లౌకిక దృష్టి.. వైరాగ్య స్థితి

భాగవత ప్రవచనాల్లో ఒక కథ ప్రముఖంగా వినిపిస్తుంటుంది. వ్యాస మహర్షి కుమారుడైన శుకుడికి పదహారేళ్లు. వేదవిద్య నేర్చిన తర్వాత తనకీ ప్రపంచంతో పనిలేదని, తపస్సు చేసు కుందామని బయల్దేరాడు.

Updated : 29 Sep 2022 04:48 IST

భాగవత ప్రవచనాల్లో ఒక కథ ప్రముఖంగా వినిపిస్తుంటుంది. వ్యాస మహర్షి కుమారుడైన శుకుడికి పదహారేళ్లు. వేదవిద్య నేర్చిన తర్వాత తనకీ ప్రపంచంతో పనిలేదని, తపస్సు చేసుకుందామని బయల్దేరాడు. దాంతో వ్యాసుడు ‘అయ్యో! సంసారంలో ఏ సుఖానికీ నోచుకోకుండా వెళ్లిపోతున్నాడే’ అని ఆందోళన చెందుతూ ‘నాయనా! కొంచెం ఆగు. ఒక్క మాట విను!’ అంటూ శుకుడి వెంట పరుగెత్తాడు. ‘తండ్రీ! నేను పూర్తి వైరాగ్యంలో ఉన్నాను. హిమాలయాల్లోని దేవ భూముల్లో తపస్సు చేసేందుకు వెళ్తున్నాను. నన్ను క్షమించి వదిలి వెళ్లండి’ అంటూ శుకుడు ముందుకు సాగాడు. ఆ సమయంలో సరోవరంలో అప్సరసలు స్నానాలు చేస్తూ ముచ్చటించుకుంటున్నారు. శుకుడు అందగాడైన యువకుడు. పైగా దిగంబరంగా వెళ్తున్నాడు. అయినా అప్సరసలు సిగ్గుపడలేదు. కనీసం పట్టించుకోలేదు. ఆ వెనకే ‘కుమారా! కుమారా’ అంటూ అనుసరిస్తున్న వ్యాసుణ్ణి చూసిన అప్సరసలు ‘అమ్మో!’ అంటూ గబగబా దుస్తులు వేసుకున్నారు. వ్యాసుడు ఆశ్చర్యపోయి ‘కుర్రవాడైన నా పుత్రుణ్ణి చూసి మీరు కొంచెమైనా సిగ్గు పడలేదు. ముసలి వాణ్ణి నేను వెళ్తుంటే సిగ్గుపడున్నారు?’ అనడిగాడు. దానికి అప్సరసలు ‘వీళ్లు పురుషులు, వీళ్లు స్త్రీలు, ఇలా ఉండాలి, ఇలా ఉండకూడదు అనే స్పృహ మీకుంది. కానీ అతడిలో ఈ లౌకిక ఆలోచనలేవీ లేవు. మీరు మా బాహ్య రూపాలనే చూస్తున్నారు. కానీ అతడు ఎవరిని చూసినా, ఆ శరీరంలోని జీవుడు, అందులోని పరమాత్మల వైపు మాత్రమే దృష్టి సారిస్తున్నాడు. పరమాత్మ తత్త్వమే తప్ప, బాహ్య విషయాలేవీ కనిపించని అతనికి ప్రపంచంతో పనేముంటుంది? అలాంటి పరిపూర్ణ వైరాగ్య స్థితిలో ఉన్న శుక మహర్షి దగ్గర సిగ్గుపడాల్సిన అవసరమే లేదు కదా!’ అని జవాబిచ్చారు. ఆ మాటలతో శుకుడి గొప్పతనం అర్థమై పుత్ర వ్యామోహం విడిచిపెట్టి, వెనుదిరిగాడు వ్యాసుడు.

- హైందవి శారదాదిత్య


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని