Russia: అనుమానాస్పద స్థితిలో రష్యా చమురు కంపెనీ డిప్యూటీ సీఈవో మృతి..!

యుద్ధం మొదలైన తొలినాళ్లలో ఉక్రెయిన్‌పై సానుభూతి చూపిన రష్యా కంపెనీ లుక్‌ ఆయిల్‌లో కీలక అధికారుల మరణాలు కొనసాగుతున్నాయి. తాజాగా సంస్థ డిప్యూటీ సీఈవో కార్యాలయంలోనే ఉరేసుకున్నాడు.

Updated : 15 Mar 2024 13:14 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: రష్యా (Russia)లోని రెండో అతిపెద్ద చమురు కంపెనీలో అనుమానాస్పద మరణాలు కొనసాగుతున్నాయి. తాజాగా లుక్‌ఆయిల్‌ కంపెనీలో మరో కీలక అధికారి ప్రాణాలు తీసుకున్నాడు. చమురు రంగ దిగ్గజాల్లో ఒకరైన విటాలీ రాబర్ట్స్‌ ఇటీవల మాస్కోలోని తన కార్యాలయంలో శవమై కనిపించాడు. అతడు ఆత్మహత్య చేసుకున్నట్లు భావిస్తున్నారు. ఈ విషయాన్ని అక్కడి మీడియా వర్గాలు ధ్రువీకరించాయి. ప్రస్తుతం అతడు కంపెనీ డిప్యూటీ సీఈవోగా పనిచేస్తున్నాడు. ఆఫీసులోనే ఉరి వేసుకున్నట్లు చెబుతున్నారు.

ఉక్రెయిన్‌తో యుద్ధం మొదలైన నాటి నుంచి లుక్‌అయిల్‌లో అనుమానాస్పద పరిస్థితిలో మరణించిన నాలుగో అధికారి రాబర్ట్స్‌. వీరంతా ఆత్మహత్యలు చేసుకుని లేదా ఊపిరాడక ప్రాణాలు కోల్పోయారు. రాబర్ట్స్‌ దాదాపు 30 సంవత్సరాల నుంచి ఈ కంపెనీలో పనిచేస్తున్నాడు. రష్యా ఫ్యూయల్‌ ఎనర్జీ కాంప్లెక్స్ ఏర్పాటులో అతడి పాత్ర కీలకం. అతడు ఆత్మహత్యకు ముందు విపరీతమైన తలనొప్పితో బాధపడ్డట్లు చెబుతున్నారు.

వాస్తవానికి యుద్ధం మొదలయ్యాక ఈ కంపెనీ చేసిన ప్రకటన వివాదాస్పదంగా మారింది. ఉక్రెయిన్‌లో విషాదకర పరిస్థితిపై అప్పట్లో ఆందోళన వ్యక్తం చేసింది. ఆ తర్వాత మే 2022లో కంపెనీ టాప్‌ మేనేజర్‌ అలెగ్జాండర్‌ సుబ్బోటిన్‌ (44) తన ఇంటి బేస్‌మెంట్‌లో అనుమానాస్పద స్థితిలో మరణించాడు.

హూతీల వద్ద హైపర్‌సోనిక్‌ క్షిపణులు!

ఇక 2022 సెప్టెంబర్‌ 1వ తేదీన లుక్‌ఆయిల్‌ ఛైర్మన్‌ రావిల్‌మాగ్నోవ్‌ ఓ ఆసుపత్రి కిటికీ నుంచి పడి ప్రాణాలు కోల్పోయాడు. ప్రమాదానికి గల కారణాలు తెలియలేదు. 2023 అక్టోబర్‌లో కంపెనీ డైరెక్టర్ల బోర్డు ఛైర్మన్‌ వ్లాదిమిర్‌ నెక్రసోవ్‌ హఠాత్తుగా గుండెపోటుతో ప్రాణాలు వదిలారు. 

రష్యాలో పుతిన్‌ను లేదా ఆయన నిర్ణయాలను విమర్శించిన వారు వరుసగా ప్రాణాలు కోల్పోతున్నారు. ఉక్రెయిన్‌తో యుద్ధం మొదలైనప్పటి నుంచి ఆయన విమర్శకుల్లో 19 మంది చనిపోయినట్లు గణాంకాలు చెబుతున్నాయి. రష్యా అధికారులు వీటిని ఆత్మహత్యలు, ప్రమాదాలుగా చెబుతున్నారు. ఇప్పటి వరకు అనుమానాస్పద రీతిలో లేదా హఠాత్తుగా వివిధ కారణాలతో మరణించిన రష్యా రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు ఏదో ఒక సందర్భంలో పుతిన్‌పై విమర్శలు చేసినవారే కావడం గమనార్హం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని