తెల్లారింది  లేవండోయ్‌!

బ్రాహ్మీ ముహూర్తం ఉత్థాయ చింతయే దాత్మ హితం |స్మరణం వాసుదేవస్య కుర్యాత్‌ కలిమలాపహమ్‌ ||రామయ్యా నిద్రలేవయ్యా...అన్నాశ్రీరంగా మేలుకోవయ్యా... అన్నా... అది నిఖిల ప్రపంచానికీి మేలుకొలుపు. నిగూఢ నిశీధిలో నిద్రించిన ప్రపంచం కళ్లు తెరిచేది ప్రాతఃకాలాన్నే. అందులోనూ బ్రహ్మీముహూర్తంలో నిద్రలేవడం శ్రేష్ఠమని చెబుతారు.అసలేంటీ బ్రహ్మీముహూర్తం? భగవంతుడిచ్చిన శక్తి అందరిలోనూ ఉంది. దాన్ని జాగృతం చేయాల్సిన బాధ్యత మనదే. శరీరాన్ని, మనసును లీనం చేసి మన కర్తవ్యాన్ని మనం...

Updated : 21 May 2020 13:17 IST

బ్రాహ్మీ ముహూర్తం ఉత్థాయ చింతయే దాత్మ హితం |

స్మరణం వాసుదేవస్య కుర్యాత్‌ కలిమలాపహమ్‌ ||

రామయ్యా నిద్రలేవయ్యా...అన్నా

శ్రీరంగా మేలుకోవయ్యా... అన్నా... అది నిఖిల ప్రపంచానికీి మేలుకొలుపు. నిగూఢ నిశీధిలో నిద్రించిన ప్రపంచం కళ్లు తెరిచేది ప్రాతఃకాలాన్నే. అందులోనూ బ్రహ్మీముహూర్తంలో నిద్రలేవడం శ్రేష్ఠమని చెబుతారు.

అసలేంటీ బ్రహ్మీముహూర్తం?

గవంతుడిచ్చిన శక్తి అందరిలోనూ ఉంది. దాన్ని జాగృతం చేయాల్సిన బాధ్యత మనదే. శరీరాన్ని, మనసును లీనం చేసి మన కర్తవ్యాన్ని మనం నిర్వర్తిస్తుంటే శరీరానికి ఆరోగ్యం, మనసుకు ఆహ్లాదం వస్తాయి. ఇలా చేయడానికి ప్రకృతి ఇచ్చిన వరం బ్రాహ్మీ ముహూర్తం. ఆయుర్వృద్ధిని కోరుకునే వారు తప్పనిసరిగా బ్రాహ్మీ ముహూర్తంలో నిద్ర లేవాలి దేవీ భాగవతం కూడా చెబుతోంది.

బ్రాహ్మీ అనే పదానికి సరస్వతి అని అర్థం. మనలోని బుద్ధి ప్రచోదనం చెంది సరస్వతీదేవి అనుగ్రహం జ్ఞానరూపంలో కలిగే ఉత్తమ సమయం కాబట్టి ఈ సమయానికి బ్రాహ్మీ ముహూర్తం అని పేరు వచ్చింది. ఈ సమయంలో బ్రహ్మ, సరస్వతి ఇద్దరూ హంస వాహనంపై ఆకాశ సంచారం చేస్తుంటారు కాబట్టి ఆ సమయంలో ఉపాసన చేసేవారికి అద్భుత ఫలితాలు కలుగుతాయని చెబుతారు. అందుకే సాధకులకు ఇది విలువైన సమయం. దీన్ని వృథా చేసుకుంటే అద్భుతమైన కాలాన్ని కోల్పోయినట్లంటారు. శుశ్రుత మహర్షి బ్రాహ్మీ ముహూర్తాన్ని అమృతమయమని పేర్కొన్నాడు. సూర్యోదయం తర్వాత కూడా నిద్రిస్తే తమోగుణాలైన బద్దకం, ఆలస్యం, అజాగ్రత్త పెరుగుతుంది. అర్ధరాత్రి దాటే వరకూ మెలకువగా ఉండడం వల్ల రజోగుణాలైన క్రోధం, దంభం, విపరీత ప్రతిస్పందన పెరుగుతుంది. అందుకే తెల్లవారుజామున ఆలోచించు, పగలు కార్యోన్ముఖుడివై పని చెయ్యి. రాత్రి సమయంలో నిద్రించాలని పెద్దలు చెబుతుంటారు.

బ్రాహ్మీ ముహుర్తంలో చేసిన ఓంకార ధ్వని వలన సుషుమ్న నాడి తెరుచుకుంటుంది. అందుకే ఋషులు, యోగులు ఈ సమయంలో ఓంకారం జపిస్తారు. ఎప్పుడైతే మన నాసికా రంధ్రాల్లోకి శ్వాస ప్రవహిస్తూ ఉంటుందో వెంటనే సుష ుమ్న నాడి పనిచెయ్యటం మొదలవుతుంది. అప్పుడే ధ్యానం బాగా కుదురుతుంది. తద్వారా ఆధ్యాత్మిక సాధన మరింత ఉన్నత స్థితికి చేరుకుని, అంతిమంగా మన అంతర్యామిగా ఉన్న ఆత్మ స్వరూపమైన పరమాత్మ చేరుకునే సిద్ధి కలుగుతుంది. తెల్లవారు జామున అంతర్ముఖలమై మేధోమథనం చేస్తే మనలోనే మనకు ఎన్నో విషయాలు అవగతమవుతాయి. తెల్లవారు జామున లేచే వారికి సూర్య చంద్రులు, నక్షత్రాలు నుంచి కాంతి పూర్తిగా అంది, తద్వారా వారిలో నిద్రిస్తున్న జీవశక్తి చైతన్యవంతమవుతుంది. ఆయుర్వేద శాస్త్రం ప్రకారం కాలకృత్యాల నిర్వహణకు అవసరమైన అపాన వాయువు సూర్యోదయం ముందు మరింత ప్రభావవంతంగా పని చేస్తుంది. వ్యర్థ పదార్థాలను శరీరం నుంచి వదిలిస్తుంది.

అదే శుభ ముహూర్తం

పూర్వం కాలాన్ని ఘడియలలో లెక్కించేవారు. ఒక ఘడియ ప్రస్తుత కాలమాన ప్రకారం 24 నిమిషాలకు సమానం. ఒక ముహూర్తం అంటే రెండు ఘడియల కాలం. అంటే 48 నిమిషాల కాల వ్యవధి ఒక ముహూర్తం అవుతుంది. ఒక పగలు, ఒక రాత్రి కలిపిన కాలవ్యవధిని అహోరాత్రం అంటారు. ఒక అహోరాత్రానికి 30 ముహూర్తాలు ఉంటాయి. అంటే ఒక రోజులో 30 ముహూర్తాలు ఉంటాయి. సూర్యోదయ సమయానికి కచ్చితంగా జరుగుతూ ఉండేది ఆసురీ ముహూర్తం. దీనికన్నా ముందుండేది బ్రాహ్మీ ముహూర్తం అవుతుంది. అంటే సూర్యోదయానికి ముందు వచ్చే ముహూర్తమే బ్రాహ్మీ ముహూర్తం. రోజు మొత్తంలో వచ్చే 29వ ముహూర్తం బ్రాహ్మీ అవుతుంది.


సూర్యోదయం ఉదయం గం. 5.28 అయితే అంతకుముందు జరిగే ముహూర్తం (48 నిమిషాల కాల వ్యవధి) గం. 4.40 నుంచి గం. 5.28 వరకు ఉండే సమయం ఆసురీ అవుతుంది. ఈ ముహూర్తానికి ముందు అంటే గం. 4.40కు ముందు ఉండే ముహూర్తం అంటే గం. 3.52 నుంచి గం. 4.40 వరకు ఉండే 48 నిమిషాల కాలం బ్రాహ్మీ ముహూర్తం అవుతుంది. ఇదంతా సూర్యోదయ సమయాన్ని అనుసరించి ఉంటుంది.

నిద్రలేచాక...

నిషి ఏ సమయంలో నిద్రలేవాలి. నిద్రలేచిన వెంటనే ఏం చెయ్యాలి. శరీరానికి నిద్రమత్తును దూరం చేస్తూ, కళ్ళు తెరచి ఈ లోకాన్ని చూసేందుకు ముందుగా పాటించాల్సిన ఆచార క్రమం ఏమిటనే విషయాన్ని ధర్మశాస్త్ర గ్రంథాలు చెబుతున్నాయి.

నిద్ర లేచిన తర్వాత ఇష్టదైవాన్ని స్మరించాలి. తరువాత మెల్లగా కళ్ళు తెరిచి కుడి అరచేయిని కింది నుంచి పైకి చూస్తూ

కరాగ్రే వసతే లక్ష్మీ కరమధ్యే సరస్వతీ |

కరమూలే తు గౌరీ చ ప్రభాతే కరదర్శనమ్‌ ||

అరచేయి కిందివైపు చివర లక్ష్మిని , మధ్యలో సరస్వతిని , మొదట్లో గౌరిని స్మరించాలి . తర్వాత శుభాశుభాలు ఏవి చూసినా ఇబ్బంది ఉండదు. ఆ తర్వాత

సముద్ర వసనే దేవీ పర్వత స్తన మండలే |

విష్ణుపత్ని నమస్తుభ్యం పాదస్పర్శం క్షమస్వమే ||

అంటూ భూదేవి ప్రార్ధన పూర్వక నమస్కారం చేసి, ఆ తర్వాతనే కాలు నేలపై మోపాలి.

- కప్పగంతు రామకృష్ణ


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని