close

ప్రధానాంశాలు

తితిదే ఆస్తుల వేలం

తమిళనాడులో 23 చోట్ల గుర్తింపు
నిరర్థకం పేరుతో విక్రయానికి చర్యలు
అవన్నీ అమ్మితే వచ్చేది రూ. 1.54 కోట్లే
త్వరలో తెలుగు రాష్ట్రాల్లోనూ మరికొన్నింటి అమ్మకం
ఈనాడు - తిరుపతి

అత్యంత ధనవంతుడైన తిరుమల వెంకన్న ఆస్తులను తితిదే అమ్మకానికి పెట్టింది. స్వామివారిపై భక్తి ప్రపత్తులతో దాతలు విరాళాలుగా సమర్పించుకున్న ఆస్తులు ఇప్పుడు ‘నిరర్థకం’ అయిపోయాయంటూ వాటిని అమ్మేందుకు సిద్ధమవుతోంది. ఈ ఆస్తుల పర్యవేక్షణ భారంగా మారిందని, వాటిని కాపాడలేక అమ్ముతున్నామన్నది తితిదే వాదన. పొరుగు రాష్ట్రాల్లో ఉన్న ఆస్తులతో పాటు.. భవిష్యత్తులో తెలుగు రాష్ట్రాల్లో ఉన్న మరికొన్నింటినీ అమ్మేందుకు అడుగులు వేస్తోంది. ప్రస్తుతం తమిళనాడులోని పలు జిల్లాల్లో 23 చోట్ల ఉన్న ఆస్తుల వేలానికి అధికారులు సిద్ధమయ్యారు. తీరా వీటన్నింటినీ వేలం వేసినా వచ్చే సొమ్ము రూ. 1.54 కోట్లు మాత్రమే. ఈ మొత్తాన్ని కార్పస్‌ఫండ్‌లో జమచేయాలని నిర్ణయించారు. తితిదే చర్యలను ప్రతిపక్ష నేతలంతా తీవ్రంగా తప్పుబడుతున్నారు. ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోకపోతే రాష్ట్రవ్యాప్త ఉద్యమం చేపడతామని తితిదే ధర్మకర్తల మండలి మాజీ సభ్యులు భానుప్రకాష్‌రెడ్డి, ఓవీ రమణ తిరుపతిలో స్పష్టం చేశారు. ఆస్తులను అమ్ముకోడానికి బదులు.. ధార్మిక అవసరాలకు వీలుగా మార్చుకోవాలని సూచించారు.

విక్రయానికి బృందాలు
తమిళనాడులో భూముల వేలం ప్రక్రియ పర్యవేక్షించేందుకు తితిదే రెండు బృందాలను నియమించింది. ఎస్‌.ఉదయభాస్కర్‌రెడ్డి (ఏఈవో, రెవెన్యూ), పి.మునీంద్ర (సీనియర్‌ అసిస్టెంట్‌, రెవెన్యూ), పి.మోహన్‌రావు (మాజీ సర్వేయర్‌), ఎం.బాలాజీ (చైన్‌మన్‌, ఆస్తుల విభాగం)తో ఒక బృందం ఏర్పాటుచేసింది. జి.గౌరీశంకరరావు (తహసీల్దారు), వై.సుబ్బారాయుడు (సీనియర్‌ అసిస్టెంట్‌), పి.హరినాథ్‌ (సర్వేయర్‌), ఇ.గురవయ్య (చైన్‌మన్‌) సభ్యులతో మరో బృందాన్ని వేసింది.  వేలంలో ఆస్తిని కొన్నవారి పేరిట రిజిస్టర్‌ చేయించే బాధ్యత వీరిపైనే ఉంది.

ముందు నుంచే ప్రణాళికలు
తితిదేలో నిర్వహణ ఖర్చులు ఏటా పెరుగుతు న్నాయి. ధర్మకర్తల మండలి సభ్యుల సూచనల మేరకు వివిధ రాష్ట్రాల్లోని ఆలయాలను తితిదే పరిధిలోకి తేవడంతో పాటు పలుచోట్ల కల్యాణ మండపాలు నిర్మిస్తోంది. వీటి నిర్వహణ తితిదేకు భారంగా మారింది. వడ్డీ రేట్లు తగ్గడంతో.. బ్యాంకుల్లో ఉన్న డిపాజిట్లపై ఆదాయమూ తగ్గుతోంది. ఈ నేపథ్యంలో ఆదాయాన్ని సమకూర్చుకునేందుకు దాతలు ఇచ్చిన ఆస్తులను విక్రయించాలని ఫిబ్రవరిలో నిర్వహించిన ధర్మకర్తల మండలిలో తీర్మానించారు. 2020-21 ఆర్థిక సంవత్సరానికి నిర్దేశించిన బడ్జెట్‌లో నిరర్ధక ఆస్తుల విక్రయం ద్వారా రూ.100 కోట్ల ఆదాయాన్ని సమకూర్చుకోవాలని ప్రతిపాదించారు.

ఆరంభమే.. మున్ముందు మరిన్ని
తితిదే భూముల వేలానికి ఇది ప్రారంభమే.  వివిధ రాష్ట్రాల్లో గ్రామీణ ప్రాంతాల్లోని సాగు భూములు, పట్టణ ప్రాంతాల్లోని నివాస, వాణిజ్య స్థలాలనూ అమ్మేందుకు సిద్ధమైంది. ఏపీలోని శ్రీకాకుళం, విజయనగరం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు, చిత్తూరు, అనంతపురం, కడప జిల్లాల్లో, తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా పసుమాముల, అంబర్‌పేట కలాన్‌, మల్కాజిగిరి శివారు యాదవ్‌నగర్‌ ప్రాంతాల్లో ఆస్తులను గుర్తించారు. రెండోదశలో వీటిని అమ్మకానికి పెట్టాలని ధర్మకర్తల మండలి నిర్ణయించింది. గుంటూరులోని కొత్తరాములు గుడి, పెదకాకాని మండలం నంబూరు, కృష్ణాజిల్లా పోలేపల్లి గ్రామ పరిధిలోని భూములను గుర్తించారు. విజయవాడ విద్యాధరపురంలో 7319.7 చదరపు అడుగుల స్థలం, తమిళనాడు నాగపట్నం జిల్లా పుసులంగుడిలో 17.65 ఎకరాల వ్యవసాయ భూమి, కాంచీపురం జిల్లా అగరంతేన్‌ గ్రామంలో 0.27 ఎకరాల ఫాం హౌజ్‌ స్థలం అమ్మాలని నిర్ణయించారు. మొత్తం 27 చోట్ల భూములను అమ్మేందుకు ధర్మకర్తల మండలి ఆమోదం తెలిపింది.

దీని భావమేమి తిరుమలేశా?
అలనాటి సినీనటి కాంచన 2010లో చెన్నై నగరం నడిబొడ్డున రూ.15 కోట్ల స్థిరాస్తిని శ్రీవారికి కానుకగా సమర్పించారు. అప్పటి తితిదే ఈవో ఐవైఆర్‌ కృష్ణారావును కలిసి దానపత్రాలు అందజేస్తూ ఈ ఆస్తిని విక్రయించకుండా దేవస్థానం అవసరాలకు కలకాలం వాడుకోవాలని ఆనందబాష్పాలతో వేడుకున్నారు. దాత మనసు ఎలా ఉంటుందనడానికి ఈ సంఘటనే నిదర్శనం. అప్పటికి కాంచన ఆర్థిక పరిస్థితి బాగోలేక ఇబ్బందులు పడుతున్నారు. దాత మనోభావాన్ని గుర్తించిన అప్పటి ఈవో.. తప్పకుండా శ్రీవారి పేరిటే ఆస్తి ఉండేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
* దేశ విదేశాల్లో దేవస్థానానికి వివిధ రకాల ఆస్తులున్నాయి. వీటిని బహిరంగపరిస్తే రక్షణ ఉంటుందనే సంకల్పంతో తితిదే ఈవోగా పనిచేసిన సాంబశివరావు తితిదే వెబ్‌సైట్‌లో వాటి వివరాలు పొందుపర్చి భక్తకోటికి తెలిసేలా చర్యలు తీసుకున్నారు.
లాక్‌డౌన్‌తో శ్రీవారి దర్శనానికి భక్తులను రెండు నెలలుగా నిలిపివేయాల్సి వచ్చింది. ఈ తరుణంలో దేవస్థానానికి ఆదాయం తగ్గిపోయిందని, ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితులు తలెత్తాయనే కథనాలు వచ్చాయి. దీనికి దేవస్థానం అధికారులు స్పష్టమైన సమాధానం చెప్పలేదు.

 

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.