మార్గం చూపే మహాభారతం

స్థితిగతులనేవి విధివిధేయాలంటారు కొందరు. అదేంకాదు, అన్నీ మనచేతిలోనే ఉంటాయంటారు ఇంకొందరు.

Published : 30 Mar 2023 00:16 IST

స్థితిగతులనేవి విధివిధేయాలంటారు కొందరు. అదేంకాదు, అన్నీ మనచేతిలోనే ఉంటాయంటారు ఇంకొందరు. ఏదీ మన అధీనంలో ఉండదు- అనుకుంటే అది నిరాశావాదం. అంతా మన సొంతమే- అనుకుంటే అహంకారం. నిదానంగా ఆలోచిస్తే నిజమేంటో తెలుస్తుంది. అనాదిగా మనవాళ్లు సృష్టిరహస్యం తెలుసుకోవడానికి కృషి చేస్తూనే ఉన్నారు. ఆ మర్మం గ్రహించినవారు చీకూచింతా లేక నిశ్చింతగా ఉంటారు. అర్థంకాని సామాన్యులే సతమతమవుతుంటారు.

సగటు మనిషికి చావుపుట్టుకల రహస్యం పట్ల ఆసక్తి లేకపోవచ్చు. చావు గురించి బెంగ లేకున్నా భయం లోలోపల బాధపెడుతుంటుంది. తాను లేకపోతే తనవాళ్ల గతి ఏమిటన్న భీతి కలుగుతుంది. మహాభారతం మరణభయాన్ని పోగొట్టగల మార్గదర్శి. ‘ధర్మో రక్షతి రక్షితః’ అన్నారు. ధర్మాన్ని రక్షిస్తే అది మనల్ని రక్షిస్తుంది. ధర్మం కోసం అడవుల పాలైన ధర్మరాజు ఒకరోజు మార్కండేయ మహర్షి ఆశ్రమానికి వచ్చాడు. ధర్మపత్ని ద్రౌపది కష్టాలపాలు అయినందుకు కన్నీళ్లు పెట్టుకున్నాడు. సతీసావిత్రి మృత్యువును పసిగట్టి సత్యవంతుణ్ణి రక్షించుకున్నట్టు ద్రౌపది సకల సౌభాగ్యవతి కాగలదని ధైర్యం నూరిపోశాడు మహర్షి. అహంకార, మమకారాలు భవరోగ కారణాలు. ప్రారబ్ధ కర్మ స్వయంకృతాపరాధం. భవిష్యత్తులో కర్మబంధం ఏర్పడకుండా సద్భావన కలిగి సన్మార్గంలో పయనించే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అదే జీవన్ముక్తి. ఒక జీవి ఎరుకతో, విచక్షణతో చేసే పనులన్నీ దివ్యకర్మలే అవుతాయి. హంస వలె పాలు, నీరు వేరుచేయగల స్థితిలో పరమ పురుషార్థం (మోక్షం) సాధించడమే జీవిత గమ్యం.

ఉప్పు రాఘవేంద్ర రావు


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని