గోరంత సాయం.. కొండంత మేలు

తాజావార్తలు


గోరంత సాయం.. కొండంత మేలు
వారాంతాలను ‘సేవ’కు కేటాయిస్తున్న సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులు
 హైదరాబాద్‌: ఇంటర్‌ చదివే విద్యార్థుల్లో కొందరికి ఆ తర్వాత ఏమి చదవాలన్నది పెద్ద ప్రశ్నే... మరికొందరికి ఏదైనా ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవాలంటే బయోడేటా ఆకట్టుకొనేలా ఎలా తయారు చేయాలో తెలియదు.. పరిశుభ్రత.. ఆరోగ్యంపై సరైన అవగాహన లేక రోగాల బారిన పడేవారు మురికివాడల్లో ఎందరో ఉంటారు... ఇలాంటి వారికి కాస్తంత సహకరిస్తే ఎంతో మేలు చేసినట్లే. ఒక చిన్న ప్రయత్నం ఇతరుల జీవితాల్లో పెద్ద మార్పు తీసుకురావచ్చు. విజ్ఞానాన్ని... సమాచారాన్ని ఇతరులతో పంచుకోవడం... మన వద్ద వృథాగా ఉండి ఇతరులకు ఉపయోగపడతాయనుకునే వస్తువులను వారికి చేర్చడం వంటివీ సేవా కార్యక్రమాలే. ఇలాంటి ప్రయత్నాలే నగరంలోనూ జరుగుతున్నాయి. స్వచ్ఛందంగా కొందరు చేస్తుంటే మరికొందరు సంస్థల పరంగా చేస్తున్నారు. కొన్ని సాఫ్ట్‌వేర్‌ సంస్థలు ఈ తరహా సామాజిక కార్యక్రమాలకు పెద్దపీట వేస్తున్నాయి. తమ ఉద్యోగులను ఇందుకు ప్రోత్సహించడమే కాకుండా డబ్బునూ వెచ్చిస్తున్నాయి.

ఇలా కదిలారు...
నగరంలో ఇటీవల డెలాయిట్‌ సంస్థకు చెందిన ఉద్యోగులు బృందాలుగా ఏర్పడ్డారు. వీరంతా తమకు తెలిసిన సమాచారాన్ని... తాము అందించగల సమాచారాన్నీ ఇతరులకు పంచాలని భావించారు. ఆసక్తులు... అవసరాల ప్రాతిపదికగా ఈ బృందాల ఎంపిక జరిగింది. ఒక బృందం పాఠశాలలకు వెళితే మరొకటి జూనియర్‌ కళాశాలలకు వెళ్లేందుకు సిద్ధమైంది. ఇంకో బృందం చర్లపల్లి జైలుకు వెళ్లి అక్కడి ఖైదీలను కలసి మాట్లాడేందుకు ఆసక్తి చూపింది. మరికొందరు మురికివాడల్లోని ప్రజలకు సేవలు అందించేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. వారాంతంలో ఇలా బృందాలన్నీ వారికి నిర్దేశించిన ప్రాంతాలకు వెళ్లాయి. కళాశాలలకు వెళ్లిన బృందాలు విద్యార్థులు ఏదైనా ఉద్యోగాలకు దరఖాస్తు చేస్తే ఎలా తమ రెజ్యూమ్‌ను రాసి పంపాలో నేర్పించారు. ఉద్యోగావకాశాలు ఎక్కడ... ఎలా ఉంటాయో వివరించారు. మురికివాడలకు వెళ్లిన వారు పారిశుద్ధ్యం..ఆరోగ్య పరిస్థితులపై అవగాహన కల్పించారు. పాఠశాలల, కళాశాలలకు వెళ్లిన ఉద్యోగులు విద్యార్థులకు చదువులు చెప్పారు. ఇలా సేవలు అందించడం ద్వారా ఎంతో తృప్తి లభించడంతోపాటు అవసరమైన వారికీ ఉపయోగపడ తాయని ఓ ఉద్యోగి వివరించారు.

నలుగురు కలిసి...
సంస్థల ప్రేరణతోనే కాదు... నగరంలో నలుగురైదుగురు కలసి బృందంగా ఏర్పడి వారాంతాల్లో ఈ తరహా సేవా కార్యక్రమాల్లో భాగస్వాములవుతున్నారు. కొందరు పేద పిల్లలకు ట్యూషన్లు చెబుతున్నారు. అవకాశమున్నప్పుడు తరగతి గదులకు వెళ్లి పాఠాలు బోధిస్తున్నారు. ఇదంతా ఎలాంటి ప్రచార ఆర్భాటం లేకుండా సాగిపోతుండటం గమనార్హం. రెండు నెలల క్రితం వర్షాలు భారీగా పడి నగర జీవనం అస్తవ్యస్తమైనప్పుడూ పలువురు తమకు చేతనైన సేవలు అందించారు. కొన్ని కాలనీల్లోని ఇళ్లల్లోకి నీరు చేరి... మూడునాలుగు రోజులు వాటిలోని కుటుంబాలు ఇబ్బంది పడిన సమయంలో ఆహారం సహా ఇతర సేవలతో ఆదుకున్నారు.

చిన్న ప్రయత్నమైనా... పెద్దమార్పు
సంస్థలు లేదా సంఘాల సభ్యులు.. బృందాలే సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలని ఏమీలేదు. వ్యక్తులుగాను ఎవరికి వారు స్పందించవచ్చని వీటిలో మమేకమయ్యే వారు చెబుతున్నారు.

మీ అపార్ట్‌మెంట్‌లో ఉండే వారి పిల్లల పాత దుస్తులను సేకరించండి. అనేక మంది తమ పిల్లలకు పట్టని దుస్తులు ఏమి చేయాలో తెలియక, వాటిని బయట పడేయలేక ఇబ్బంది పడుతుంటారు. వారిని కలిస్తే కచ్చితంగా మంచి స్పందనే వస్తుంది. నగర శివారుల్లో..చుట్టు పక్కల గ్రామాల్లో పేద పిల్లలు అనేక మంది దుస్తులు లేక అవస్థలు పడుతున్నారు. చిరిగిన వాటితో తిరుగుతున్నారు. వారికి మీరు సేకరించే దుస్తులు అందిస్తే ఎంతో ఉపయోగపడతాయి.

పిల్లల పుస్తకాలనూ సేకరించవచ్చు. పాఠ్య పుస్తకాలు..కథల పుస్తకాలు సేకరించి అవసరం ఉన్న వారికి అందించడం కూడా ఉపయుక్తంగా ఉంటుంది.

వీలున్నప్పుడు దగ్గరలోని ఏ ప్రభుత్వ పాఠశాలకైనా వెళ్లి మీకు ఉన్న విజ్ఞానాన్ని విద్యార్థులతో పంచుకోవచ్చు. ఇందుకు అనేక పాఠశాలల ప్రధానోపాధ్యాయులు సహకరిస్తున్నారు. శేరిలింగంపల్లి మండలంలో కొన్ని పాఠశాలలకు చాలామంది ఇలా వెళ్లి బోధిస్తున్నారు. ఒక సంస్థ గత ఏడాది నృత్యాలు, సంగీతం కూడా నేర్పించేందుకు చొరవ తీసుకుంది.

చలికాలంలో పాదచారుల బాటలపై అనేక మంది వృద్ధులు వణుకుతూ కనిపిస్తారు. ఇలాంటి వారికి ఒక దుప్పటి ఇచ్చినా ఎంతో సేవ చేసినట్లే.

FileName

  • FileName
మరిన్ని
FileName
FileName

  • FileName
మరిన్ని
FileName

  • FileName
మరిన్ని

  • FileName
మరిన్ని

  • FileName
మరిన్ని

  • FileName
మరిన్ని

  • FileName
మరిన్ని
జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు

© 1999- 2016 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Designed & Developed by Eenadu WebHouse
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing @eenadu.net
Best Viewed In Latest Browsers

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.