Domestic work: ఇన్నాళ్లు ఇంటిపని చేశారుగా.. దానికీ చెల్లించాల్సిందే!: కోర్టు కీలక తీర్పు

ఇంటి పని(domestic work)కే పరిమితమైన మహిళలకు ఎలాంటి జీతం ఉండదు. స్పెయిన్‌కు చెందిన కోర్టు విడాకుల కేసులో దీనికీ లెక్క కట్టి కీలక తీర్పు ఇచ్చింది. 

Published : 09 Mar 2023 18:56 IST

మాడ్రిడ్: కొందరు మహిళలు(women) కెరీర్‌లో ఉన్నత శిఖరాలు అధిరోహిస్తూ.. తమకు నచ్చినట్టుగా జీవితాన్ని డిజైన్ చేసుకుంటారు. వారి ఆర్థిక స్థిరత్వానికి ఢోకా ఉండదు. మరికొందరు కుటుంబం కోసం కెరీర్‌ను త్యాగం చేస్తారు. అనుక్షణం భర్తకు అండగా ఉంటూ..పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దుతుంటారు. కుటుంబమే లోకంగా జీవిస్తున్న వీరి  వివాహ బంధం ముక్కలైతే..! ఇన్నేళ్ల దాంపత్యంలో ఆర్థిక వివరాలు తెలిసుండకపోతే..! ఉన్నపళంగా బయటకు వెళ్లిపోవాల్సి వచ్చిన ఆ మహిళ భవిష్యత్తు అగమ్యగోచరంగా మారుతుంది. ఈ తరహా కేసులో స్పెయిన్‌(Spain)కు చెందిన కోర్టు ఇచ్చిన తీర్పు ఆలోచింపజేస్తోంది.

ఇవానా మోరల్‌ అనే స్పెయిన్(Spain) మహిళ తన వివాహ జీవితంలో వచ్చిన విభేదాలతో 2020లో భర్త నుంచి విడాకులు పొందింది. తన ఇద్దరు కుమార్తెలతో వట్టి చేతులతో అత్తింటి నుంచి బయటకు వచ్చింది. ‘మా వివాహ బంధం ముగిసిన రోజున నా చేతుల్లో ఏమీ లేదు. అన్నేళ్లు కేవలం ఇంటిపనులకే పరిమితం కావాల్సి వచ్చింది. అంతకాలం నా భాగస్వామికి అన్ని పనుల్లో సహకరించాను. కానీ ఆర్థిక విషయాలను మాత్రం నాకు తెలియనిచ్చేవారు కాదు. అన్నీ ఆయన పేరు మీదే ఉన్నాయి’ అని ఆమె వెల్లడించారు.

విడాకులు ఇచ్చిన కోర్టు.. ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత కీలక తీర్పు వెలువరించింది. 25 ఏళ్ల పాటు ఆమె చేసిన ఇంటిపనికి లెక్కకట్టింది. వార్షిక కనీస వేతనం ఆధారంగా ఆమెకు పనికి రూ.1.75 కోట్లు చెల్లించాలని ఆదేశించింది. అలాగే నెలవారీగా ఆమెకు భరణం, పిల్లల పోషణ కోసం డబ్బులు ఇవ్వాలని తన ఆదేశాల్లో పేర్కొంది. ఈ తీర్పుపై మోరల్‌ హర్షం వ్యక్తం చేశారు. ఇంటిపని(domestic work)ని కూడా క్లెయిమ్‌ చేసుకోవచ్చని, అందుకు తన కేసే ఒక ఉదాహరణ అని అన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని