close

తాజా వార్తలు

బ్యాంకింగ్‌ ఫండ్లు బాగుంటాయా?

నేను మ్యూచువల్‌ ఫండ్లలో మదుపు చేయాలనే ఆలోచనతో ఉన్నాను. నా స్నేహితుడు బ్యాంకింగ్‌ షేర్లలో లేదా బ్యాంకింగ్‌ రంగంలో మదుపు చేసే మ్యూచువల్‌ ఫండ్లలో మదుపు చేస్తే మంచి లాభాలు వస్తాయని చెబుతున్నాడు. ప్రస్తుతం ఈ ఫండ్లలో మదుపు చేయడం మంచిదేనా? నెలకు రూ.10,000 మదుపు చేద్దామనుకుంటున్నాను.

- రాజశేఖర్‌

ఒకే రంగానికి పరిమితమైన ఫండ్లలో మదుపు చేయడం వల్ల కాస్త అధిక నష్టభయం ఉంటుంది. ఆయా రంగానికి సంబంధించి పూర్తి అవగాహన ఉన్నప్పుడే అందులో ఉండే మంచి చెడులను విశ్లేషించగలం. వీటికన్నా వివిధ రంగాల్లో మదుపు చేసే డైవర్సిఫైడ్‌ ఈక్విటీ ఫండ్లే ఉత్తమమని చెప్పొచ్చు. ముందుగా వైవిధ్యంగా మదుపు చేసే పథకాల్లో పెట్టుబడిని ప్రారంభించండి. ఆ తర్వాత మార్కెట్‌ను అర్థం చేసుకుంటూ.. ఒకే రంగానికి పరిమితమైన ఫండ్లను ఎంచుకోవచ్చు. ప్రస్తుతం మీరు పెట్టుబడి కోసం హెచ్‌డీఎఫ్‌సీ ఈక్విటీ ఫండ్‌, ఆదిత్య బిర్లా సన్‌ లైఫ్‌ ఈక్విటీ ఫండ్‌, డీఎస్‌పీ ఈక్విటీ ఫండ్లను పరిశీలించవచ్చు.

నేను పదవీ విరమణ చేశాను. పింఛను వస్తోంది. కానీ, అది నా అవసరాలకు ఏమాత్రం సరిపోవడం లేదు. పదవీ విరమణ సమయంలో నాకు వచ్చిన రూ.30లక్షలను ఎక్కడైనా మదుపు చేయాలనే ఆలోచనతో ఉన్నాను. పోర్ట్‌ఫోలియో మేనేజ్‌మెంట్‌ సర్వీసెస్‌ (పీఎంఎస్‌) ద్వారా మదుపు చేయాల్సిందిగా సూచిస్తున్నారు. దీన్ని ఎంచుకోవడం మంచిదేనా? పన్ను భారం లేకుండా బ్యాంకు ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ కన్నా కాస్త అధిక రాబడి వస్తే చాలు. ఎప్పుడంటే అప్పుడు తీసుకునే వీలుండాలనేది నా ఆలోచన.

- నారాయణ రావు

మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు మీ పెట్టుబడిని వెనక్కి తీసుకోవాలనే ఆలోచనతో ఉన్నారు. కాబట్టి, మీకు పీఎంఎస్‌ పథకాలు ఎంతమాత్రం సరిపోవు. సీనియర్‌ సిటిజన్లకు ఈ పథకాలు అంతగా నప్పవనే చెప్పాలి. మీలాంటి వారు నగదును సాధ్యమైనంత అందుబాటులో ఉండేలా చూసుకోవాలి. మీరు రూ.10లక్షలను బ్యాంకు ఫిక్స్‌డ్‌ డిపాజిట్లలో జమ చేయండి. రూ.10లక్షలను ఈక్విటీ ఫండ్లకు మళ్లించండి. మరో రూ.6లక్షలను బ్యాలెన్స్‌డ్‌ అడ్వాంటేజీ ఫండ్లు, రూ.2లక్షలను లిక్విడ్‌ ఫండ్లలో, మరో రూ.2లక్షలను బ్యాంకు పొదుపు ఖాతాలో ఉండేలా చూసుకోండి. దీనివల్ల మీకు ఫిక్స్‌డ్‌ డిపాజిట్లకన్నా కాస్త అధిక రాబడే అందుతుంది. కోటక్‌ ఈక్విటీ సేవింగ్స్‌ ఫండ్‌, ఐసీఐసీఐ బ్యాలెన్స్‌డ్‌ అడ్వాంటేజ్‌ ఫండ్‌, యాక్సిస్‌ లిక్విడ్‌ ఫండ్లను పరిశీలించండి.

నేను 2011లో రూ.20లక్షల గృహరుణాన్ని తీసుకున్నాను. వ్యవధి 20 ఏళ్లు. అప్పుడు 8.5శాతం చొప్పున అప్పు తీసుకున్నాను. ప్రస్తుతం మరో రూ.3లక్షలను ఇంటి మరమ్మతుల కోసం తీసుకోవాలనుకుంటున్నా. అప్పుడు తీసుకున్న వడ్డీ రేటుకే రుణం ఇస్తారా? లేకపోతే పాత, కొత్త రుణాలను ఒకే చోట కలిపి కొత్త వడ్డీరేటును వర్తింపచేస్తారా?

- జగదీశ్‌

మీరు ఇంటి మరమ్మతుల కోసం రుణం తీసుకోవాలనుకుంటున్నారు కాబట్టి, టాప్‌అప్‌ లోన్‌కు బదులుగా ఇంటి అభివృద్ధి రుణం ఇవ్వాల్సిందిగా అడగండి. దీనివల్ల తక్కువ వడ్డీ రేటుకే రుణం లభిస్తుంది. దీన్ని కూడా గృహరుణంలాగే భావిస్తారు కాబట్టి, పన్ను ప్రయోజనాలూ లభిస్తాయి. ఈ రుణాన్ని కొత్త దానిగానే భావిస్తారు.. కాబట్టి, ప్రస్తుతం ఉన్న వడ్డీ రేట్లే దీనికీ వర్తిస్తాయి. కొత్త రుణం తీసుకోవడం వల్ల పాత రుణ వడ్డీ రేట్లపై ఎలాంటి ప్రభావమూ ఉండదు.

నేను వ్యక్తిగత ప్రమాద బీమా పాలసీ తీసుకోవాలనుకుంటున్నాను. నాకు ఉన్న టర్మ్‌ ప్లాన్‌కు దీన్ని అదనంగా జోడించుకునే వీలుంది. నా క్రెడిట్‌ కార్డు కంపెనీ కూడా ఈ పాలసీని అందిస్తానని చెబుతోంది. నేను దేన్ని ఎంచుకోవాలి?

- సురేంద్ర

వ్యక్తిగత ప్రమాద బీమా పాలసీ తీసుకోవాలనుకున్నప్పుడు ఏదైనా సాధారణ బీమా సంస్థ నుంచి ప్రత్యేకంగా పాలసీని తీసుకోవడం ఉత్తమం. ప్రమాదంలో మరణించినా, పూర్తి లేదా పాక్షిక వైకల్యం పొందినప్పుడు ఈ పాలసీ ద్వారా పరిహారం లభిస్తుంది. కావాల్సిన మొత్తానికి పాలసీని తీసుకోవచ్చు. జీవిత బీమా పాలసీకి అనుబంధంగా తీసుకున్నప్పుడు ప్రమాదంలో మరణించినప్పుడు మాత్రమే పరిహారం ఇచ్చే నిబంధనతో ఉంటుంది. పాలసీ విలువ కూడా జీవిత బీమా మొత్తాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. క్రెడిట్‌ కార్డులు సాధారణంగా బృంద బీమా పాలసీగా దీన్ని అందిస్తుంటాయి. మీరు కార్డును వాడినన్ని రోజులే ఈ బీమా మీకు వర్తిస్తుంది. 

- సాయి కృష్ణ పత్రి, సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ ప్లానర్‌

Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.