Severodonetsk: ఆ విషయంలో రష్యా చెబుతున్నవి అబద్ధాలే: ఉక్రెయిన్‌

తూర్పు ఉక్రెయిన్‌లోని పారిశ్రామిక నగరమైన సీవీరోడొనెట్స్క్‌ సమీప గ్రామాలపై మాస్కో దళాలు చేపట్టిన దాడులను తిప్పికొట్టినట్లు ఉక్రెయిన్‌ సైన్యం తాజాగా ప్రకటించింది...

Published : 20 Jun 2022 02:22 IST

కీవ్‌: తూర్పు ఉక్రెయిన్‌లోని పారిశ్రామిక నగరమైన సీవీరోదొనెట్స్క్‌ను స్వాధీనం చేసుకునేందుకు రష్యన్‌ బలగాలు సర్వశక్తులొడ్డుతున్న విషయం తెలిసిందే. అయితే.. ఈ నగర సమీపంలోని గ్రామాలపై మాస్కో దళాలు చేపట్టిన దాడులను తిప్పికొట్టినట్లు ఉక్రెయిన్‌ సైన్యం తాజాగా ప్రకటించింది. ‘తోష్‌కివ్కా ప్రాంతంలో రష్యా దాడులను మా యూనిట్లు తిప్పికొట్టాయి. దీంతో శత్రు దేశం వెనక్కి వెళ్లింది. మరోసారి దాడులకు సన్నద్ధమవుతోంది’ అని ఆదివారం వెల్లడించింది. ఒరిఖోవ్ దిశగానూ క్రెమ్లిన్‌ సేనలు దూసుకెళ్తున్నాయని.. అయితే, ఆ గ్రామ సమీపంలో జరిగిన దాడిని విజయవంతంగా ఎదుర్కొన్నట్లు పేర్కొంది. సీవీరోదొనెట్స్క్ వెలుపలి స్థావరాల్లో భీకర పోరు జరుగుతోందని అధికారులు వెల్లడించిన విషయం తెలిసిందే. ఈ నగరంలో అధిక భాగం ప్రస్తుతం రష్యా నియంత్రణలో ఉన్నప్పటికీ.. పూర్తిస్థాయిలో కాదని చెప్పారు.

‘సీవీరోదొనెట్స్క్‌పై పట్టుసాధించామని మాస్కో చెబుతున్నవన్నీ అబద్ధాలే. నగరంలో చాలావరకు వారి నియంత్రణలో ఉన్న మాట వాస్తవమే. అయినప్పటికీ.. పూర్తి నగరం వారికి చేజిక్కలేదు’ అని స్థానిక గవర్నర్‌ సెర్గీ గైదే ఆదివారం తెలిపారు. రష్యా ఎప్పటికప్పుడు తన సైన్యాన్ని భర్తీ చేస్తోందని, ఈ ప్రాంతానికి కొత్త దళాలను తీసుకొస్తోందన్నారు. మరోవైపు వందలాది పౌరులు తలదాచుకున్న స్థానిక అజోట్ రసాయన కర్మాగారంపై 24 గంటల వ్యవధిలో రెండుసార్లు దాడి జరిగిందన్నారు. దీంతో ఫ్యాక్టరీ మురుగు శుద్ధి ప్లాంట్‌ ధ్వంసమైందని చెప్పారు. సీవీరోదొనెట్స్క్‌లో పౌరులకు స్వచ్ఛమైన నీరు, ఆహారం కరవైందని ఐరాస ఇటీవల హెచ్చరించిన విషయం తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని