చరిత్రలో అత్యుత్తమ టీమ్‌ఇండియా ఇదే - clive lloyd praises indian team which went to australia was the best ever team
close
Updated : 25/03/2021 14:56 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

చరిత్రలో అత్యుత్తమ టీమ్‌ఇండియా ఇదే

కోహ్లీసేనపై క్లైవ్‌లాయిడ్‌ ప్రశంసలు..

ఇంటర్నెట్‌డెస్క్‌: రెండు నెలల క్రితం ఆస్ట్రేలియాలో చారిత్రక విజయం సాధించిన టీమ్‌ఇండియాను వెస్టిండీస్‌ దిగ్గజం క్లైవ్‌లాయిడ్‌ ప్రశంసించాడు. కంగారూ గడ్డపై జరిగిన రసవత్తర పోరులో కోహ్లీసేన ప్రదర్శన తననెంతో ఆకట్టుకుందన్నాడు. అడిలైడ్‌లో జరిగిన పింక్‌బాల్‌‌ టెస్టులో టీమ్‌ఇండియా ఘోర పరాభవం మూటగట్టుకున్న తర్వాత బాగా పుంజుకొని సిరీస్‌ను కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. క్లిష్ట పరిస్థితుల్లో అద్భుతంగా కోలుకుందని, ఆస్ట్రేలియాపై ఆధిపత్యం చెలాయించిందని మాజీ క్రికెటర్‌ గుర్తు చేసుకున్నాడు. తాజాగా ఓ అంతర్జాతీయ పత్రికతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశాడు.

‘టీమ్‌ఇండియా ఇప్పుడున్న అత్యుత్తమ జట్టు. ఎందుకంటే ఇందులో భిన్నమైన ఆటగాళ్లు ఉన్నారు. ఇప్పుడు వారంతా పూర్తి ఫిట్‌నెస్‌తో కొనసాగుతున్నారు. ఆస్ట్రేలియా పర్యటనలో చాలాసార్లు వెనుకబడ్డా ఆ తర్వాత అద్భుతంగా రాణించి సిరీస్‌ కైవసం చేసుకున్నారు. ఇది మెచ్చుకోవాల్సిన విషయం. ఆ సిరీస్‌ నుంచి కోహ్లీసేన సాధిస్తున్న ఫలితాలు చూస్తే చరిత్రలో ఇదే అత్యుత్తమ టీమ్‌ఇండియా అని చెప్పొచ్చు’ అని క్లైవ్‌ లాయిడ్‌ ప్రశంసించాడు. కాగా, ఆస్ట్రేలియా పర్యటనలో టీమ్‌ఇండియా వన్డే సిరీస్‌ కోల్పోయినా తర్వాత టీ20, టెస్టు సిరీస్‌ల్లో విజయం సాధించిన సంగతి తెలిసిందే.

ముఖ్యంగా అడిలైడ్‌ టెస్టులో రెండో ఇన్నింగ్స్‌లో 36 పరుగులకే ఆలౌటయ్యాక భారత్‌ అద్భుతంగా పుంజుకుంది. రెండో టెస్టులో రహానె శతకంతో గెలిపించగా.. మూడో టెస్టులో అశ్విన్‌, విహారీ అసామాన్యమైన పోరాటం చేశారు. వీరిద్దరూ ఓడిపోయే మ్యాచ్‌ను డ్రాగా ముగించారు. దాంతో చివరిదైన నిర్ణయాత్మక నాలుగో టెస్టులో పంత్‌ చివరిరోజు దంచికొట్టి ఆస్ట్రేలియాను ఓడించాడు. దాంతో వరుసగా రెండో ఆసీస్‌ పర్యటనలోనూ టీమ్‌ఇండియా వారికి షాకిచ్చింది. ఆపై భారత్‌ వరుస విజయాలతో దూసుకుపోతోంది. ఇంగ్లాండ్‌తోనూ ఇటీవల టెస్టు, టీ20 సిరీస్ కైవసం చేసుకుంది. ఇప్పుడు వన్డే సిరీస్‌లోనూ తొలి మ్యాచ్‌ గెలుపొందగా, మరో మ్యాచ్‌ గెలిస్తే ఈ సిరీస్‌ కూడా కోహ్లీసేన వశమౌతుంది. ఈ నేపథ్యంలోనే క్లైవ్‌లాయిడ్‌ భారత జట్టును మెచ్చుకున్నాడు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని