మహాశివుడు తన కొడుకట!

బెజ్జమహాదేవి గొప్పశివభక్తురాలు. శివుడికి తల్లి లేదని బాధపడేది. తల్లి ఉంటే జుట్టు జడలుకట్టనిచ్చేదా? బూడిద పూసుకోనిచ్చేదా? పామును మెడలో వేసుకోనిచ్చేదా? విషం తాగనిచ్చేదా? శ్మశానంలో ఉండనిచ్చేదా? తల్లి లేనందువల్లే అలా కష్టస్థితిలో ఉన్నాడనే బాధ తీవ్రమై ఆ లోటు తీర్చాలనుకుంది.

Published : 20 Oct 2022 00:22 IST

బెజ్జమహాదేవి గొప్పశివభక్తురాలు. శివుడికి తల్లి లేదని బాధపడేది. తల్లి ఉంటే జుట్టు జడలుకట్టనిచ్చేదా? బూడిద పూసుకోనిచ్చేదా? పామును మెడలో వేసుకోనిచ్చేదా? విషం తాగనిచ్చేదా? శ్మశానంలో ఉండనిచ్చేదా? తల్లి లేనందువల్లే అలా కష్టస్థితిలో ఉన్నాడనే బాధ తీవ్రమై ఆ లోటు తీర్చాలనుకుంది. తల్లి ఆలన పాలన లేకుండానే ఇంతగా ఎదిగిన వాడు, తల్లి ఉండి యోగక్షేమాలు చూస్తే ఇంకెంత పెద్దవాడయ్యేవాడో! అనిపించింది. ఆ వెంటనే శివయ్యను పసిబాలుడిగా, తనను తల్లిగా భావించుకుంది. పసిబిడ్డకి చేసే సేవలన్నీ శ్రద్ధగా చేసింది. కచ్చికను విభూతిగా పెట్టేది. కళ్లకి కాటుక పులిమేది. పాలుపట్టి జోకొట్టి బజ్జోపెట్టేది. బెజ్జమహాదేవిని పరీక్షించటానికి శివుడు జబ్బుచేసినట్టు నటించాడు. ఆమె కంగారుపడిపోయింది. పాలు తాగటం లేదు కనుక ‘అంగిటిముల్లు’ అనుకుని మందువేసి తోచిన ఉపచారాలు చేసింది. ప్రయోజనం లేక బాధపడింది, నిష్ఠూరమాడింది. ‘నిమ్మవ్వ ఇంట్లో ఆడి ఆడి అలిసిపోయావట! పిట్టవ్వ కోసం పిట్టు అమ్మటానికి వెళ్లావట! ఇంకా ఏవేవో చెబుతున్నారు. ఇంట్లో నీకేం తక్కువ లేదుగా! చెప్పినట్టు విని, పెట్టింది తింటే జబ్బుచేసేది కాదు. ఇది స్వయంకృతం. అయినా నీ బాధ నేను చూడలేకపోతున్నాను. ఏం చేసినా తగ్గటంలేదు. ప్రాణానికి ప్రాణమే మందు. కనుక నీ కోసం నా ప్రాణాలు వదులుతాను’ అని ప్రాణత్యాగానికి సిద్ధమైంది. అప్పుడు శివుడు ప్రత్యక్షమై నీవంటి తల్లి ఉండగా నాకేమీ కాదు. నువ్వు నేటి నుంచీ అమ్మవ్వగా ప్రసిద్ధి పొందుతావు’ అంటూ ఆమెకి మోక్షం ప్రసాదించాడు.

- తుషార్‌


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని