ఎక్కేందుకు నిచ్చెన.. తొక్కిపెడితే ఉప్పెన

స్వేచ్ఛాస్వాతంత్య్రాలనేవి జీవితానికి నిచ్చెన మెట్లలాంటివి. ఆ మెట్లమీద ఎంతో ఎత్తుకు ఎదగొచ్చు. అలాంటి స్వేచ్ఛను దక్కనివ్వకుండా ఎవరైనా తొక్కిపెడితే ఇవాళ కాకపోతే రేపైనా అది నిప్పుల ఉప్పెనే అవుతుంది. తొక్కిపెట్టిన తొండి తుంటిని విరుస్తుంది. ఆకాశమే నా హద్దంటూ మన మువ్వన్నెల పతాకంలా హాయిగా రెపరెపలాడుతూ ఎగురుతుంది.

Updated : 12 Aug 2021 06:02 IST

ఆగస్టు 15 స్వాతంత్య్ర దినోత్సవం

స్వేచ్ఛాస్వాతంత్య్రాలనేవి జీవితానికి నిచ్చెన మెట్లలాంటివి. ఆ మెట్లమీద ఎంతో ఎత్తుకు ఎదగొచ్చు. అలాంటి స్వేచ్ఛను దక్కనివ్వకుండా ఎవరైనా తొక్కిపెడితే ఇవాళ కాకపోతే రేపైనా అది నిప్పుల ఉప్పెనే అవుతుంది. తొక్కిపెట్టిన తొండి తుంటిని విరుస్తుంది. ఆకాశమే నా హద్దంటూ మన మువ్వన్నెల పతాకంలా హాయిగా రెపరెపలాడుతూ ఎగురుతుంది.
‘స్వేచ్ఛ.. భగవదిచ్ఛ’ అన్నారు. ఇక్కడ భగవంతుడంటే ముక్కోటి దేవతల్లో ఒక దేవత కాదు, సాక్షాత్తూ ధర్మం. అంటే ధర్మానుసారమే స్వేచ్ఛ ఉండాలన్నది ధర్మశాస్త్రాల మాట. అలా కానప్పుడు అది అనైతికం. అప్పుడిక వచ్చేవన్నీ ఇబ్బందులే. దీనికి స్త్రీలు, పురుషులు, బాలలు, వృద్ధులనే భేదం లేదు. కులాలు, మతాలు, వర్గాలు, ప్రాంతాలతో సంబంధం లేదు. రాజైనా పేదైనా... జరిగేది ఇదే.
స్వేచ్ఛ అనే పదం ఎంత చిన్నదో దాని శక్తి అంత అనంతం. స్వేచ్ఛను కాలరాస్తే దాని నుంచి ఉద్యమాల ఉప్పెనలు ఎగసి పడతాయి. అందుకు కారణమైన వారి అంతం చూస్తాయి. స్వాతంత్య్రం గురించి రుగ్వేదం 9వ మండలం 112వ సూక్తం ‘నానానంవా..’ వివరిస్తోంది. అంటే మనిషి మనుగడకు స్వేచ్ఛ ముఖ్యమని వేదకాలంలోనే నిర్ణయమైనట్లు అర్థమవుతోంది.
సృష్టిలో అణువణువూ స్వేచ్ఛను కోరుకుంటుంది. స్వతంత్రంగా మెలగాలనుకుంటుంది. ఆ అణు నిర్మాత, పరమాణు సృష్టికర్త అయిన భగవంతుడి ఇచ్ఛ ప్రకారమే ఇలా జరుగుతోందని వేదాలూ ఉపనిషత్తుల వల్ల స్పష్టమవుతుంది.

అరవిందులవారి నిర్వచనం

మన యోగులలో అరవిందయోగికి ప్రత్యేక స్థానం ఉంది. స్వేచ్ఛాస్వాతంత్య్రాల గురించి ఆయన చాలా సందర్భాల్లో స్పష్టంగా చెప్పారు. ‘మానవత్వం స్వేచ్ఛ నుంచే పుట్టుకొస్తుంది. దానికి తోడుగా సమానత్వం, ఐక్యత అనేవి వచ్చి చేరతాయి. అప్పుడు ఆత్మపరంగా సోదరభావం వృద్ధిచెందుతుంది. అది కేవలం భౌతిక బంధుత్వం కాదు. మనలో దైవిక, ధార్మిక శక్తి పెరిగేలా చేస్తుంది. అభివృద్ధిలో స్వేచ్ఛ ముఖ్య సాధనం’ అంటారాయన.
ప్రాచీన కవులెందరో ఆయా సందర్భాల్లో జీవితానికి అవసరమైన స్వేచ్ఛలు, వాటిని ఎలా వినియోగించుకోవాలనే నియంత్రణలను ప్రతిపాదించారు. స్వేచ్ఛ అనేది సామాజిక హామీ. ఈ హామీలు స్థూలంగా ఐదు. వీటిని వ్యక్తిగత ఆస్తులని కూడా చెప్పొచ్చు. ఆస్తి దుర్వినియోగంతో ఇబ్బందుల పాలైనట్లే, స్వేచ్ఛ దుర్వినియోగంతోనూ కష్టాలు తప్పవని పురాణాల్లో ఉదాహరణలున్నాయి.

సామాజిక స్వేచ్ఛలు

ఇవి కొత్తవేమీ కాదు. యమ నియమాలను గురించి తెలుసుకుంటున్నప్పుడల్లా వీటి ప్రస్తావన వస్తుంది. హింస నుంచి స్వేచ్ఛ పొందటం అహింస. కోరిక నుంచి స్వేచ్ఛను అనుభవించటం అస్తేయం. దోపిడీ నుంచి పొందే స్వేచ్ఛే అపరిగ్రహం. ఉల్లంఘన లేదా అవమానం నుంచి పొందే స్వేచ్ఛ బ్రహ్మచర్యం. అకాలమరణం, వ్యాధుల నుంచి స్వేచ్ఛ పొందడం ఆరోగ్యం. ఈ అయిదింటిని వ్యక్తిగత ధర్మాలని కూడా అంటారు.
స్వేచ్ఛా దుర్వినియోగంతో రామాయణంలో ప్రతినాయకుడు అనుభవించిన కష్టాలు అందరికీ తెలిసినవే. ‘దశకంఠుడు  తన స్వేచ్ఛను దుర్వినియోగం చేసుకుని నంది శాపానికి, ఈశ్వర కోపానికి గురై హిమాలయ పర్వతం కింద చేతులు నలిగి భీకర శబ్దం చేసి స్వేచ్ఛా దుర్వినియోగానికి గుర్తుగా రావణుడిగా పేరు తెచ్చుకున్నాడు’- అన్నది రావణ శబ్దానికి అర్థం. 

ఉద్యోగస్తులకు హెచ్చరిక

యక్షుల రాజు కుబేరుడు. అతడి సేవకుడు స్థూణాకర్ణుడు. కుబేరుడికి తెలియకుండా తన అధికార స్వేచ్ఛను దుర్వినియోగం చేసి ఘోర శాపానికి గురయ్యాడు. సాధారణంగా యక్షులకు ఏ రూపం కావాలంటే ఆ రూపం పొందే మాయా సిద్ధ స్వేచ్ఛ ఉంటుంది. స్త్రీగా పుట్టి, పురుషుడిగా పెరిగి వివాహ సమయంలో నిజం బయట పడుతుందని భయపడి ఏడుస్తూ అడవికి చేరింది శిఖండి. స్థూణాకర్ణుడు ఆమెను చూసి జాలిపడ్డాడు. తన పురుషత్వాన్ని ఆమెకిచ్చి ఆమె స్త్రీత్వాన్ని తాను తీసుకుంటానని చెప్పి, నిజ నిర్ధారణ అయ్యాక మళ్లీ తన పురుషత్వాన్ని తనకిమ్మన్నాడు. ఆమె అందుకు ఒప్పుకుని పురుషుడిగా మారి వెళ్లింది. ఆ తర్వాత కుబేరుడొచ్చి స్థూణార్ణుడు యక్షుల సిద్ధశక్తిని దుర్వినియోగపరచాడని కోపించి ఎప్పటికీ స్త్రీగానే వుండిపొమ్మని శపించాడు. ఇది మహాభారతం ఉద్యోగపర్వంలోని కథ. పై అధికారులకు తెలియకుండా కింది స్థాయి వారు అతిస్వేచ్ఛ చూపితే కష్టాలపాలవుతారని హెచ్చరిస్తుందీ కథ.

నన్నోడి తన్నోడెనా? తన్నోడి నన్నోడెనా?!

స్వేచ్ఛా స్వాతంత్య్రాల హరణం భయంకర పరిస్థితులకు దారితీస్తుందనేందుకు ఈ ప్రశ్న ఓ ఉదాహరణ. జన్మహక్కైన స్వాతంత్య్రాన్ని కొల్లగొట్టే ప్రయత్నం చేస్తే.. అది దేశాధినేత అయినా సరే, కట్టుకున్న భర్త అయినా సరే.. నిగ్గదీసి నిప్పులతో కడిగిన తీరు ఈ ప్రశ్న అడిగిన ద్రౌపదిలో కనిపిస్తుంది. మహాభారతం సభా పర్వంలో వస్త్రాపహరణ సందర్భంలో ‘నా స్వామి.. నన్నోడి తన్నోడెనా? తన్నోడి నన్నోడెనా?’ అంటుందామె. అంటే ధర్మరాజు ముందుగా తనను తాను ఓడిపోయాక, నన్ను ఓడిపోయాడా? అలాగైతే ఆ పందెం చెల్లదు. ధర్మరాజుకు ద్రౌపదిని పందెం ఒడ్డే అర్హత అప్పుడిక ఉండదు. తనను ఓడాక ధర్మరాజు దుర్యోధనుడికి బానిస. ధర్మరాజుతో పాటు ద్రౌపది కూడా దుర్యోధనుడికి బానిస అవుతుంది. అయినా కానీ దుర్యోధనుడికి ధర్మరాజు ప్రత్యక్ష బానిస కనుక ధర్మరాజుకి ఇల్లాలయిన ద్రౌపది దుర్యోధనుడికి పరోక్ష బానిస అవుతుంది. ద్రౌపది మాత్రం ధర్మరాజు అధీనంలోని మనిషే అవుతుంది. అప్పుడు ఏ ఆజ్ఞనైనా ద్రౌపది పాటించాలంటే ధర్మరాజు చెప్పాల్సి వుంటుంది. ఆ విధంగా కాక ధర్మరాజు, ముందు ద్రౌపదిని పందెం ఒడ్డి ఓడిపోయి, తర్వాత తనను తాను పందెంగా పెట్టుకొని ఓడిపోయినట్టయితే ద్రౌపది దుర్యోధనుడికి ప్రత్యక్ష బానిస. నేరుగా దుర్యోధనుడు ద్రౌపదిని ఏం చెయ్యమనైనా ఆజ్ఞాపించవచ్చు. ఈ ధర్మసందేహాన్ని తీర్చమని ద్రౌపది ఆనాడు నిలదీసింది అందరినీ. ఇది ఆమె తన అస్తిత్వాన్ని నిలపడమే కాదు, స్వేచ్ఛ తన జన్మహక్కని గట్టిగా నమ్మి స్థిరంగా వేసిన ప్రశ్న. అది సభలో ఉన్న పెద్దలందరికీ సూటిగా గుచ్చుకుంది. అప్పటికి తాత్కాలికంగా అధర్మం పైచేయిగా ఉన్నప్పటికీ, తర్వాత ఆ ప్రశ్నే కణకణమండే నిప్పుకణమై ద్రౌపది మనోభీష్టాన్ని నెరవేర్చింది. కనుక స్వేచ్ఛను తొక్కిపెట్టాలని చూసిన ప్రతిసారీ అది నిప్పుల ఉప్పెనే అవుతుంది. అధర్మాన్ని అంతం చేస్తుంది.
 

- డాక్టర్‌ యల్లాప్రగడ మల్లికార్జునరావు


మధ్వాచార్యుల భాష్యం

కన్యోదితా బత కులద్వయతారిణీతి జాయా సఖేతి వచనం శ్రుతిగం శ్రుతశ్చ పుట్టింటికీ మెట్టినింటికీ మంచి పేరు తెచ్చి, తమ జీవితాలను సార్థకం చేసుకునే స్త్రీలకు స్వేచ్ఛాస్వాతంత్య్రాలూ గౌరవమర్యాదలూ ఇవ్వాలన్నది మధ్వాచార్యులవారి మాటల్లోని అంతరార్థం.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని