Sri Lanka: శ్రీలంకలో ఔషధాల కొరత.. రోగులకు ‘మరణశిక్ష’ లాంటిదే..!

తీవ్ర ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్లాడుతోన్న ద్వీప దేశం శ్రీలంకను అత్యవసరాల కొరత కూడా వేధిస్తోంది. సంక్షోభం కారణంగా ఔషధాల కొరత ఏర్పడటంతో వైద్యులు అత్యవసర శస్త్రచికిత్సలను కూడా వాయిదా

Updated : 23 May 2022 15:06 IST

మందులు లేక కీలక ఆపరేషన్లూ చేయలేకపోతోన్న వైద్యులు

ఇంటర్నెట్‌ డెస్క్‌: తీవ్ర ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్లాడుతోన్న ద్వీప దేశం శ్రీలంకను అత్యవసరాల కొరత కూడా వేధిస్తోంది. సంక్షోభం కారణంగా ఔషధాల కొరత ఏర్పడటంతో వైద్యులు అత్యవసర శస్త్రచికిత్సలను కూడా వాయిదా వేయాల్సి వస్తోంది. పరిస్థితి ఇలాగే కొనసాగితే రాబోయే రోజుల్లో మరణాలు తప్పవని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

ఔషధాల సరఫరా కోసం శ్రీలంక విదేశాలపై ఆధారపడాల్సిందే. ఆ దేశం వినియోగించే మొత్తం ఔషధాల్లో 80శాతం దిగుమతి చేసుకునేవే. అయితే ఇప్పుడు విదేశీ కరెన్సీ రిజర్వులు తరగిపోవడంతో ఔషధాలను దిగుమతి చేసుకునే అవకాశం లేకుండా పోయింది. అటు ఔషధ నిల్వలు కూడా కరిగిపోయాయి. దీంతో ఆరోగ్య వ్యవస్థ కుప్పకూలే స్థితికి చేరుకుందని అక్కడి వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మందులు లేక అత్యవసర ఆపరేషన్లను కూడా చేయలేకపోతున్నామని అంటున్నారు. దీంతో రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వారి ఆరోగ్యం నానాటికీ మరింత క్షీణిస్తోందని చెబుతున్నారు. తక్షణమే ఔషధ సరఫరాను పెంచకపోతే అనేక మంది రోగులకు అది మరణ శిక్షతో సమానమేనని హెచ్చరిస్తున్నారు.

దాదాపు 180 రకాల ఔషధాల కొరత ఉందని మందుల సరఫరా విభాగంలో పనిచేస్తోన్న ప్రభుత్వ అధికారి ఒకరు తెలిపారు. డయాలసిస్‌ రోగులకు ఇంజెక్షన్లు, క్యాన్సర్‌ ఔషధాలు కూడా అందుబాటులో లేవన్నారు. దీంతో ఆయా రోగులు ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపారు. ఔషధ సాయం చేసేందుకు భారత్‌, జపాన్‌ లాంటి దేశాలు ముందుకొచ్చినప్పటికీ.. మందులు దేశానికి వచ్చేందుకు నెలల సమయం పడుతుందని అన్నారు.

ఈ సందర్భంగా ప్రభుత్వ వైద్యాధికారుల సంఘం అధికార ప్రతినిధి డా. వాసన్‌ రత్నసింగం మాట్లాడుతూ.. ‘‘పెట్రోల్‌, వంట గ్యాస్‌ కోసం క్యూలైన్లలో నిల్చున్నట్లు కాదు.. ఔషధాల కొరత పరిస్థితి. చికిత్స ఆలస్యమైతే రోగుల పరిస్థితి దారుణంగా ఉంటుంది. ఒకవేళ మందుల కోసం రోగులు క్యూలైన్లలో నిల్చోవాల్సి వస్తే వారి ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంది’’ అని ఆవేదన వ్యక్తం చేశారు.

ఆశలు వదులుకోవాల్సిందేనా..

నాలుగేళ్ల చిన్నారి బినులీ బింసారా లుకేమియాతో బాధపడుతోంది. మందులు లేక ఇప్పుడు ఆ పాప ప్రాణాలతో కొట్టుమిట్టాడుతోంది. ‘‘ఇప్పటిదాకా మందులు ఉన్నాయి కదా పాపను బతికించుకోవచ్చన్న ఆశతో ఉన్నాం. కానీ ఇప్పుడు ఔషధాల కొరతతో ఆ ఆశ కూడా లేకుండా పోయింది. మేం నిస్సహాయ స్థితిలో ఉన్నాం. పాపకు చికిత్స చేసేందుకు మందులు లేవని వైద్యులు చెప్పినప్పటి నుంచి మా జీవితం అంధకారంగా మారింది. విదేశాలకు తీసుకెళ్లి వైద్యం చేయించే స్తోమత మాకు లేదు’’ అంటూ చిన్నారి తల్లిదండ్రులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని