కుంతిని శపించిన ధర్మరాజు

కురుక్షేత్ర సంగ్రామం ముగిసింది. యుద్ధంలో మరణించిన వీరులకు దహన సంస్కారాలు చేయిస్తున్నాడు ధర్మరాజు.

Updated : 05 Jan 2023 00:29 IST

కురుక్షేత్ర సంగ్రామం ముగిసింది. యుద్ధంలో మరణించిన వీరులకు దహన సంస్కారాలు చేయిస్తున్నాడు ధర్మరాజు. అంతలో కుంతీదేవి వచ్చి ‘అలవికాని పరాక్రమవంతుడైన కర్ణుడు, రాధేయుడు కాదు. నా కుమారుడే. సూర్య వరప్రసాదం వలన జన్మించిన ఆ మహానుభావుడికి కూడా తిలోదకాలివ్వు’ అంది. ఆ మాటలకు తల్లడిల్లిపోయాడు ధర్మరాజు. ‘కర్ణుడు మా సోదరుడేనన్న విషయం ముందే తెలిసుంటే, కౌరవ సైన్యం వ్యాకులం చెందకుండా నడుచుకునేవాళ్లం. ఇంత జననష్టం వాటిల్లేది కాదు’ అని దుఃఖిస్తూ వణుకు తున్న స్వరంతో గోత్ర నామాదులు చెబుతూ కర్ణుడికి తిలోదకాలు అర్పించాడు.

తన అన్నని చేజేతులా చంపుకున్నామని కుమిలిపోయాడు ధర్మరాజు. అది చూసిన కుంతి ‘నాయనా! ఈ జన్మరహస్యాన్ని కర్ణుడికి చెప్పి నీ వైపు చేరమన్నాను. ఆ సమయంలో సూర్యభగవానుడు కూడా పుత్రుడి క్షేమాన్ని ఆలోచించి నేను చెప్పింది నిజమేనన్నాడు. అయినా కూడా తాను దుర్యోధనుణ్ణి ఆశ్రయించానని, అతణ్ణి వదిలి రానని నిక్కచ్చిగా చెప్పిన కర్ణుడి గురించి నువ్వు బాధ పడకు’ అని ఓదార్చింది.

తల్లి మాటలను ధర్మరాజు ఏవగించుకున్నాడు. ‘ఇకపై స్త్రీలందరూ రహస్యాన్ని దాచుకునే శక్తిని కోల్పోవుదురు గాక!’ అని శపించాడు. ఆ శాపం వల్లే ‘స్త్రీలు రహస్యాలను దాచుకోలేరు, వారి నోళ్లలో నువ్వు గింజైనా నానదు’ అన్న నానుడి వచ్చింది.

నారంశెట్టి ఉమామహేశ్వరరావు


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని