Sharjah building fire: షార్జాలో అగ్ని ప్రమాదం.. ఇద్దరు భారతీయుల మృతి

షార్జాలో జరిగిన ఓ భారీ అగ్ని ప్రమాదంలో ఇద్దరు భారతీయులు తమ ప్రాణాలను కోల్పోయారు. 

Published : 08 Apr 2024 17:03 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: షార్జాలో గురువారం జరిగిన అగ్ని ప్రమాదంలో (Sharjah building fire) మరణించిన ఐదుగురిలో ఇద్దరు భారతీయులు ఉన్నట్లు గుర్తించారు. ఈవిషయాన్ని స్థానిక పత్రిక ఖలీజ్‌టైమ్స్‌ పేర్కొంది. ఇక్కడ దాదాపు 750 అపార్ట్‌మెంట్లు ఉన్న ఏడు అంతస్తుల భవనం ‘అల్‌ నహద’ గురువారం అగ్నిప్రమాదానికి గురైంది. దీనిలో ఐదుగురు చనిపోగా.. 44 మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో మైఖెల్‌ సత్యదాస్‌ అనే సౌండ్‌ ఇంజినీర్‌ ఉన్నారు. దుబాయ్‌ వరల్డ్‌ ట్రేడ్‌ సెంటర్‌లోని డీబీఎక్స్‌లో అతడు పని చేస్తున్నారు. అతడు ఏఆర్‌ రెహ్మాన్‌, బ్రోనోమార్స్‌ కాన్సర్టుల్లో చాలా కీలకమైన వ్యక్తి. సత్యదాస్‌ మృతిని డీబీఎస్‌ సంస్థ కూడా ధ్రువీకరించింది. ఎంతో నమ్మకమైన ఉద్యోగిని కోల్పోయామని.. అతడి కుటుంబానికి అవసరమైన సాయం చేస్తామని ప్రకటించింది. 

ఈ ప్రమాదంలో 29 ఏళ్ల భారతీయ మహిళ కూడా చనిపోయింది. ఆమె ఫిబ్రవరిలోనే మదీనాలో వివాహం చేసుకొని భర్తతో అల్‌ నహదాలో ఉంటోంది. తాజా ప్రమాదంలో ఆమె మరణించగా.. భర్త తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతడి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. సదరు మహిళ అంత్యక్రియలు యూఏఈలోనే జరగవచ్చని తెలుస్తోంది. 

మృతులు, క్షతగాత్రుల కుటుంబాలకు సాయం చేసేందుకు భారత దౌత్యకార్యాలయం ఏర్పాట్లు చేసింది. బాధితుల బంధువులు చాలావరకు అక్కడికి వెళ్లారు. ఇక ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని