వాతావరణ శాస్త్రంతో ఉపాధి?

ఎంఎస్‌సీ (మీటియొరాలజీ) వాతావరణ శాస్త్రానికి సంబంధించిన కోర్సు. దీనిలో వాతావరణ పరిశీలనల రికార్డింగ్‌, డేటాను విశ్లేషణ, వాతావరణ వ్యవస్థల

Updated : 23 Dec 2022 16:49 IST

ఎంఎస్‌సీ (మీటియొరాలజీ) చదువుతున్నాను. నాకున్న ఉపాధి అవకాశాలేంటి?  -  గణేష్‌

* ఎంఎస్‌సీ (మీటియొరాలజీ) వాతావరణ శాస్త్రానికి సంబంధించిన కోర్సు. దీనిలో వాతావరణ పరిశీలనల రికార్డింగ్‌, డేటాను విశ్లేషణ, వాతావరణ వ్యవస్థల అంచనాకు కావాల్సిన సాంకేతిక పరికరాలపై శిక్షణ లభిస్తుంది. వీటితో పాటుగా ఉష్ణమండల తుపానులు, పట్టణ వరదలు, నదీ పరీవాహక ప్రాంతాల్లో  వరదలు, భూకంపాలు, రిమోట్‌ సెన్సింగ్‌, భౌగోళిక సమాచార వ్యవస్థ (జీఐఎస్‌), వాతావరణ రాడార్లు, వాతావరణ ఉపగ్రహాల ప్రత్యేకతలు, రోజువారీ వాతావరణ మార్పులు, గ్లోబల్‌ వార్మింగ్‌ ప్రభావం, ఇండియన్‌ సమ్మర్‌ మాన్‌సూన్‌ గురించి నేర్చుకుంటారు.
ఈ కోర్సు చదివినవారికి ఇస్రో, ఇండియన్‌  మెటియోరాలజికల్‌ విభాగం, నేషనల్‌  రిమోట్‌ సెన్సింగ్‌ సెంటర్‌, ఇండియన్‌ నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ ఓషన్‌ ఇన్ఫర్మేటిక్స్‌ సర్వీసెస్‌, నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఓషనోగ్రఫీ, ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ట్రాపికల్‌ మీటియొరాలజీ, ఇండియన్‌ ఏర్‌ఫోర్స్‌, అగ్రికల్చరల్‌ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌, ఏర్‌పోర్ట్‌, డీఆర్‌డీఓల్లో ఉద్యోగావకాశాలుంటాయి. ప్రైవేటు ఉద్యోగాల విషయానికొస్తే ఇన్సూరెన్స్‌, విండ్‌ ఎనర్జీ, టీవీ రంగాల్లో అవకాశాలు ఉంటాయి.
డేటా అనలిటిక్స్‌, బిగ్‌ డేటాల్లో ఏదైనా స్వల్పకాల సర్టిఫికెట్‌/డిప్లొమా కోర్సు చేసి ప్రోగ్రామింగ్‌, కోడింగ్‌లపై పట్టు సాధిస్తే అనలిటిక్స్‌ రంగంలో చాలా ఉపాధి అవకాశాలుంటాయి. స్టాటిస్టిక్స్‌కు సంబంధించిన సర్టిఫికెట్‌ కోర్సులు చేసి వాతావరణ అంచనాలూ- సూచనల విధుల్లో ప్రవేశించవచ్చు. మెటియోరాలజీ రంగంలో పరిశోధన చేసినవారికి దేశ విదేశాల్లో బోధన, పరిశోధన సంస్థల్లో మెరుగైన ఉద్యోగాలు లభిస్తాయి.

- ప్రొ. బి. రాజశేఖర్‌, కెరియర్‌ కౌన్సెలర్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని