ప్రజలను వంచించిన కేసీఆర్‌
ఉద్యమ ఫలితాలను వ్యక్తిగతంగా వాడుకున్నారు
కాంగ్రెస్‌తోనూ ఒరిగేదేమీ లేదు..
  దోపిడీవర్గాలతో కోదండరాం దోస్తీ
విప్లవపోరాటాలకు తిలోదకాలిచ్చిన కామ్రేడ్లు
మావోయిస్టు నేత హరిభూషణ్‌ విమర్శలు
ఈనాడు, హైదరాబాద్‌: తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే తెరాస ప్రభుత్వం ముందస్తు ఎన్నికలకు వెళుతోందని భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) తెలంగాణ రాష్ట్ర కమిటీ కార్యదర్శి హరిభూషణ్‌ విమర్శించారు. తెలంగాణ ఉద్యమ ఫలితాలను వ్యక్తిగత ప్రయోజనాలకు వాడుకొని కేసీఆర్‌ ప్రజలను మోసం చేశారన్నారు. అవినీతి అక్రమాలు, దురహంకారంతో పరిపాలించిన కేసీఆర్‌ పాలనపట్ల ప్రజల్లో ఆగ్రహం పెల్లుబుకుతోందని, ఈ నిరసన ఇంకా సంఘటితం కాకముందే బయటపడాలన్న ఉద్దేశంతోనే కేసీఆర్‌ ముందస్తు ఎన్నికలకు వెళ్తున్నారని ఆయన బుధవారం ఒక పత్రికా ప్రకటనలో ఆరోపించారు. ప్రధాని మోదీని కలిసిన తర్వాతనే కేసీఆర్‌ ఎన్నికలకు సిద్ధమయ్యారన్నారు. పదవులు, డబ్బు ఆశచూపి ఇతర పార్టీల నేతలను పార్టీలో చేర్చుకుని ప్రతిపక్షాన్ని బలహీనపరిచారని, మాయమాటలతో కొన్ని సామాజికవర్గాలు, వ్యక్తులను తనకు అనుకూలంగా మలుచుకున్నారని హరిభూషణ్‌ పేర్కొన్నారు.

లాబీయింగ్‌ రాజకీయాలతో ఉద్యమకాలంలో చక్రం తిప్పి ఉద్యమ ఫలితాలను హైజాక్‌ చేసిన కేసీఆర్‌పై ఈ నాలుగేళ్లలో మధ్యతరగతికి ఉన్న భ్రమలు తొలగిపోయాయన్నారు. ప్రపంచ బ్యాంకు సూచనల మేరకు బంగారు తెలంగాణ తన లక్ష్యమని ప్రకటించిన కేసీఆర్‌ సామ్రాజ్యవాద అజెండాను దూకుడుగా అమలు చేస్తున్నారని, పారిశ్రామికీకరణలో భాగంగా టీ-పాస్‌ పేరుతో హైటెక్‌ పరిశ్రమలు, ప్రైవేటు పరిశ్రమలకు పెద్దపీట వేస్తున్నారని, వేల ఎకరాల భూములు, నీరు, విద్యుత్తు ఇస్తున్నారన్నారు. ఉత్పత్తి జరిగే పరిశ్రమలు నెలకొల్పలేదని, మూతపడ్డ పరిశ్రమలను తెరిపించలేదని, దీనివల్ల నిరుద్యోగుల ఆశలు అడియాసలయ్యాయన్నారు. లక్షన్నర ఉద్యోగాలు అందుబాటులో ఉంటే నాలుగేళ్లలో 15,000 ఉద్యోగాలు మాత్రమే ఇచ్చారని, సింగరేణి సంస్థలో గత నాలుగేళ్లలో 15,000 ఉద్యోగాలు తొలగించారని, రాష్ట్రంలో 4,000మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నా నివారణచర్యలు తీసుకోవడంలేదని హరిభూషణ్‌ దుయ్యబట్టారు. రీడిజైనింగ్‌ పేరుతో ప్రాజెక్టుల అంచనాలు పెంచుతున్నారని, కమీషన్ల కోసం కాంట్రాక్టులు కట్టబెడుతున్నారని, మిషన్‌ కాకతీయ, మిషన్‌ భగీరథలు తెరాస ఆస్తులు కూడబెట్టుకోవడానికి ఉపయోగపడ్డాయని హరిభూషణ్‌ విమర్శించారు.

అన్ని పార్టీలపైనా ధ్వజం
అంతర్గత నాయకత్వ కుమ్ములాటల వలనే కాంగ్రెస్‌ అధికారంలోకి రాలేకపోతోందని, ప్రతిపక్షంగా కూడా న్యాయం చేయలేకపోతోందని, ఆ పార్టీ అధికారంలోకి వచ్చినా తెలంగాణకు ఒరిగేదేమీ లేదన్నారు. భాజపా జీఎస్టీ, నోట్లరద్దు పేరుతో ప్రజల నడ్డివిరిచిందని, ఈ పార్టీకి తెరాసతో లోపాయికారి ఒప్పందం ఉందన్నారు. గత్యంతరం లేకనే తెలుగుదేశం కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుంటోందని, నిన్నటి వరకూ కేంద్ర ప్రభుత్వంతో అంటకాగిన చంద్రబాబు ప్రత్యేక హోదాను నీరుగార్చి ఇప్పుడు ప్రజలను నమ్మించడానికి నాటకాలు ఆడుతున్నారని హరిభూషన్‌ విమర్శించారు. సీపీఐ, సీపీఎంలు రెండూ పాలక పక్షాల్లో ఏదో ఒకదానితో అంటకాగుతూ విప్లవ పోరాటాలకు తిలోదకాలు ఇచ్చి పదవుల పంపకాల్లో మునిగి తేలుతున్నాయన్నారు. ప్రజల అసంతృప్తిని, ఆవేశాన్ని గుర్తించి కూడా జనసమితి వ్యవస్థాపకులు కోదండరాం దోపిడీవర్గ పార్టీలతో కలిసి పోటీ చేస్తుండడం సబబుకాదన్నారు. ఈ బూటకపు ఎన్నికలను బహిష్కరించాలని హరిభూషణ్‌ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

రాజకీయం

జిల్లా వార్తలు
జిల్లా తాజా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు

© 1999- 2018 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Designed & Developed by Eenadu WebHouse
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing @eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |    Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.