ధనార్జన పరమావధిని తెలిపే గీత

భాగవతం ఏకాదశ స్కందంలో ఉంది భిక్షుగీత. శ్రీకృష్ణుడు ఉద్ధవగీత బోధిస్తుండగా మధ్యలో ఉద్దవుడడిగిన ప్రశ్నలకు సమాధానంగా భిక్షుగీతను వినిపించాడు. జీవితమంతా ధనార్జనలోనే గడిపి లోభిగా మిగిలిపోయాడు భిక్షుకుడు.

Published : 22 Sep 2022 00:51 IST

భాగవతం ఏకాదశ స్కందంలో ఉంది భిక్షుగీత. శ్రీకృష్ణుడు ఉద్ధవగీత బోధిస్తుండగా మధ్యలో ఉద్దవుడడిగిన ప్రశ్నలకు సమాధానంగా భిక్షుగీతను వినిపించాడు. జీవితమంతా ధనార్జనలోనే గడిపి లోభిగా మిగిలిపోయాడు భిక్షుకుడు. తర్వాత ఆత్మావలోకనం ప్రారంభించి ఆత్మ స్వరూపాన్ని గ్రహించి శ్రీకృష్ణ భక్తుడిగా మారిపోయాడు. అప్పుడతనికి అసలైన శత్రువు ధనమేనని జ్ఞానోదయమైంది. తనకోసం తాను ఖర్చు పెట్టనివాడు లోభి అవుతాడు. ఆ విషయంలో తాను పరమలోభినన్న విషయం అర్థమైంది. దానధర్మాలు చెయ్యని కారణంగా మరణానంతరం నరకానికే పోతాననుకున్నాడు. పీనాసితనం కుష్టురోగం లాంటిది, అది సుగుణాలను హరించి, కీర్తిని నశింపచేస్తుంది.

మనిషి శ్రమించి సంపాదిస్తున్నాడు. దాన్ని వృద్ధిచేయడానికి, కాపాడటానికి కష్టపడు తున్నాడు. ఖర్చు చేసేందుకు, అనుభవించ డానికి ఆలోచిస్తున్నాడు. తన సంపదను ఎవరైనా దొంగిలిస్తారేమోనని భయపడు తున్నాడు. అలా నిరంతరం శ్రమ, భయం, చింతలతో పోరాటం చేయాల్సివస్తోందని భిక్షుకుడు ఆత్మవిమర్శ చేసుకున్నాడు. దొంగ తనం, హింస, అసత్యం, కామం, క్రోధం, గర్వం, అహంకారం, వైరం, అవిశ్వాసం, స్పర్ధ, లంపటత్వం, జూదం, మద్యపానం- ఇవన్నీ ధనార్జనవల్లేనని భిక్షుకుడు గుర్తించాడు. ధనానికి ఎంత దూరంగా ఉంటే మనిషి అంత సుఖపడగలడని, అది బంధుమిత్రులను దూరం చేయడాన శత్రువులుగా మారుతున్నారని అనుకున్నాడు. లోభత్వం చూపడాన తల్లిదండ్రుల కనికరింపు కరువైంది. భార్యాపుత్రులు మాట్లాడటం మానేశారు. సోదరులు దూరంగా వెళ్లిపోయారు. బంధుమిత్రులు ముఖం చాటేసి ఒంటరిని చేశారు. ధనమెంత పాపిష్టిదో కదా! జన్మ పరమార్థాలను గ్రహించ లేక పోయినందుకు బాధపడ్డాడు. ఉన్నదాన్ని అనుభవించాలి. కుటుంబసభ్యులకు పంచిపెట్టాలి. తోడపుట్టినవారికి వాటాలు చెల్లించాలి. పితరులు, రుషులు, దేవతలకు పంచయజ్ఞ సిద్ధాంతం ప్రకారం ఖర్చు చేయాలి. జీవరాశులకు ఆహారాన్ని నివేదించాలి. ఇలా చేయకుంటే ఆర్జించిన దానికి కావలిదారుగా ఉండిపోతాడు. పుణ్యకార్యాలు చేయకుండానే జీవితం ముగుస్తుంది. అంతిమంగా నరకమే ప్రాప్తిస్తుంది. అలా కాకూడదంటే ధనార్జనే జీవితం కాదని తెలుసు కోవాలి. దానధర్మాలు, పుణ్యకార్యాలతో జన్మను సార్థకం చేసుకోవాలని భిక్షుకుడికి జ్ఞానోదయమైంది. ఈ సందేశమే ఈ గీత పరమావధి.                

- మల్లు, గుంటూరు


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని