Saddam Hussein: నియంత విలాస నౌక.. నేటికీ సగం నీళ్లలోనే!

ఇరాక్‌పై అమెరికా సంకీర్ణ దళాల దండయాత్రకు 20 ఏళ్లు పూర్తవుతోంది. నాటి ఇరాక్‌ అధ్యక్షుడు సద్దాం హుస్సేన్‌ శక్తిసంపదలకు, అమెరికన్‌ సేనల దాడులకు గుర్తుగా ఇప్పటికీ ఓ విలాసవంత నౌక మనకు సగం నీట మునిగి కనిపిస్తుంది.

Published : 20 Mar 2023 14:28 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఇరాక్‌పై అమెరికా సంకీర్ణ దళాల దండయాత్ర(Iraq Invasion)కు నేటికి 20 ఏళ్లు పూర్తయ్యింది. 2003 మార్చి 20న అమెరికా, బ్రిటన్‌, ఆస్ట్రేలియా, పోలాండ్‌లకు చెందిన పదాతిదళాలు ఇరాక్‌(Iraq)లోకి ప్రవేశించాయి. భారీ విధ్వంసాన్ని సృష్టించే ఆయుధాల(MDW)ల ఏరివేత, దేశాధ్యక్షుడు సద్దాం హుస్సేన్‌(Saddam Hussein) ఉగ్రవాదానికి అందిస్తోన్న మద్దతు నిర్మూలన, ఇరాకీయులను విముక్తులను చేయడమే లక్ష్యంగా చెబుతూ.. దాదాపు 1.70 లక్షలకుపైగా సైనికులు ఇరాక్‌ వీధుల్లో అడుగుపెట్టారు. ఈ పరిణామాలతో సద్దాం 24 ఏళ్ల పాలనకు తెరపడింది. తదనంతరం అమెరికా సేనలకు బందీగా పట్టుబడిన ఆయనకు.. 2006 డిసెంబర్ 30న ఉరిశిక్ష అమలు చేసిన విషయం తెలిసిందే.

ఇలా.. ఇరాక్‌ దండయాత్రకు రెండు దశాబ్దాలు పూర్తవుతోన్నా.. సద్దాం హుస్సేన్‌ శక్తిసంపదలకు చిహ్నంగా, అమెరికన్‌ దాడులకు గుర్తుగా నేటికీ ఓ విలాస నౌక మనకు కనిపిస్తుంది. అదే ‘అల్‌- మన్సూర్‌’. ఇరాక్‌లోని ఓ జలరవాణా మార్గంలో సగం మునిగిపోయి, తుప్పుపట్టిన స్థితిలో ఉన్న ఈ నౌక.. నాటి చరిత్రను గుర్తుచేస్తుంది. 121 మీటర్ల పొడవున్న ‘అల్- మన్సూర్’ను 1980ల్లో నిర్మించారు. సద్దాంకు చెందిన మూడు నౌకల్లో ఇదీ ఒకటి. బంగారు కుళాయిలు, ఈత కొలనులు తదితర విలాస సౌకర్యాలతో తీర్చిదిద్దిన దీనిపై గరిష్ఠంగా 200 మంది ప్రయాణించవచ్చు. రాకెట్‌ లాంచింగ్‌ వ్యవస్థ, హెలిప్యాడ్‌ కూడా ఉన్నాయి. దండయాత్ర సమయంలో.. దాన్ని భద్రంగా ఉంచేందుకుగానూ బస్రాలో లంగరు వేయాలంటూ సద్దాం ఆదేశాలు జారీ చేశాడు.

అయితే, కొన్ని రోజులకే సంకీర్ణ సేనలు.. ‘అల్‌- మన్సూర్‌’ను లక్ష్యంగా చేసుకున్నాయి. దాడుల్లో ధ్వంసమైన ఈ నౌక.. షత్‌ అల్-అరబ్ జలమార్గంలో క్రమంగా ఒరిగిపోయి, సగం మునిగిపోయింది. ఒకవైపు సద్దాం పరారీ, మరోవైపు స్థానికంగా గందరగోళ పరిస్థితుల నడుమ.. అందులోని ఖరీదైన సామగ్రి, ఫర్నిచర్‌, విడిభాగాలు, ఇతరత్రా వస్తువులు లూటీ అయ్యాయి. శిథిలావస్థకు చేరుకున్న ఈ నౌక ప్రస్తుతం.. సందర్శకులు, స్థానికులకు విడిదిగా మారింది. ‘సద్దాం హయాంలో ఎవరూ దీని దగ్గరికి వచ్చే సాహసం చేయలేదు. ఇప్పుడు దాని చుట్టే తిరుగుతున్నారు’ అని స్థానికులు చెబుతున్నారు. దీన్ని పరిరక్షించాలన్న డిమాండ్‌ ఉన్నప్పటికీ.. ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు. ఇదిలా ఉండగా.. సకల సౌకర్యాలతో తయారు చేయించుకున్న ఈ నౌకలో సద్దాం ఎప్పుడూ ప్రయాణించకపోవడం గమనార్హం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని