Ukraine Crisis: సొంత వాహనాలనే ధ్వంసం చేసుకుంటున్న రష్యా సైనికులు..!

ఉక్రెయిన్‌పై యుద్ధం చేస్తున్న రష్యా దళాల పరిస్థితి కూడా రోజురోజుకు దయనీయంగా మారుతున్నట్లు తెలుస్తోంది. ఆహారం, నీరు లభించక సైనికులు అల్లాడిపోతున్నట్లు సమాచారం.....

Published : 02 Mar 2022 18:50 IST

కీవ్‌: ఉక్రెయిన్‌పై యుద్ధం చేస్తున్న రష్యా దళాల పరిస్థితి కూడా రోజురోజుకు దయనీయంగా మారుతున్నట్లు తెలుస్తోంది. ఆహారం, నీరు లభించక సైనికులు అల్లాడిపోతున్నట్లు సమాచారం. దీనికి తోడు కనిపించిన వారినల్లా కాల్చిపడేయాలని పైనుంచి ఆదేశాలు రావడంతో.. అందుకు మనసొప్పక మల్లగుల్లాలు పడుతున్నట్లు ఓ నివేదిక పేర్కొంది. ఈ తరహా విధ్వంసం చేసేందుకు ఇష్టపడని కొందరు సైనికులు తమ సొంత వాహనాలనే ధ్వంసం చేసుకుంటున్నట్లు ‘న్యూయార్క్‌ టైమ్స్‌’ ఓ కథనంలో వెల్లడించింది.

రష్యా తరఫున యుద్ధంలో పాల్గొంటున్న సైనికుల్లో అధిక శాతం మంది యువతే ఉన్నారని.. అయితే పూర్తిస్థాయి యుద్ధంలో ఎలా పాల్గొనాలో వారికి సరైన శిక్షణ అందలేదని కథనం తెలిపింది. దీంతోపాటు వారికి అందాల్సిన మంచినీరు, ఆహారం, ఇంధనం లాంటి వనరులు లేక తీవ్ర ఇక్కట్లు పడుతున్నట్లు వివరించింది. అందుకే ఉద్ధేశపూర్వకంగానే తమ వాహనాలకు రంధ్రాలు చేస్తూ ధ్వంసం చేస్తున్నాయని.. ఉక్రెయిన్‌ సైనికులకు పట్టుబడిన రష్యా సైనికులే ఈ విషయాన్ని వెల్లడించినట్లు న్యూయార్క్‌ టైమ్స్‌ పేర్కొంది.

అయితే ఇలాంటి పరిస్థితులు ఎదురవుతున్న నేపథ్యంలో.. రష్యా కమాండర్లు తమ యుద్ధ ప్రణాళికల్లో మార్పులు చేపట్టే అవకాశం ఉన్నట్లు అభిప్రాయాలు వెల్లడవుతున్నాయని కథనం తెలిపింది. యుద్ధంలో ముందుకు సాగడానికి, రాజధాని కీవ్‌పై పూర్తిస్థాయిలో పట్టు సాధించి, ఇతర నగరాలను ఆక్రమించుకునేందుకు తమ ప్రణాళికలు మార్చుకునే అవకాశం ఉందని పేర్కొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని