ధన్యతనిచ్చే పుణ్య కాశి 

ఎంత పురాతనమో... అంత సనాతనం... ఎంత పవిత్రమో... అంత మహిమాన్వితం... ఆదిశంకరులు అద్వైతానికి అర్థం చెప్పిందిక్కడే... పాండవులు పాప పంకిలాలను తొలగించుకుందిక్కడే... అందరూ అన్నిచోట్లా జీవించాలని ప్రయత్నిస్తారు...

Published : 25 Feb 2021 00:53 IST

ఎంత పురాతనమో... అంత సనాతనం... ఎంత పవిత్రమో... అంత మహిమాన్వితం... ఆదిశంకరులు అద్వైతానికి అర్థం చెప్పిందిక్కడే... పాండవులు పాప పంకిలాలను తొలగించుకుందిక్కడే... అందరూ అన్నిచోట్లా జీవించాలని ప్రయత్నిస్తారు... ఇక్కడ మాత్రం జీవన్ముక్తి పొందాలని తపిస్తారు.. ఇది ముక్తి స్థలి.. సాక్షాత్‌ పరమశివుడు కొలువైన దివ్యస్థలి..  భక్తయోగ పదన్యాసి... వారణాసి!
‘నగాయత్య్రా సమో మంత్రమ్‌ న కాశీ సదృశీ పురీ,
నవిశ్వేశ సమంలింగం సత్యం సత్యం పునః పునః’

ఇది కాశీ మహాత్మ్యంలోని మొదటి శ్లోకం. గాయత్రీ మంత్రంతో సరితూగే మంత్రం, కాశీపురానికి సమానమైన పుణ్య స్థలం, ఇక్కడి విశ్వేశ్వర లింగానికి సాటివచ్చే శివస్వరూపం ఏదీ లేదు అన్నది శ్లోకార్ధం.   కాశీని విశ్వేశ్వరుడు ఎప్పుడూ విడిచిపెట్టి ఉండడు కాబట్టి దీనికి అవిముక్త క్షేత్రం అని పేరొచ్చింది. కపిల మహర్షి శాపానికి గురైన తన పూర్వీకులందరికీ ఉత్తమగతులు కల్పించటానికి భగీరథుడు ఎంతో కష్టపడి స్వర్గలోకాల నుంచి గంగను భూమికి తెచ్చి కాశీలో ఉన్న మణికర్ణికలో విడిచిపెట్టాడు. ఆనాటి నుంచి ఈ నగరానికి మరింత పవిత్రత వచ్చింది. ఈ నగరానికి ఉత్తర, దక్షిణ దిక్కుల్లో వారుణ, అసి అనే నదులు ప్రవహిస్తున్నాయి. అసి నదిలో స్నానం చేసిన వారికి దోషాలు నశించేలా, వారుణ నదిలో స్నానం చేసిన వారికి విఘ్నాలు తొలగేలా దేవతలు వరమిచ్చారు. ఆ రెండు పుణ్య నదులున్న ప్రదేశం కాబట్టి ఇది వారణాసి అనే పేరుతోనూ ప్రసిద్ధిపొందింది. సనాతన సంప్రదాయంలో అయోధ్య, మధుర, గయ, కాశీ, అవంతిక, కంచి, ద్వారక నగరాలు సప్త ముక్తి నగరాలుగా ప్రసిద్ధిచెందాయి. వీటిలో కాశీ విశిష్ఠమైంది. బౌద్ధులకు, జైనులకు కూడా ఇది పుణ్యక్షేత్రం. అష్టాదశ శక్తిపీఠాలలో కాశీ కూడా ఒకటి. దక్షయజ్ఞంలో ఆత్మార్పణం చేసిన సతీదేవి చెవిపోగు పడిన చోటనే విశాలాక్షి మందిరం నిర్మితమైందంటారు. కురుక్షేత్ర యుద్ధం తరువాత పాండవులు దాయాదులను చంపిన పాపం పోయేందుకు సప్త ముక్తిపురాలలో ఒకటైన కాశీ పట్టణానికే సాధనకు వెళ్ళారు. తొలినాళ్ల నుంచి కాశీకి జ్ఞాన నిధిగా గుర్తింపు ఉంది.ఈ కారణం చేతనే ఆదిశంకరులు తన బ్రహ్మసూత్ర భాష్యాన్ని, భజ గోవింద స్తోత్రాన్ని కాశీలో రచించాడంటారు. ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన కాశీ విశ్వేశ్వర దర్శనం ఇతర లింగాల దర్శనం కంటే అధిక ఫలప్రదమని భక్తుల విశ్వాసం.

గంగాతరంగ రమణీయజటాకలాపం
గౌరీనిరంతర విభూషితవామభాగమ్‌
నారాయణప్రియమనంగ మదాపహారం
వారాణసీ పురపతిం భజవిశ్వనాథమ్‌!

ఆయన ఆజ్ఞ లేనిదే..:  అధర్మబద్ధంగా వ్యవహరించి దైవానికి ఇష్టం లేని పనులు చేసిన వారికి మాత్రం కాశీ ప్రవేశం దక్కదని చెబుతారు. తానుండే నగరంలోకి ఎవరిని అనుమతించాలో సాక్షాత్తూ విశ్వేశ్వరుడే నిర్ణయించి వారణాసిలో ఉన్న విఘ్నేశ్వరుడికి చెబుతాడు. విశ్వేశ్వరుడి ఆజ్ఞను విఘ్నేశ్వరుడు అనుసరిస్తూ కాశీలో ఉత్తములను మాత్రమే అనుమతిస్తూ ఉంటాడన్నది నమ్మకం.
ఎన్నో పుణ్యఘట్టాలు...
‘నాస్తి గంగా సమం తీర్థం కలికల్మషనాశనమ్‌
నాస్తి ముక్తి ప్రదం క్షేత్రం అవిముక్త సమం హరే’

కలి కల్మషాలన్నిటినీ నాశనం చేస్తుంది గంగ. అంతటి ముక్తినిచ్చే తీర్థం మరొకటి లేదని కాశీఖండం 27వ అధ్యాయం చెబుతోంది. గంగమ్మతల్లి శక్తి స్వరూపిణి. కాబట్టే శాక్తేయులకు కూడా కాశీ పరమ పవిత్ర క్షేత్రం. వారణాసిలో సుమారు 84 ఘాట్‌లు ఉన్నాయి. ఆధ్యాత్మిక భావాలతో ఈ స్నానఘట్టాలు ముడిపడి ఉన్నాయి. వీటిలో దశాశ్వమేథఘట్టం, పంచగంగ ఘట్టం,  మణికర్ణిక, హరిశ్చంద్ర ఘాట్లు ప్రత్యేకమైనవి.  తులసీ ఘాట్‌ వద్ద తులసీదాసు తులసీ రామాయణాన్ని రచించాడు. దశాశ్వమేథ ఘాట్‌లో.  బ్రహ్మ స్వయంగా  పది అశ్వమేథ యాగాలు చేసి శివుడిని ఇక్కడ కొలువుండమని వేడుకున్నాడని పురాణ గాథలు వివరిస్తున్నాయి.  శివుడి సమక్షంలో విష్ణువు ఇక్కడ తన సుదర్శన చక్రంతో ఒక గొయ్యిని తవ్వి దాన్ని తన స్వేదంతో నింపుతుండగా విష్ణువు చెవి కుండలం (మణి కర్ణిక) అందులో పడింది.అదే మణికర్ణిక ఘాట్‌ అని చెబుతారు. ఇక్కడ పెద్దఎత్తున దహన సంస్కారాలు జరుగుతుంటాయి. అందుకే మణికర్ణికాఘాట్‌కు మహాశ్మశానమని కూడా పేరుంది. ఇక్కడ మరణిస్తున్న వారి చెవిలో పరమశివుడు తారక మంత్రం ఉపదేశిస్తుంటాడన్నది విశ్వాసం.ఈ ఘాట్‌లో మిట్ట మధ్యాహ్నం మణికర్ణిక స్తవం చదువుకుని, స్నానం చేస్తే చాలా పుణ్యం వస్తుందని ఆదిశంకరాచార్యుల శివానందలహరి పేర్కొంటోంది.
ః కాశీ మహానగరంలో ఉండే అన్నపూర్ణమ్మ తల్లి, విశ్వేశ్వరుడు నమ్మిన భక్తులకు కొంగుబంగారంలాంటివారు. కాశీ నగరంలోని అన్నపూర్ణాదేవి గుడి చుట్టూ చేసిన ప్రదక్షిణల ప్రభావం ఎంత గొప్పదో తెలిపే కథ ఒకటి దేవీభాగవతం పదకొండో స్కంధంలో కనిపిస్తుంది. పూర్వం హిమాలయ పర్వతాల్లో ఒక చక్రవాక పక్షి ఉండేది. అది రోజూ ఆహారం కోసం కాశీనగరానికి వచ్చి చేరేది.   అన్నపూర్ణాదేవి మందిరం చుట్టూ పడిపున్న మెతుకులను తింటూ పొట్ట నింపుకునేది. ఇలా మెతుకులను ఏరి తినే క్రమంలో దానికి తెలియకుండానే ఆది గుడిచుట్టూ ప్రదక్షిణలు చేసేది.కాలాంతరంలో ఆ చక్రవాక పక్షి ఆయువు తీరి మరణించింది.  ఇతర పక్షులలాగా మరణానంతరం కూడా నరకయాతనలేవీ పడకుండా నేరుగా అది స్వర్గానికి చేరుకుంది. రెండు కల్పాలపాటు స్వర్గంలో ఆ పక్షి సకల భోగాలను అనుభవించింది. ఆ తర్వాత భూలోకంలో ఓ రాజుగారి ఇంట మగశిశువుగా ఆ చక్రవాక పక్షి జన్మించింది.

- యల్లాప్రగడ మల్లికార్జునరావు


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని