ప్రభుత్వ  ఇంట్లో  ప్రైవేటు పెత్తనం 
close
Updated : 29/09/2021 04:36 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ప్రభుత్వ  ఇంట్లో  ప్రైవేటు పెత్తనం 

● ప్రభుత్వ ఇళ్లల్లో అనధికారిక వ్యక్తుల పాగా ●

దృష్టిసారించని అధికార యంత్రాంగం

ఈనాడు డిజిటల్‌ - కర్నూలు: ప్రభుత్వ ఉద్యోగులుండాల్సిన చోట అనధికారిక వ్యక్తులు పాగా వేశారు. పదవీ విరమణ పొందినా అక్కడే తిష్ఠవేశారు. ఇంకొందరు ఇళ్లను ఆక్రమించుకొని వ్యాపారాలు చేస్తున్నారు. ఇవీ నగర కేంద్రంలోని ఏ, బీ, సీ క్యాంపులోని ప్రభుత్వ గృహసముదాయాల (క్వార్టర్స్‌) దుస్థితి. ఖాళీ చేయించడానికి అడుగులు పడితే రాజకీయం అడ్డుపడుతోంది. దీంతో అనధికారికంగా నివాసముంటున్న వారిపై అధికారులు చర్యలు తీసుకోలేని పరిస్థితి నెలకొంది.

మూడుచోట్ల 1072 ఇళ్లు

ప్రభుత్వ ఉద్యోగుల సౌకర్యార్థం నగరంలో మూడు చోట్ల 1955లో ఇళ్ల నిర్మాణం చేపట్టారు. ఉద్యోగులు, సిబ్బంది ఉండేలా ఏ, బీ, సీ గృహ సముదాయాలు(క్వార్టర్స్‌) నిర్మించారు. ఏ క్యాంపు 27.49 ఎకరాలు, ‘బి’ క్యాంపు 100.58 ఎకరాలు, ‘సి’ క్యాంపు 24.08 ఎకరాల్లో విస్తరించి ఉంది. మూడు చోట్ల కలిపి 1,072 ప్రభుత్వ అధికారుల వసతి గృహాలున్నాయి. జిల్లా సర్వోన్నతాధికారి అటాచ్‌ చేసిన అధికారుల కుటుంబాలు ఆయా ఇళ్లల్లో ఉండాలి. సంబంధిత ఉద్యోగి హెచ్‌ఆర్‌ఏలో 4, 5 కేటగిరీల ప్రకారం అద్ధె. వేతనంలో తొలగిస్తారు. ఈ నిబంధన అమలవుతుంది అరకొరే. కారణం సింహ భాగం అనధికారిక వ్యక్తులే ఆయా ఇళ్లల్లో పాగా వేయడం.

రాజకీయం చక్రం తిప్పుతోంది

గృహాల నిర్వహణను రోడ్డు భవన నిర్మాణాల శాఖ (ఆర్‌అండ్‌బీ) పర్యవేక్షిస్తోంది. 2015లో అనధికారిక వ్యక్తులున్న గృహాలు గుర్తించి విద్యుత్తు సరఫరా, నీటి సరఫరా నిలిపి వేశారు. ఇళ్లు ఖాళీ చేయించేందుకు ఆర్‌అండ్‌బీ అడుగులు వేయగా రాజకీయ నాయకుల జోక్యంతో నిలిచిపోయింది.

2011లో 50 సెంట్లలో ఉన్న ఆరు ఇళ్లను ఓ హార్ట్‌ఫౌండేషన్‌కు అప్పటి కలెక్టర్‌ కేటాయించారు. ప్రతి నెలా అద్దె నిర్ణయించి వసూళ్లు చేయాలని ఆదేశించినా ఆశాఖ పట్టీపట్టనట్లు వ్యవహరించింది.

●ప్రభుత్వ భూమిని ప్రైవేటు సంస్థకు కట్టబెట్టడం, ఎమ్మెల్యే నిధుల కేటాయింపు ఇలా నిబంధనలను ఉల్లంఘనపై విజిలెన్స్‌ శాఖ 2014లో అప్పటి ప్రభుత్వానికి నివేదికలు పంపింది. రాజకీయ జోక్యంతో చర్యలకు బ్రేక్‌ పడింది.

ఓ ‘బి’ క్యాంపులో 343 నంబరు ఇంట్లో ఓ వ్యక్తి మరో రెండింటిని (347, 354 నంబర్ల ఇళ్లు) ఆక్రమించుకొని అగరబత్తిలకు అవసరమైన ముడి సరకు నిల్వ చేసుకొన్నారు. అక్కడే తయారీ చేస్తూ దర్జాగా విక్రయాలు సాగిస్తున్నారు. ఇక్కడ 12 గృహాలుంటే ఒక్కదాంట్లోనే అధికారి ఉంటున్నారు.

వ్యక్తి మూడు ఇళ్లలో అనధికారికంగా వ్యాపారం నిర్వహిస్తుంటే అధికారులు కళ్లకు గంతలు కట్టుకొన్నారు.

తెలిసినా పట్టించుకోవడం లేదు

ప్రభుత్వ గృహాల్లో వందల సంఖ్యలో అనధికారిక వ్యక్తులు నివాసం ఉంటున్నారు. ఖాళీ స్థలాల్లో రేకుల షెడ్లు వేస్తున్నారు. వాటిని శీతలపానీయ, టైలర్‌, ఇతర వ్యాపారాలకు అద్దెకు ఇచ్చి జేబులు నింపుకొంటున్నారు. ● పదవీ విరమణ పొందినా కొందరు అక్కడి నుంచి కదలడం లేదు. ఇంకొందరు పదవీవిరమణ పొందిన వ్యక్తుల పత్రాలు చూపించి తిష్ఠ వేశారు. కొత్తగా అధికారులెవరైనా వస్తే ఖాళీ చేయకుండా వెనక్కి పంపుతున్నారు. తలుపులు, కిటీకీల్లేని నిర్మానుష్య గృహాల్లో కొందరు మద్యం తాగడం, అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాలుగా మార్చారు.

 

చిత్రంలో కనిపిస్తున్న షెడ్డు సి క్యాంపులోనిది. సమీప గృహాన్ని ఏ ప్రభుత్వ ఉద్యోగికి అధికారికంగా కేటాయించలేదు. అయితే ఓ శాఖకు చెందిన ఉద్యోగి ఆర్‌అండ్‌బీ శాఖ సహకారంతో అనధికారికంగా అందులో ఉండటమేకాకుండా ఇంటి ప్రాంగణంలో షెడ్డు నిర్మించి షామియానా వ్యాపారికి అద్దెకివ్వడం గమనార్హం.

అనధికారిక వ్యాపారాలు మా దృష్టికి రాలేదు - ఏవీ శ్రీధర్‌రెడ్డి, ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ(ఎఫ్‌ఏసీ)

షెడ్లు వేస్తున్న విషయం మా దృష్టికి వచ్చింది. అనధికారిక వ్యాపారాల నిర్వహణపై రాలేదు. వెంటనే పరిశీలన చేసి చర్యలు తీసుకుంటాం. ఇంటింటి సర్వే చేసి అనధికారికంగా నివాసం ఉంటున్న వారిని గుర్తించొచ్ఛు ఖాళీ చేయించడంలో రెవెన్యూ, పోలీసు అధికారులు సహకారం అవసరం. వెయ్యి క్వార్టర్స్‌కు సాధారణ మరమ్మతుల కింద రూ.10 లక్షలకు టెండర్లు పిలిస్తే ఎవరూ ముందుకు రాలేదు.


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని