలు, అందుకు అవసరమైన సౌకర్యాల కల్పనపై ప్రధాని మోదీ, రష్యా అధ్యక్షుడు పుతిన్‌, చైనా అధ్యక్షుడు షి జిన్‌పింగ్‌తోపాటు ఎస్‌సీవో కూటమి దేశాల అధినేతలు చర్చించారు. ఈ సందర్భంగా సభ్యదేశాధినేతలు గ్రూప్‌ ఫొటో దిగిన సమయంలో ప్రధాని మోదీ, చైనా అధ్యక్షుడు షి జిన్‌పింగ్‌ పక్కపక్కనే నిలబడటం విశేషం. ఐతే వచ్చే ఏడాది ఎస్‌సీవో సదస్సుకు భారత్‌ అధ్యక్షత వహించడానికి చైనా అధ్యక్షుడు షి జిన్‌పింగ్‌ పూర్తి మద్దతు ప్రకటించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని