Ukraine Crisis: రష్యా-ఉక్రెయిన్‌ పట్టాలపై సమరం ఎందుకు..?

ఉక్రెయిన్‌పై రష్యా సేనలు దండెత్తిన నాటి నుంచి రైల్వే లైన్లు కీలకంగా మారాయి. ముఖ్యంగా తూర్పు ఉక్రెయిన్‌లో ఇవి నిర్ణాయకంగా

Published : 02 Jun 2022 01:50 IST

దళాల జీవరేఖగా రైల్వేలు

 

ఇంటర్నెట్‌డెస్క్‌: ఉక్రెయిన్‌పై రష్యా సేనలు దండెత్తిన నాటి నుంచి రైల్వే లైన్లు కీలకంగా మారాయి. ముఖ్యంగా తూర్పు ఉక్రెయిన్‌లో ఇవి నిర్ణయాత్మకంగా మారడంతో వీటిపై ఆధిపత్యం కోసం.. లేదా ప్రత్యర్థులకు నిరుపయోగంగా మార్చడం కోసం ఇరుపక్షాలు తీవ్రంగా యత్నిస్తున్నాయి. ఇటీవల లైమన్‌ పట్టణంలో రష్యా దళాలు ఓ రైల్వే హబ్‌ను స్వాధీనం చేసుకొన్నాయి. తాజాగా దానికి సమీపంలోనే పొపాస్నా అనే మరో కీలక రైల్వే జంక్షన్‌ కోసం హోరాహోరీగా పోరాడుతున్నాయి. ఉక్రెయిన్‌ దళాలు రష్యాను తీవ్రంగా ప్రతిఘటిస్తున్న సీవియెరోదొనెట్స్క్లో కూడా కీలకమైన కార్గోస్టేషన్‌ ఉంది. వీటిని జాగ్రత్తగా పరిశీలిస్తే రైల్వే మార్గాల్లో కీలక ప్రదేశాలపై మాస్కో ఎక్కువ దృష్టిపెట్టినట్లు అర్థమవుతోంది. 

రష్యా సరఫరాలు ఆ మార్గంలోనే..

ప్రపంచంలో రైల్వేలపై అత్యధికంగా ఆధారపడే సైన్యాల్లో రష్యా ముందు వరుసలో ఉంటుంది. సైనిక చర్య తొలినాళ్లలో రైల్వే లైన్లపై పట్టు సాధించలేక.. రోడ్డు మార్గాన్ని నమ్ముకొని రష్యా దళాలు తీవ్రంగా ఇబ్బంది పడ్డాయి. కానీ, ఆ తర్వాత మాస్కో ఉక్రెయిన్‌లోని తూర్పు డాన్‌బాస్‌ ప్రాంతంపై దృష్టిపెట్టి భారీగా భూభాగాలను స్వాధీనం చేసుకొంది. దీనికి ముఖ్యకారణం అప్పటికే అక్కడ రష్యా కొంత భూభాగాన్ని ఏళ్ల క్రితమే తమ అధీనంలోకి తీసుకుంది. ఆ ప్రాంతంలో రైల్వే మార్గాల నుంచి రష్యా తమ దళాలకు మందుగుండు, రేషన్‌ను సరఫరా చేసింది.

వాస్తవానికి డాన్‌బాస్‌ ప్రాంతం పారిశ్రామికంగా అభివృద్ధి చెందడంతో అక్కడ బలమైన రైల్వే నెట్‌వర్క్ ఉంది. 19వ శతాబ్ధంలో పారిశ్రామిక విప్లవం మైదలైనప్పటి నుంచి ఇక్కడి గనులు, కర్మాగారాలు, రేవులను అనుసంధానించేలా రైల్వేలైన్లను ఏర్పాటు చేశారు. దీంతోపాటు పంటలు బాగా పండే ప్రాంతం కావడంతో ప్రపంచ దేశాలకు ధాన్యం ఎగుమతుల కోసం కూడా రైల్వేలను గణనీయంగా అభివృద్ధి చేశారు. 

డాన్‌బాస్‌ మైదాన ప్రాంతం కావడంతో ఇక్కడ భారీ స్థాయిలో శతఘ్నులు, ట్యాంకులు, హోవిట్జర్లను రష్యా మోహరించింది. భారీ బరువుతో ఉండే వీటిని తరలించాలంటే రోడ్లు ఏమాత్రం తట్టుకోలేవు. రైళ్లు మాత్రమే అత్యంత అనుకూలంగా ఉంటాయి. దీంతోపాటు బలగాలకు ఇంధనం, ఆహారం భారీ ఎత్తున తరలించేందుకు అవకాశం లభిస్తుంది. రష్యాకు చెందిన సైనిక వ్యూహాలను అధ్యయనం చేసిన అమెరికా లెఫ్టినెంట్‌ కర్నల్‌ అలెక్స్ వెర్షినిన్‌ మాట్లాడుతూ... ‘‘రాకెట్‌ లాంఛర్లు, శతఘ్నులు వంటి భారీ ఆయుధాల తరలింపునకు మాస్కో రైళ్లపైనే పూర్తిగా ఆధాపడింది. రష్యన్లు చొచ్చుకొచ్చే కొద్దీ రైల్వేనెట్‌వర్క్‌లను ఆక్రమిస్తారు. డాన్‌బాస్‌లో ఇలాంటి నెట్‌వర్క్‌లకు కొదవలేదు. రైల్వేలు లేని చోట రష్యన్లు 120 మైళ్ల వరకు మాత్రమే సప్లై లైన్లను నిర్వహించగలరు’’ అని పేర్కొన్నారు. 

కేవలం యుద్ధానికే కాదు.. రష్యా స్వాధీనం చేసుకొన్న ప్రదేశాల్లో నివసించే ప్రజలకు అవసరమైన నీరు, ఆహారం, ఇతర వస్తువులు సరఫరా చేయడానికి కూడా రైళ్లు అత్యంత కీలకమైనవి. ఇవి సక్రమంగా జరిగితేనే ప్రజలపై రష్యాకు నియంత్రణ లభిస్తుంది.

సొంత నెట్‌వర్క్‌లను ధ్వంసం చేసుకొన్న ఉక్రెయిన్‌..

దండయాత్ర మొదలైన నాటి నుంచి రష్యాకు అనుసంధానమయ్యే రైల్వే నెట్‌వర్క్‌లను ఉక్రెయిన్‌ దళాలే ధ్వంసం చేశాయి. మాస్కో సేనలు ముందడుగు వేయకుండా ఈ నిర్ణయం తీసుకొన్నాయి. ఏప్రిల్‌లో ఉక్రెయిన్‌ సరిహద్దుల్లో రష్యాలోని బెల్‌గ్రోడ్‌ను కలిపే రైలు వంతెనను పేల్చివేశాయి. మే నెలలో సీవియెరోదొనెట్స్క్ సమీపంలోని రైలు నెట్‌వర్క్‌లను ధ్వంసం చేశాయి.  ‘రష్యన్లకు ఉపయోగపడకుండా ఉక్రెయిన్‌ దళాలు రైలు నెట్‌వర్క్‌లను పేల్చివేస్తున్నాయి’ అని లండన్‌లోని రాయల్‌ యునైటెడ్‌ సర్వీస్‌ ఇన్‌స్టిట్యూట్‌ పరిశోధకులు ఎమ్లీ ఫెర్రీస్‌ పేర్కొన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని