కోరికకుకృషి తోడవ్వాలి!

బుద్ధ భగవానుడు ద్వైతవనంలో విడిదిచేసి ఉన్నాడు. అమలుడనే రాజవంశానికి చెందిన యువకుడు తనను శిష్యుడిగా ...

Published : 06 Feb 2020 00:10 IST

 బోధివృక్షం

బుద్ధ భగవానుడు ద్వైతవనంలో విడిదిచేసి ఉన్నాడు. అమలుడనే రాజవంశానికి చెందిన యువకుడు తనను శిష్యుడిగా స్వీకరించమని అర్థించాడు. బుద్ధుడు అమలుడికేసి పరిశీలనగా చూశాడు.

అతని శరీరం కుసుమ కోమలంగా ఉంది. కష్టం తెలియని అతడు భిక్షువుగా కఠిన జీవితాన్ని తట్టుకోలేడనిపించింది.

ఆ విషయాన్నే బుద్ధుడతడికి మృదువుగా చెప్పాడు.

కానీ అమలుడు పట్టువదల్లేదు.

బుద్ధుడు ఎలాంటి దీక్షా ఇవ్వకుండా పదిరోజుల పాటు విహారంలో ఉండి, ఇతర శిష్యులు చేసేవన్నీ చేయమన్నాడు.అమలుడు సరేనన్నాడు.

శిష్యులంతా బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి కాలకృత్యాలు ముగించుకుని ధ్యానమందిరానికి చేరుకునేవారు. అమలుడు మాత్రం ఆలస్యంగా నిద్రలేచి, తయారై ధ్యానమందిరానికి వచ్చేవాడు. అందరికంటే వెనక కూర్చునేవాడు. బుద్ధుడు అన్నీ గమనిస్తూనే మౌనంగా చూస్తుండేవాడు.

ఇలా పది రోజులు గడిచాయి. అమలుడు బుద్ధుడి ముందు భక్తితో ప్రణమిల్లాడు. ‘భగవాన్‌! నేను భిక్షువుగా పనికిరాను. నాకు సెలవిప్పించండి’ అన్నాడు.

బుద్ధుడు మందహాసం చేసి ‘నువ్వు గొప్ప భిక్షువు కాగలవు. నీకు దీక్ష ఇస్తున్నాను’ అన్నాడు. ఆశ్చర్యంతో, అపనమ్మకంతో చూస్తున్న అమలుడితో

‘నాయనా! నువ్వు నిజంగా అనర్హుడివైతే రెండో రోజే వెళ్లిపోయేవాడివి. నీకు బలమైన కోరిక ఉంది. దానికి కృషి కూడా తోడు కావాలి. ఇవి రెండూ ఉంటే నువ్వు అనుకున్నది సాధించగలుగుతావు’ అని చెప్పాడు.

బుద్ధుడి బోధను మనసుకు పట్టించుకున్న అమలుడు అనతికాలంలోనే ఉత్తమ శిష్యుడనిపించుకున్నాడు.

- కె.రాఘవేంద్రబాబు


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు