USA: అమెరికా అధీనంలో రష్యా ‘తెల్ల ఏనుగు’.. వృథాగా 20 మిలియన్‌ డాలర్ల ఖర్చు

రష్యా సంపన్నుడిని శిక్షించాలని అమెరికా చేసిన ప్రయత్నం బెడిసికొట్టింది. ఫలితంగా నెలకు మిలియన్‌ డాలర్లు ఎదురు చెల్లించాల్సి వస్తోంది. 

Updated : 07 Mar 2024 13:56 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: రష్యా సంపన్నుడిని శిక్షించాలనే లక్ష్యంతో అమెరికా (USA) తీసుకొన్న ఓ నిర్ణయం బెడిసికొడుతోంది. నెలకు దాదాపు మిలియన్‌ డాలర్లు ఖర్చుపెట్టాల్సి వస్తోంది. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం మొదలుపెట్టిన సమయంలో క్రెమ్లిన్‌తో సన్నిహిత సంబంధాలున్న సంపన్నుడు సులేమాన్‌ కెరిమోవ్‌కు చెందిన విలాసవంతమైన నౌకను అమెరికా టాస్క్‌ఫోర్స్‌ అధికారులు సీజ్‌ చేశారు. దాదాపు 348 అడుగుల పొడవున్న ఈ నౌక పేరు ‘అమాడెయా’. 

2022లో ఈ నౌక ఫిజీ తీరంలో ఉండగా స్థానిక అధికారులు, ఎఫ్‌బీఐ సిబ్బంది కలిసి స్వాధీనం చేసుకొన్నారు. బంగారం వ్యాపారి అయిన కెరిమోవ్‌ నౌక నిర్వహణ ఖర్చుల కోసం ఆంక్షలను ఉల్లంఘించి అమెరికా బ్యాంకింగ్‌ వ్యవస్థను వాడుకొన్నట్లు ఆరోపణలు ఎదుర్కొన్నారు. ప్రస్తుతం ఇది శాన్‌డియాగో తీరంలో నిలిపి ఉంది. 

జెలెన్‌స్కీ, గ్రీక్‌ ప్రధాని కాన్వాయ్‌ లక్ష్యంగా క్షిపణి దాడి.. ?

తాజాగా ఈ నౌకను విక్రయించేందుకు అనుమతించాలని ఫెడరల్‌ ప్రాసిక్యూటర్లు న్యాయమూర్తిని కోరారు. దీని నిర్వహణ ఖర్చులు భారీగా ఉన్నాయని పేర్కొన్నారు. ఇప్పటివరకు 20 మిలియన్‌ డాలర్ల వరకు వెచ్చించినట్లు కోర్టు ఫైలింగ్‌లో పేర్కొన్నారు. సగటున నెలకు 6,00,000 డాలర్లు నిర్వహణ ఖర్చులు కాగా.. బీమాకు మరో 1.4 లక్షల డాలర్లు చెల్లించారు. ఇతరాలకు మరో 1.78 లక్షల డాలర్లను వెచ్చిస్తున్నారు. అమెరికా మార్షల్స్‌ సర్వీస్‌ ప్రకారం దీని విలువ 230 మిలియన్‌ డాలర్లుగా ఉన్నట్లు తెలిపారు.  

ఈ నౌక తమదేనని ఓ కంపెనీ ముందుకొచ్చింది. దీనిని మరో దానికి విక్రయించడాన్ని వ్యతిరేకిస్తూ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. సివిల్‌ జప్తు దర్యాప్తును కొట్టేయాలన్న తమ అభ్యర్థనపై నిర్ణయం వెలువరించేవరకు దానిని ఆపాలని పేర్కొంది. ఒకవేళ దానిని తమకు అప్పగిస్తే అమెరికా చెల్లించిన నిర్వహణ ఖర్చులను కూడా వాపస్‌ చేస్తామని ఆఫర్‌ ఇచ్చింది.   

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని