TS News: ఆ తర్వాతే.. సాధారణ సేవలు!
close

తాజా వార్తలు

Updated : 23/06/2021 07:47 IST

TS News: ఆ తర్వాతే.. సాధారణ సేవలు!

గాంధీలో బ్లాక్‌ఫంగస్‌ శస్త్ర చికిత్సలు వేగవంతం

ఈనాడు, హైదరాబాద్‌: కరోనా కేసుల తగ్గుదల ఇదే విధంగా కొనసాగితే గాంధీలో ఇతర సాధారణ సేవలు ప్రారంభించేందుకు అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. జులై మొదటి వారం తర్వాత ఎప్పుడైనా ఇతర సేవలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం కొవిడ్‌ కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. 400 మందిలోపు మాత్రమే చికిత్స పొందుతున్నారు. గతంలో నిత్యం 200 మందికి వరకు చేరితే ప్రస్తుతం ఆ సంఖ్య 15-20కు తగ్గింది. రోజూ 30-40 మంది డిశ్ఛార్జి అవుతున్నారు. మరోవైపు మ్యూకార్‌మైకోసిస్‌(బ్లాకఫంగస్‌) బాధితులు మాత్రం గాంధీ బాట పడుతున్నారు. నిత్యం 20 మంది వరకు వివిధ జిల్లాల నుంచి చికిత్స కోసం చేరుతున్నారు. ప్రస్తుతం బ్లాక్‌ఫంగస్‌ బాధితులు 300 మంది వరకు చికిత్స పొందుతున్నారు. ఇందులో చాలామందికి శస్త్ర చికిత్స అవసరం ఉంది. దీంతో కోఠి ఈఎన్‌టీ ఆసుపత్రి నుంచి మరో ఆరుగురు వైద్యులను గాంధీలో నియమించారు. నిత్యం 30 వంతున శస్త్ర చికిత్సలు చేయాలని నిర్ణయించారు. ఒక్కో బృందంలో ఈఎన్‌టీ, డెంటల్‌, న్యూరో, ప్లాస్టిక్‌ సర్జన్లతోపాటు అనస్తీషీయాను నియమించి వేగవంతం చేస్తున్నారు. ప్రస్తుతం 100 మందికి సంక్షిష్ట శస్త్ర చికిత్సలు చేశారు. 20 మందికి ఒక కన్ను తొలగించాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరో 67 మందికి దవడ, అంగులి తొలగించారు. కొందరిలో చికిత్సల్లో జాప్యం వల్ల కంటి నరాల్లోకి ఫంగస్‌ సోకుతోందని, దీంతో కన్ను తొలగింపు తప్పడం లేదని వైద్యులు తెలిపారు. కొందరిలో 3 రోజులకే పరిస్థితి తీవ్రంగా మారుతోందన్నారు. ఈ నెలారుకు ప్రస్తుతం పెండింగ్‌లో ఉన్న బ్లాక్‌ఫంగస్‌ శస్త్ర చికిత్సలను పూర్తి చేయనున్నారు. అప్పటికి కొత్త కేసులు వచ్చే పరిస్థితి కూడా తగ్గనుంది. లాక్‌డౌన్‌ ఎత్తివేయడంతో రోడ్లపై జనం రద్దీ పెరిగింది. ఈ క్రమంలో కేసులు పెరిగితే కొంత ఇబ్బందే. ఈ నేపథ్యంలో జులై మొదటి వారం వరకు ఆగితే కొంత స్పష్టత రానుందని, ఆ తర్వాత నిర్ణయం తీసుకుంటున్నామని ఉన్నతాధికారులు తెలిపారు.

వైద్య విద్యార్థులకు ఇబ్బంది

గాంధీని కొవిడ్‌ ఆసుపత్రిగా కొనసాగించడం వల్ల వైద్య విద్యార్థులు సమస్యలు ఎదుర్కొంటున్నారు. కేవలం కరోనా సేవలకే పరిమితమైతే ఇతర సూపర్‌ స్పెషాలిటీ సేవలపై శిక్షణ మందగిస్తుంది. సాధారణ హృద్రోగ చికిత్సలు, స్టంట్లు వేయడం, ఓపెన్‌ హార్ట్‌ సర్జరీలు నిలిచిపోయాయి. గతేడాది సరైన శిక్షణ లేకుండానే పీజీ వైద్యులు బయటకు వచ్చారు. దీంతో రెసిడెంట్‌ వైద్యులతోపాటు ఎంబీబీఎస్‌ విద్యార్థులకు కొంత ఇబ్బందే. రానున్న రోజుల్లో కొవిడ్‌ కేసుల సంఖ్య ఆధారంగా మిగతా వాటిని ఇతర సేవలకు కేటాయిస్తామని గాంధీ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రాజారావు తెలిపారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని