Kabul: విద్యార్థులు పరీక్షలకు సిద్ధమవుతుండగా.. ఆత్మాహుతి దాడి..!

శుక్రవారం ఉదయం అఫ్గానిస్థాన్‌ రాజధాని కాబుల్‌కు సమీపంలోని విద్యాకేంద్రంలో ఆత్మాహుతి దాడి జరిగింది.

Updated : 30 Sep 2022 13:56 IST

కాబుల్‌: రాజకీయంగా అస్థిరత్వంతో కొట్టుమిట్టాడుతోన్న అఫ్గానిస్థాన్‌ వరుస పేలుళ్లతో దద్దరిల్లుతోంది. శుక్రవారం ఉదయం రాజధాని నగరం కాబుల్‌లోని ఓ విద్యాకేంద్రంలో ఆత్మాహుతి దాడి జరిగింది. విద్యార్థులు ఒకవైపు పరీక్షలకు సిద్ధం అవుతుండగా ఈ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 19 మంది మరణించారని పోలీసులు వెల్లడించారు.

రాజధానికి సమీపంలోని మైనార్టీ హజారా కమ్యూనిటీ ప్రజలు అధికంగా ఉండే దశ్త్‌-ఇ-బార్చి ప్రాంతంలో ఈ పేలుడు జరిగింది. ‘విద్యార్థులు పరీక్షలకు సిద్ధం అవుతోన్న సమయంలో ఈ ఆత్మాహుతి దాడి చోటుచేసుకుంది. ఈ ఘటనలో 19 మంది మరణించారు. 27 మంది గాయపడ్డారు’అని  పోలీసులు తెలిపారు. ఈ ఘటనను ఆ దేశ హోం శాఖ తీవ్రంగా ఖండించింది.

అఫ్గాన్‌లో అమెరికా తన బలగాలను ఉపసంహరించడంతో తాలిబన్లు పౌర ప్రభుత్వాన్ని కూలదోల్చి అధికారాన్ని హస్తగతం చేసుకున్నారు. ఈ క్రమంలో హజారా కమ్యూనిటీపై వరుస దాడులు జరుగుతున్నాయి. వీటిలో ఐసిస్‌ హస్తం కూడా ఉంది. తాలిబన్లు అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యార్థినులు, యువతులు తిరిగి విద్యాసంస్థల్లో చేరుకోకుండా అడ్డుకుంటున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని