Ukraine Crisis: రష్యా విమానాలకు నో ఎంట్రీ: టర్కీ

రష్యా పౌర, సైనిక విమానాలకు తమ గగనతలంలో మార్గాన్ని ఇవ్వకూడదని టర్కీ నిర్ణయించింది. ఈ విషయాన్ని ఆ దేశ విదేశాంగశాఖ మంత్రి మెవ్లుట్‌ కావూసోగ్లు ప్రకటించారు. ఉక్రెయిన్‌ సంక్షోభం మొదలైన తర్వాత రష్యాపై తొలిసారి టర్కీ కఠిన నిర్ణయం తీసుకొంది.

Published : 25 Apr 2022 02:14 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: రష్యా పౌర, సైనిక విమానాలకు తమ గగనతలంలో మార్గాన్ని ఇవ్వకూడదని టర్కీ నిర్ణయించింది. ఈ విషయాన్ని ఆ దేశ విదేశాంగశాఖ మంత్రి మెవ్లుట్‌ కావూసోగ్లు ప్రకటించారు. ఉక్రెయిన్‌ సంక్షోభం మొదలైన తర్వాత రష్యాపై తొలిసారి టర్కీ కఠిన నిర్ణయం తీసుకొంది. ఇప్పటి వరకు నాటో సభ్యదేశమైన టర్కీ-రష్యాల మధ్య సత్సంబంధాలు కొనసాగాయి. ‘‘మేము సిరియా నుంచి వచ్చే రష్యా సైనిక విమానాలకు మా గగనతలాన్ని మూసివేశాం. ఆ దేశ పౌరవిమానాలను కూడా అంగీకరించం. మేము వారికి ఏప్రిల్‌ వరకు మాత్రమే సమయం ఉందని మార్చిలోనే చెప్పాం’’ అని వెల్లడించారు. 

ఈ విషయాన్ని రష్యా విదేశాంగ శాఖ మంత్రి సెర్గీ లావ్రోవ్‌కు వెల్లడించినట్లు కావూసోగ్లు చెప్పారు. ‘‘ఒకటి రెండ్రోజుల తర్వాత వారు దీనిపై స్పందించారు. పుతిన్‌ కూడా  విమానాలను నడపకూడదని ఆదేశాలు జారీ చేశారు’’ అని పేర్కొన్నారు. మరో మూడు నెలలపాటు ఈ నిషేధం అమల్లో ఉంటుందని టర్కీ మంత్రి పేర్కొన్నారు. టర్కీ ప్రకటనపై రష్యా నుంచి ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. 

సిరియా యుద్ధంలో టర్కీ రెబల్స్‌కు మద్దతు ఇవ్వగా.. రష్యా బలగాలు అధ్యక్షుడు బషర్‌ అల్‌ అసద్‌కు మద్దతుగా నిలిచాయి. రష్యా విమానాన్ని 2015లో టర్కీ దళాలు కూల్చివేశాయి. దీంతో ఇరు దేశాల సంబంధాలు కొంత దెబ్బతిన్నాయి. కానీ, ఆ తర్వాత టర్కీ ఎస్‌-400 కొనుగోళ్లతో  మళ్లీ వీరి బంధం బలపడింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని