ఆరనీకుమా ఈ దీపం...

పండుగలన్నీ పర్యావరణ క్షేమాన్ని, మన ఆరోగ్యాన్ని కాపాడేవే. కార్తిక పూర్ణిమ కూడా అలాంటిదే. ఇది స్త్రీలకు మాంగల్య సౌభాగ్యాన్ని, దీర్ఘకాల దాంపత్యాన్ని ప్రసాదిస్తుందని విశ్వసిస్తారు.

Published : 03 Nov 2022 00:08 IST

నవంబర్‌ 8 కార్తిక పౌర్ణమి

పండుగలన్నీ పర్యావరణ క్షేమాన్ని, మన ఆరోగ్యాన్ని కాపాడేవే. కార్తిక పూర్ణిమ కూడా అలాంటిదే. ఇది స్త్రీలకు మాంగల్య సౌభాగ్యాన్ని, దీర్ఘకాల దాంపత్యాన్ని ప్రసాదిస్తుందని విశ్వసిస్తారు. రోజంతా ఉపవాసం ఉండి, సాయంత్రం వేళ ఆలయంలో 365 వత్తులతో అఖండ దీపం వెలిగిస్తారు. ఇలా చేయడం వల్ల ఏడాది మొత్తం దీపారాధన చేసిన ఫలితం లభిస్తుంది. చలిని నియంత్రించి, దేహానికి వేడినిచ్చే పదార్థాలైన చలిమిడి, అటుకులను నేవేద్యంగా సమర్పిస్తారు. దీపాలు వెలిగించడం వల్ల వాతావరణంలో ఉండే తేమ తగ్గి, శ్వాస సంబంధిత సమస్యలు తలెత్తవు. తులసి, రావి, ఉసిరి చెట్ల కింద దీపాలు వెలిగించడంలో ఆంతర్యం ఏమంటే ఇవి విడుదల చేసే ఆమ్లజని వల్ల దీపాలు ఎక్కువసేపు ప్రజ్వలించి గాలిలో తేమను హరిస్తాయని. ఈ రోజున 11 ఉసిరికాయలను బ్రాహ్మణులకు దానం ఇస్తే విశేష పుణ్యం లభిస్తుందంటారు. కేదారేశ్వర వ్రతం కూడా ఈ రోజున నిర్వహిస్తారు. తిరువన్నామలై అరుణాచల కొండమీద కార్తిక పూర్ణిమ నాడు ఉదయం భరణి దీపం, సాయంత్రం అఖండ దీపం వెలిగిస్తారు. శివుడు త్రిపురాసురులను సంహరించింది ఈ రోజే. 14వ మనువైన భౌత్యుని మన్వంతరం మొదలైంది కూడా ఈ కార్తిక పున్నమి రోజునే. ఈ రోజున వెలిగించే జ్వాలా తోరణాన్ని చూస్తే యమలోకప్రాప్తి ఉండదని పురాణాలు చెబుతున్నాయి.

- శ్రావణి


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని