Ukraine Crisis: శవాల మాటున ల్యాండ్‌మైన్లు.. జెలెన్‌స్కీ కీలక వ్యాఖ్యలు!

ఉక్రెయిన్‌లో యుద్ధ వ్యూహాన్ని మార్చే క్రమంలో ఉన్న రష్యా శుక్రవారం రాజధాని కీవ్‌ శివారుల నుంచి కొన్ని బలగాలను ఉపసంహరించింది....

Published : 02 Apr 2022 13:14 IST

కీవ్‌: ఉక్రెయిన్‌లో యుద్ధ వ్యూహాన్ని మార్చే క్రమంలో ఉన్న రష్యా శుక్రవారం రాజధాని కీవ్‌ శివారుల నుంచి కొన్ని బలగాలను ఉపసంహరించింది. నగరానికి దాదాపు 18 కి.మీ దూరంలో ఉన్న ఆంటోనొవ్‌ విమానాశ్రయం నుంచి బలగాలు పూర్తిగా వైదొలిగినట్లు ఉపగ్రహ చిత్రాల్లో కనిపించింది. రష్యా బలగాల ఉపసంహరణ నెమ్మదిగా ఉన్నప్పటికీ.. పరిశీలించదగిన స్థాయిలోనే కొనసాగుతోందని అధ్యక్షుడు జెలెన్‌స్కీ తాజా వీడియో సందేశంలో తెలిపారు.

వారి ఉపసంహరణ ఓ పెద్ద ఉపద్రవం..

వెనక్కి వెళుతున్న రష్యన్ బలగాలు పెద్ద ఉపద్రవాన్నే సృష్టించి వెళుతున్నాయని జెలెన్‌స్కీ శనివారం తమ దేశ పౌరుల్ని హెచ్చరించారు. రాజధాని శివారు నుంచి వెనుదిరుగుతున్న రష్యన్‌ సైనికులు ఆయా ప్రాంతాల్లో ల్యాండ్‌ మైన్లను ఉంచి వెళుతున్నారని తెలిపారు. ఇళ్లు, శవాల దగ్గర మైన్లను పెట్టారని పేర్కొన్నారు. వారి ఉపసంహరణ వెనుక పెద్ద ప్రమాదమే పొంచి ఉందని తెలిపారు. ఇది నిజమని వ్యాఖ్యానించారు. తిరిగి సొంత ప్రాంతాలకు వచ్చేవారు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. సాధారణ జీవితం గడపడానికి ఇంకా సమయం ఉందన్నారు. తిరిగి దాడులు జరగవని ఉక్రెయిన్‌ సైన్యం హామీ ఇచ్చే వరకూ వేచి చూడాలని తెలిపారు.

 

మే 9 నాటికి వారికి విజయం కావాలి..

రష్యా సైనికుల ఉపసంహరణపై ఉక్రెయిన్‌ జాతీయ భద్రతా, రక్షణ మండలి కార్యదర్శి ఒలెగ్జీ డేనీలోవ్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. ఉక్రెయిన్‌ను నాశనం చేయాలనే ఆలోచనను రష్యా అధ్యక్షుడు పుతిన్‌ అంత సులభంగా వదిలిపెట్టరని వ్యాఖ్యానించారు. దాడులను మరింత తీవ్రం చేసేలా బలగాలను పునరుద్ధరిస్తున్నారని విశ్లేషించారు. అందులో భాగంగానే ఈ ఉపసంహరణ అని తెలిపారు. రష్యన్లు స్వచ్ఛందంగా వీడుతున్నారని భావించొద్దని దేశ ప్రజలను విజ్ఞప్తి చేశారు. తమ సైన్యం కృషి వల్లే ఇదంతా జరుగుతోందన్నారు.

తమ వ్యూహంపై పునరాలోచించుకునేందుకు రష్యన్‌ సేనలు వెనుదిరుగుతున్నాయని ఒలెగ్జీ అన్నారు. ‘‘రష్యన్‌ సేనల ఉపసంహరణకు మనం భారీ మూల్యమే చెల్లించుకోవాల్సి రావొచ్చు. వారు వ్యూహాన్ని పూర్తిగా పునరుద్ధరించుకుంటున్నారు. వారికి విజయం కావాలి. వారి ముందు మే 9వ తేదీ లక్ష్యంగా ఉంది. అప్పటికల్లా వారు విజయంతో కవాతు నిర్వహించాలనుకుంటున్నారు. మన ముందు ఇంకా చాలా యుద్ధాలు ఉన్నాయి. కాబట్టి ఎవరూ విశ్రమించొద్దని కోరుతున్నాను. మనం కోరుకుంటున్న సంతోషకర పరిస్థితులు ఇప్పుడు లేవు’’ అని ఒలెగ్జీ ఓ టీవీ ఇంటర్వ్యూలో ప్రజలనుద్దేశించి అన్నారు.

అమెరికా మరింత సాయం..

రష్యాతో పోరాడుతున్న ఉక్రెయిన్‌కు మరింత సాయం అందించాలని అమెరికా నిర్ణయించింది. వారి సైనిక సామర్థ్యాన్ని పటిష్ఠం చేసే చర్యల నిమిత్తం 300 మిలియన్‌ డాలర్లు అందించనున్నట్లు వెల్లడించింది. ఇందులో భాగంగా లేజర్‌ గైడెడ్‌ రాకెట్లు, డ్రోన్లు, రాత్రిపూట పనికొచ్చే ఉపకరణాలు, ఇతర ఆయుధాలు, వైద్య సామగ్రిని పంపనున్నట్లు తెలిపింది. ఉక్రెయిన్‌ సార్వభౌమత్వ పరిరక్షణకు అమెరికా కట్టుబడి ఉందని పెంటగాన్‌ అధికార ప్రతినిధి జాన్‌ కిర్బీ తెలిపారు. 

మేం దాడి చేయలేదు..

రష్యా భూభాగంపై తాము దాడి చేసినట్లు వస్తోన్న ఆరోపణల్ని ఉక్రెయిన్‌ జాతీయ భద్రతా మండలి ఖండించింది. సరిహద్దుకు 35 కిలోమీటర్ల దూరంలోని బెల్గోరోద్‌లో ఉన్న చమురు నిల్వ కేంద్రంపై ఉక్రెయిన్‌ సైనికులు శుక్రవారం తెల్లవారుజామున రెండు హెలికాఫ్టర్ల ద్వారా బాంబులు కురిపించినట్టు స్థానిక గవర్నర్‌ వ్యాచెస్లావ్‌ గ్లాడ్‌కోవ్‌ ఆరోపించిన విషయం తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని