దయామయి మేరీ

అంధకారాన్ని చీల్చుకుంటూ సూర్యుడు ఉదయించినట్లు అజ్ఞానాన్ని తొలగించేందుకు యేసుక్రీస్తు ఉద్భవించాడు. దోషులనూ క్షమించిన దయామూర్తి. పాపులనూ ప్రేమించిన కరుణామయుడు. సమాజహితం కోసం అవమానాలను సహించాడు. సిలువయాతన భరించాడు. ఆ దైవ కుమారుడికి జన్మనిచ్చిన మరియమ్మ సెయింట్‌ మేరీగా ప్రార్థనలందుకుంటోంది.

Updated : 23 Dec 2021 05:29 IST

డిసెంబర్‌ 25 క్రిస్మస్‌

అంధకారాన్ని చీల్చుకుంటూ సూర్యుడు ఉదయించినట్లు అజ్ఞానాన్ని తొలగించేందుకు యేసుక్రీస్తు ఉద్భవించాడు. దోషులనూ క్షమించిన దయామూర్తి. పాపులనూ ప్రేమించిన కరుణామయుడు. సమాజహితం కోసం అవమానాలను సహించాడు. సిలువయాతన భరించాడు. ఆ దైవ కుమారుడికి జన్మనిచ్చిన మరియమ్మ సెయింట్‌ మేరీగా ప్రార్థనలందుకుంటోంది.

క్రీస్తు పూర్వమే యెషయా అనే ప్రవక్త క్రీస్తు పుట్టుక గురించి బైబిల్‌లో ప్రవచించాడు. ఏడు శతాబ్దాల తర్వాత జెరూసలేంకు సుమారు వంద మైళ్ల దూరానున్న నజరెత్‌ గ్రామంలో మేరీ అనే పెళ్లి కాని యువతికి దేవదూత ప్రత్యక్షమై ‘నీకు కుమారుడు జన్మించబోతున్నాడు. అతను చాలా గొప్పవాడు అవుతాడు’ అన్నాడు.(లూకా1:26) ఆ మాటలు సత్యమయ్యాయి.

చరిత్ర కెక్కిన బెత్లెహాం గ్రామం

నాటి రోమన్‌ పాలకుని ఆదేశానుసారం అంతా స్వస్థలాలకు బయల్దేరారు. ఆ మేరకు మేరీ, ఆమెతో నిశ్చితార్థమైన జోసెఫ్‌ నజరెత్‌ నుంచి బెత్లెహాంకు వెళ్లారు. అక్కడ క్రీస్తు జన్మించాడు. పాపపంకిల లోకాన్ని రక్షించే దివ్యశక్తిని దర్శించు కోమని దేవదూతలు బెత్లెహాం పొలాల్లో గొర్రెల కాపరులకు సమాచారం ఇచ్చారు. క్రీస్తు జన్మించిన కొన్ని రోజులకు ఆకాశంలో తోకచుక్క కనిపించగా, అది దివ్యపురుషుడి ఆగమనానికి చిహ్నంగా భావించారు. ‘దేవుని మహిమ.. జీవులందరికీ శాంతి కలుగుగాక!’ అంటూ దేవదూతలు గానం చేశారు.

ఆదర్శపురుషుడు జోసెఫ్‌

మేరీ గర్భం దాల్చడంతో, జోసెఫ్‌ నిశ్చితార్థం రద్దు చేసుకుని వెళ్లిపోవాలనుకున్నాడు. కానీ దైవదూత కలలో కనిపించి, మేరీ గర్భానికి దైవశక్తే కారణమని చెప్పడంతో, అతడు మంచి మనసుతో మేరీకి జీవితాంతం తోడుగా నిలిచాడు. అందుకే జోసెఫ్‌ పేరు ప్రఖ్యాతమైంది.

విమర్శలను ఎదుర్కొన్న ధీశాలి

కన్యగానే గర్భం దాల్చినందుకు ఎందరు అవమానించినా మనోబలంతో నిలబడింది. దైవదూత గాబ్రియేల్‌ దర్శనమిచ్చి సాక్షాత్తూ దైవ కుమారుడికి జన్మనివ్వబోతున్నావని చెప్పినప్పుడు, మేరీకి పద్నాలుగేళ్లు మాత్రమే. ఆ చిరుప్రాయంలోనే ‘మీ వాక్కు నెరవేరు గాక!’ అని శిరసావహించడం దైవంపట్ల ఆమెకున్న అచంచల విశ్వాసానికి దర్పణం పడుతుంది.

బాధలు, వేదనలే వెంటాడాయి..

నిండు గర్భిణిగా ఉండి, నజరెత్‌ నుంచి రోజుల తరబడి గాడిదమీద ప్రయాణించడమంటే ఆ మనోబలం సామాన్యమైంది కాదు. సరైన స్థలం దొరకక ఓ పశువులకొట్టంలో ప్రసవించింది. తర్వాత మేరీ పసిబిడ్డగా ఉన్న క్రీస్తును జెరూసలేం దేవాలయానికి తెచ్చినప్పుడు, సుమియోను అనే వృద్ధ ప్రవక్త ‘అమ్మా! నీ హృదయంలోకి ఖడ్గం దూసుకుపోతుంది’ అంటూ క్రీస్తు శిలువ గురించి ముందుగానే చెప్పాడు. అప్పుడా తల్లిహృదయం ఎంత క్షోభించిందో కదా! ఇలా అనేక తీపి, చేదు అనుభవాలతో మేరీమాత మూడు దశాబ్దాలు తల్లిగా బాధ్యతలు సమర్థంగా నిర్వహించింది.

దైవ చిత్తాన్ని అంగీకరించింది

క్రీస్తు ప్రబోధలకై పర్యటిస్తున్న రోజుల్లో ఒకసారి ఆయన్ను చూడాలని వెళ్లింది మేరీ. తల్లీ, సోదరులు వచ్చినట్లు పరిచారకులు చెప్పగా బంధుత్వాలకు తావులేదన్నారు క్రీస్తు. అందుకు మరియమ్మ బాధపడకపోగా అర్థం చేసుకుంది. మరో సందర్భంలో.. క్రీస్తు బోధలకు ముగ్ధులైనవారు, ‘నిన్ను కన్న తల్లి ఎంత ధన్యురాలో కదా’ అన్నారు. దానికి క్రీస్తు ‘నిజమే కానీ నన్ను విశ్వసించి, నా ఆజ్ఞలు స్వీకరించేవారు ఇంకా ధన్యులు’ అన్నాడు. ఆ మాటలు నిజమేననుకుంది తప్ప ఏ వ్యాఖ్యా చేయలేదు మరియమ్మ.

సిలువ సమయంలో ప్రత్యక్ష సాక్షి

క్రీస్తు మూడు పదుల వయసులో ఉండగా సిలువ వేశారు. ఆ క్లిష్ట పరిస్థితుల్లో, దారుణ మారణకాండ సమయంలో శిష్యులంతా పారిపోయినా మదర్‌ మేరీ ధైర్యంగా నిలిచింది. యేసును సమాధి చేసినపుడు, ఆయన ఆనక పునరుత్థానుడైనప్పుడు కూడా మరియమ్మ ఆయన వెంటే ఉంది. మానవాళిని అజ్ఞానాంధకారం నుంచి విడిపించిన దైవ కుమారుడికి జన్మనిచ్చింది మొదలు, మహాభినిష్క్రమణం వరకు వెన్నంటే నిలిచిన స్త్రీమూర్తిగా విశ్వ చరిత్రలో, ఆధ్యాత్మిక సంపదలో సెయింట్‌ మేరీగా సుస్థిర స్థానాన్ని దక్కించుకుంది.


క్రిస్మస్‌కు కారణభూతురాలు మరియమ్మ

భక్తి, సహనం, పవిత్రతలున్న ఓ కన్యక కోసం భగవంతుడు శతాబ్దాలపాటు వేచి ఉన్నాడు. సమయం ఆసన్నమైనప్పుడు పాలస్తీనాలోని మేరీ దేవుడి దృష్టికి అనుకూలవతిగా కనిపించింది. ఆమె ద్వారా క్రీస్తును భూమి మీదకు పంపించాడు. అలా క్రిస్మస్‌కు కారణభూతురాలైంది మరియమ్మ.

- కొలికపూడి రూఫస్‌


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని