close

గ్రేటర్‌ హైదరాబాద్‌

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
న్యాయవ్యవస్థపై దాడిని చూస్తూ ఊరుకోవద్దు

 జగన్‌ లాంటి వారిని ఉపేక్షిస్తే అన్ని వ్యవస్థలూ చెలరేగిపోతాయి
  సుప్రీంకోర్టు సీజే జస్టిస్‌ ఎస్‌ఏ బోబ్డేకి  100 మంది న్యాయశాస్త్ర విద్యార్థుల లేఖ

ఈనాడు, దిల్లీ:  భారత న్యాయవ్యవస్థపై ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి దాడి చేస్తున్నారని, నిరంకుశత్వం, ప్రతీకారేచ్ఛ ధోరణితో కూడిన ఈ దాడి ప్రజాస్వామ్య వ్యవస్థకు గొడ్డలి పెట్టని దేశంలోని వివిధ న్యాయ కళాశాలలకు చెందిన 100మంది విద్యార్థులు ఆందోళన వ్యక్తంచేశారు. జగన్‌ తీరును మొత్తంగా న్యాయవ్యవస్థపై చేసిన దాడిగా భావించి, కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌ఏ బోబ్డేకి లేఖ రాశారు. అందులో వారు లేవనెత్తిన అంశాలు...
‘‘మేం దేశంలోని వివిధ న్యాయశాస్త్ర పాఠశాలలకు చెందిన విద్యార్థులం. ప్రజాస్వామ్య మూలస్తంభాలను కాపాడటానికి న్యాయవ్యవస్థ స్వతంత్రత చాలా ముఖ్యమని తరగతి గదుల్లో మాకు బోధించారు. పౌరుల ప్రాథమిక హక్కులను సంరక్షించి కాపాడేది న్యాయవ్యవస్థేనని, ప్రజావిశ్వాసమే దానికి పునాది అని కూడా స్పష్టంచేశారు. అయితే... ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు పరిపాలన వ్యవస్థను ప్రభావితం చేస్తున్నారని... సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌వీ రమణతోపాటు, హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ ఏవీ శేషసాయి, జస్టిస్‌ ఎం.సత్యనారాయణ మూర్తి, జస్టిస్‌ డీవీఎస్‌ఎస్‌ సోమయాజులు, జస్టిస్‌ డి.రమేష్‌లపై ఏపీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఆరోపిస్తూ ఇటీవల న్యాయవ్యవస్థ స్వతంత్రతపై దాడికి ఒడిగట్టారు. అపరాదపూర్వకంగా ఉన్న ఈ ఆరోపణలను వింటూ ఎవ్వరూ కళ్లు మూసుకోలేరు.’’
జగన్‌ 31 క్రిమినల్‌ కేసుల్లో ప్రాసిక్యూషన్‌ ఎదుర్కొంటున్నారు
వాస్తవం చెప్పాలంటే ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి సీబీఐ నమోదు చేసిన 11 అవినీతి కేసులతోపాటు మొత్తం 31 క్రిమినల్‌ కేసుల్లో ప్రాసిక్యూషన్‌ను ఎదుర్కొంటున్నారు. మనీలాండరింగ్‌లాంటి తీవ్రమైన నేరాలకు సంబంధించి మరో 7 కేసులనూ ఈడీ నమోదుచేసింది. ఎంపీ, ఎమ్మెల్యేలపై క్రిమినల్‌ కేసుల విచారణకు ప్రత్యేక కోర్టులు ఏర్పాటుచేసి, వేగంగా విచారణ జరిపించాలని ఇటీవల ఆదేశాలు జారీచేసిన జస్టిస్‌ ఎన్‌వీ రమణపై ఆరోపణలు చేయడానికి కారణమేంటన్నది ఆకేసులే చెబుతాయి.
న్యాయమూర్తులను వ్యక్తిగతంగా చూడొద్దు
ప్రధాన న్యాయమూర్తి కాబోయే సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయమూర్తిని ఏపీ సీఎం ప్రతీకారేచ్ఛతో బహిరంగంగా బెదిరిస్తున్నారు. ఇక్కడ మనం చూడాల్సింది జస్టిస్‌ ఎన్‌వీ రమణ అనో, లేదంటే కాబోయే ప్రధాన న్యాయమూర్తిగానో కాకుండా... మొత్తం వ్యవస్థ పరిస్థితి ఏంటన్నది చూడాలి. న్యాయవ్యవస్థ, భారత సర్వోన్నత న్యాయస్థానానికి ఉన్న ఘనత, న్యాయ పరిపాలనను... కలుషితం చేయడానికి చేస్తున్న కుట్రలుగా చూడాలి. ఇలాంటి వాటిని ఉపేక్షిస్తే... దేశ అత్యున్నత న్యాయస్థానంతోపాటు వ్యవస్థ స్వతంత్రతను రాజకీయ నాయకులకు పూర్తిగా ధారాదత్తం చేసినట్లవుతుంది. దీన్ని న్యాయశాస్త్ర విద్యార్థులుగా మేం నిశ్శబ్దంగా ఉండలేకనే మీకు లేఖ రాస్తున్నాం.
రాజకీయ నాయకులకు ఒక గుణపాఠంగా మిగలాలి!
జరగబోయే పరిణామాలకు భయపడకుండా న్యాయం చేయడమే న్యాయవ్యవస్థ ఉద్దేశం. జగన్‌మోహన్‌రెడ్డిపై తీసుకొనే చర్య రాజకీయనాయకులకు ఒక గుణపాఠంగా మిగలాలి. న్యాయవ్యవస్థలపై సామాజిక మాధ్యమాలలో దుష్ప్రచారం చేసే స్వార్థశక్తులను ఎదుర్కోవడానికి ఒక యంత్రాంగాన్ని ఏర్పాటుచేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ‘‘రాజ్యాంగం ప్రసాదించిన హక్కులను సజీవంగా ఉంచాలంటే న్యాయవ్యవస్థకు స్వతంత్రత అతి ముఖ్యం. స్వతంత్రకోర్టులు లేకుంటే, ప్రాథమికహక్కులను ప్రసాదించే రాజ్యాంగ భాగాలను రద్దుచేసే ప్రమాదముంది’’ అని జస్టిస్‌ హెచ్‌.ఆర్‌.ఖన్నా చేసిన వ్యాఖ్యలతో మా లేఖను ముగిస్తున్నాం’’ అని న్యాయశాస్త్ర విద్యార్థులు వివరించారు.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు