భగవదార్పితం

తన కోరికతో సంబంధం లేకుండా కర్మలన్నీ భగవంతుడికి అర్పించడం ముక్తిని సాధించడానికి మార్గం అవుతుందంటారు రమణులు. కర్మ వలన దుఃఖం కలుగుతుందనే భావన పోవాలంటే ఫలితాన్ని అపేక్షించకుండా కర్మను ఆచరించాలి.

Published : 22 Sep 2022 00:34 IST

ఈశ్వరార్పితం నేచ్ఛయా కృతం
చిత్తశోధకం ముక్తి సాధకం

న కోరికతో సంబంధం లేకుండా కర్మలన్నీ భగవంతుడికి అర్పించడం ముక్తిని సాధించడానికి మార్గం అవుతుందంటారు రమణులు. కర్మ వలన దుఃఖం కలుగుతుందనే భావన పోవాలంటే ఫలితాన్ని అపేక్షించకుండా కర్మను ఆచరించాలి. కర్మలను ప్రసాదంగా స్వీకరిస్తే దుఃఖం అనుభవించే సమస్యే రాదు. దుఃఖం లేకపోవడమే మోక్షప్రాప్తి. కర్మను దైవానికి అర్పితం చేసినప్పుడు ఆ కర్మలకు తగిన ఫలాలను ఇచ్చే విషయంలో ఆయనే జాగ్రత్తపడతాడు.

యమునోత్రి వద్ద యమునాదేవి గుడి సమీపంలో యాత్రికులు బియ్యాన్ని వస్త్రంలో మూటకట్టి వేడినీళ్లలో ముంచి ఉడికిస్తారు.  అలా వండిన అన్నాన్ని అమ్మవారికి నైవేద్యం పెట్టి యాత్రకు వెళ్తారు. పక్షం తర్వాత తిరిగొచ్చి ఆ ప్రసాదాన్ని బంధుమిత్రులకు పంచిపెడతారు. అన్నం వండిన కొన్ని గంటల తర్వాత దాన్ని ముట్టుకోని ఆచారపరాయణులు కూడా భక్తి వల్ల యమునోత్రి నుంచి తెచ్చిన  ఆ ప్రసాదాన్ని ఆనందంగా స్వీకరిస్తారు. ఇలా భావించడం వల్ల కర్మలూ, ఫలితాలూ కూడా భగవదార్పితమై మనల్నిక బాధించవు.

ఎవరైతే కర్మఫలాలను భగవత్ప్రసాదాలుగా చూడగలరో వారు కర్మలు, వాటి ఫలాలపై సరైన దృక్పథాన్ని అలవరచుకుంటారు. కర్మల పట్ల మమకారం గానీ, వాటి ఫలాల మీద ఇష్టాయిష్టాలు గానీ ఉండవు. ప్రసాదం తనకు ఇష్టమా కాదా, నాణ్యమైందేనా, రుచిగా ఉంటుందా- అని విచారించం కదా! కర్మలకు తగిన ఫలాన్నిచ్చే బాధ్యత భగవంతుడిది ఐనప్పుడు వాటి గురించి బాధపడటం రైల్లో ప్రయాణిస్తూ కూరల గంపను తలపై మోసిన చందమే. భక్తిలేని కర్మ బంధ హేతువవుతుంది. కర్మయోగానికి జ్ఞానాన్ని జోడిస్తే మోక్షం ప్రాప్తిస్తుంది. ఇదే రమణమార్గం.

- శ్రీమయి


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని